టీటీడీ విశ్రాంత ఉద్యోగి హత్య

ABN , First Publish Date - 2022-08-09T07:31:25+05:30 IST

తమపై పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో కొందరు ఓ టీటీడీ విశ్రాంత ఉద్యోగిని కత్తితో పొడిచి హత్య చేశారు.

టీటీడీ విశ్రాంత ఉద్యోగి హత్య
నారాయణస్వామి మృతదేహం

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 8: తమపై పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో కొందరు ఓ టీటీడీ విశ్రాంత ఉద్యోగిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన  తిరుపతిలో జరిగింది. ఎంఆర్‌పల్లె పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టీటీడీ విశ్రాంత ఉద్యోగి నారాయణస్వామి (63) కుటుంబ వివాదాల కారణంగా స్థానిక సీతమ్మనగర్‌లోని ఉల్లిపట్టెడలో ఒక్కడే నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన భారతి అనే మహిళ తమ పక్కింటి గోవిందమ్మ అనే మరో మహిళ ద్వారా నారాయణస్వామిని రూ.50వేలను అప్పుగా అడిగారు. దాంతో తొలుత రూ.15వేలను ఆమెకు ఇచ్చాడు. అనంతరం 15 రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో గోవిందమ్మ ఇంటికి వెళ్లి భారతికి ఇచ్చిన రూ.15వేలకు బాండు పత్రాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని కోరాడు. దీనికోసం అర్ధరాత్రి ఇంటికి రావడంపై ఆగ్రహించిన గోవిందమ్మ కుటుంబీకులు హేమాద్రి, రమే్‌షలు మరుసటి రోజున ఆయనతో గొడవపడ్డారు. ఆ తర్వాత తన మెడలో ఉండాల్సిన బంగారు గొలుసు కనిపించలేదని ఎంఆర్‌పల్లె పోలీసులకు నారాయణస్వామి ఫిర్యాదు చేశారు. వారు సరిగా స్పందించక పోవడంతో  స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును క్రైమ్‌ పోలీసులకు ఎస్పీ అప్పగించారు. క్రైమ్‌ పోలీసులు.. గోవిందమ్మ, హేమాద్రి, రమే్‌షలను పిలిచి విచారించి, వారే బంగారు గొలుసును కాజేశారని తెలుసుకుని గట్టిగా మందలించారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురూ గోవిందస్వామిపై కక్ష పెంచుకున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళకు నారాయణస్వామి జరిగిన విషయాన్ని  చెబుతుండటంతో గోవిందమ్మ, ఆమె కుటుంబీకులు కోపోద్రిక్తులై దాడిచేసి.. కత్తితో పొడిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎంఆర్‌పల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నారాయణస్వామి ఫిర్యాదుపై పోలీసులు తక్షణం స్పందించి ఉంటే ఈ హత్య జరిగేది కాదని.. స్థానికులు చెబుతున్నారు.  

Updated Date - 2022-08-09T07:31:25+05:30 IST