Abn logo
Sep 23 2021 @ 03:12AM

టీటీడీ బోర్టులో క్రిమినల్సా?

  • పీఠ, మఠాధిపతులు పనికిరారా? 
  • వ్యాపారులు, నేరస్థులే అర్హులా?
  • ప్రభుత్వ తీరుపై ఎంపీ రఘురామ ధ్వజం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిలో నేరచరిత్ర ఉన్నవారిని, వ్యాపారులను, థార్మిక సంస్థలు, ప్రచారంపై ఎలాంటి అవగాహన లేని వారిని మీ స్వార్ధ ప్రయోజనాలకోసం నియమించుకుంటారా? గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ నియమ, నిబంధనలకు తూట్లు పొడుస్తారా? సభ్యులను ఎంపిక చేసే ముందు వారి చరిత్ర ఏంటో తెలుసుకోవలసిన బాధ్యత లేదా?’’ అని ఏపీ ప్రభుత్వాన్ని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాషాయ వస్ర్తాలు ధరించేవారు, బొట్టు పెట్టుకునే వారు అనర్హులా? మీకు వ్యాపారులు, నేరస్థులే కనిపిస్తారా?. టీటీడీ చట్టంలో లేని పోస్టులను సృష్టిస్తున్నారు. అధికారపార్టీ నేతలకు పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చేందుకు ప్రయత్నించవద్దు. ఈ బోర్డుకైనా పీఠాధిపతులు, మఠాధిపతులను నియమించి హిందూ థార్మిక ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది’’ అని రఘురామ అన్నారు.


రెండు వారాల్లో ఏపీ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు అప్పుచేసిందని రఘురామ అన్నారు. అదనపు రుణాల సమీకరణకు కేంద్రం అనుమతించిందని చెప్పారు. మళ్లీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అప్పులకోసం ఢిల్లీ చుట్టూ తిరగాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని డ్రగ్స్‌ మాఫియా బాగోతం నిగ్గు తేల్చాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు ఎంపీ రఘురామ చెప్పారు.

క్రైమ్ మరిన్ని...