వన్‌మ్యాన్‌ కమిటీపై టీటీడీ అర్చకుల్లో అనుమానాలు!

ABN , First Publish Date - 2021-07-28T18:11:49+05:30 IST

ఏపీ ప్రభుత్వం నియమించిన వన్‌మ్యాన్‌ కమిటీపై అన్‌లిమిటెడ్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట అర్చకులు. తిరుమలలో వంశపారంపర్య అర్చక వ్యవస్థను పటిష్టపర్చేందుకు

వన్‌మ్యాన్‌ కమిటీపై టీటీడీ అర్చకుల్లో అనుమానాలు!

ఏపీ ప్రభుత్వం నియమించిన వన్‌మ్యాన్‌ కమిటీపై అన్‌లిమిటెడ్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట అర్చకులు. తిరుమలలో వంశపారంపర్య అర్చక వ్యవస్థను పటిష్టపర్చేందుకు ఈ కమిటీ ఎలాంటి సిఫార్సులు చేస్తుందనే సందేహం, ఉత్కంఠ నెలకొందట. టీటీడీ అర్చకులను ఇరుకునపెట్టేలా ఓ మాజీ వేస్తున్న ఎత్తులకు కొనసాగింపే ఈ కమిటీనా అనుకుంటున్నారట. 


కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే భాగ్యం మిరాశీ వంశీకులకు చెందిన నాలుగు కుంటుంబాలకు మాత్రమే ఉండేది. 1986లో అప్పటి ప్రభుత్వం మిరాశీ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత వచ్చిన కోర్టు తీర్పులు, వరుసగా వస్తున్న ప్రభుత్వాలు తీసుకొచ్చిన మార్పులు అన్నీ కలిపి దేవాలయంలో పూజాహక్కులకు సంబంధించి పలు పరిణామాలు జరిగాయి, జరుగుతున్నాయి.దీంతో శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం 52 మంది అర్చకులు ఉండగా వారిలో 48 మంది అర్చకులు సర్వీస్‌ రికార్డ్‌-ఎస్‌ఆర్‌ విధానానికి మొగ్గు చూపారు.ఇలా మిరాశీ వంశీకులకు టీటీడి మధ్య అన్ని సర్దుబాటు అయ్యాయి అని భావిస్తున్న తరుణంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిటీని నియమించడం పై ఆలయ అర్చకులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. 


వన్‌ మ్యాన్‌ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తిరుమలలో గుసగుసలు మొదలయ్యాయట. ప్రధాన అర్చకులు హోదాలో కొనసాగేందుకు ప్రయత్నించిన రమణ దీక్షితులకు కొద్ది రోజుల క్రిత్తం హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో ఎలాగైనా తిరిగి ప్రధాన అర్చక హోదా పదవి పొందాలని రమణదీక్షితులు ప్రయత్నిస్తున్నట్లు అర్చకులు అనుకుంటున్నారట. రమణదీక్షితులు ప్రోద్బలంతోనే ప్రభుత్వం ఈ కమిటీని నియమించిదని అర్చకులు అనుకుంటున్నారట. 


రమణ దీక్షితులకు లబ్ధి చేకూర్చేలా కమిటీ నియమాకం ఉందని ...వాస్తవానికి మిరాశీ వంశీకులు ఎవరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రస్తుత విధానంలో మార్పు చేయాలంటూ కోరలేదని అర్చకులు గుసగుసలాడుకుంటున్నారట. కేవలం రమణ దీక్షితులకు అనుకూలంగా వున్న ఉత్తర్వులను మాత్రమే కమిటీ పరిశీలనలో పెట్టినట్లు కూడా ఆలయ అర్చకులు ఆవేదనతో మాట్లాడుకుంటున్నారట. రమణదీక్షితులు ఒక్కరే మిరాశీ వంశీకులు కాదని తామంతా కూడా మిరాశీ వారమేనని...ఆలయ విధులకు దూరంగా వుంటున్న రమణదీక్షితుల మాటకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏకపక్షంగా నియమించినట్లు భావిస్తున్నారట తిరుమలతోని మిరాశీ అర్చకులు. 




అర్చకులమంతా ఎటువంటి బేధాభిప్రాయాలు లేకుండా సాఫీగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో  ఈ కమిటీ ఎందుకు అని అనుకుంటున్నారట. టీటీడీ యాజమాన్యం కూడా అర్చకుల పట్ల సానుకూల ధోరణితో నాలుగు కుటుంబాలకు చెందిన యువ అర్చకులకు కూడా స్వామి వారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించడమే కాకుండా దాదాపు అర్చకులందరికీ ఎస్.ఆర్ ఓపెన్ చేసి ఉద్యోగులుగా కూడా పరిగణించిందని సంతోషపడుతున్నారట.సంభావన క్రింద పనిచేస్తూ రెగ్యులరైజ్ అయినందుకు గాను గతంలోని బకాయిలన్నింటిని కూడా టీటీడీ చెల్లించేసిందని హ్యాపీగా ఉన్నారట. ఇప్పుడు వంశపారంపర్య అర్చక వ్యవస్ధ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం కమిటీ నియమించడం వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని అర్చకులు అనుకుంటున్నారట. 


ఇప్పటికే మిరాశీ వంశీకులకు స్వామి వారి కైంకర్యం చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని మరి కమిటీ ఎవరికోసమో, ఎందుకోసమో అనేది అర్దమవుతోందని అనుకుంటున్నారట. అయితే తాజాగా ఏర్పాటు చేసిన కమిటీతోనైనా  అన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తాయని భావిస్తున్నారట ఆలయ అర్చకులు. ఏది ఏమైనప్పటికి కమిటీ నిష్పాక్షికంగా పరిశీలన జరిపి అర్చకుల అందరి అభిప్రాయాలను స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఏకసభ్య కమిటికి ప్రభుత్వం కాలపరిమితి విధించడంతో మూడు నెలల్లోగా  కమిటీ వంశపారంపర్య అర్చక బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు అర్చకులు జీవితాంతం విధులు నిర్వర్తించే ఆంశం పై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉండడంతో కమిటీ  ఎలాంటి సిఫార్సులు చేస్తుందనేది అర్చకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Updated Date - 2021-07-28T18:11:49+05:30 IST