టీటీడీ భూములపై అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట!

ABN , First Publish Date - 2020-05-26T01:10:18+05:30 IST

టీటీడీ భూముల వివాదంపై ఏపీలో రాజకీయ దుమారం రేగింది. టీటీడీకి చెందిన భూములను...

టీటీడీ భూములపై అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట!

హైదరాబాద్: టీటీడీ భూముల వివాదంపై ఏపీలో రాజకీయ దుమారం రేగింది. టీటీడీకి చెందిన భూములను విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. అంతేకాదు ఆందోళనలకు దిగనున్నాయి. బీజేపీ అయితే మంగళవారం దీక్షకు పిలుపు నిచ్చింది. 


అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న నేతలు.. గతంలో టీటీడీ భూములపై రాద్ధాంతం చేశారు. అధికారంలోకి రావడం కోసం ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. అటు సదావర్తి భూములపైనా గొంతు చించుకుని అరుపులు, కేకలు వేశారు. మేమైతే పని కొచ్చే పనులే చేస్తామని చిలకపలుకులు పలికారు. ఇప్పుడేమో టీటీడీ భూములను అమ్మేందుకు రెడీ అయిపోయారు. దీంతో టీటీడీ బోర్డు సభ్యుల్లో గందరగోళం నెలకొంది. అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు టీటీడీ బోర్డునే మార్చేయాలని ఓ మాజీ నేత చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 


ఈ నేపథ్యంలో ‘‘టీటీడీ భూముల వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్‌ ద్రోణంరాజు రవికుమార్‌, ఏఐసీసీ సభ్యుడు నరసింహారావు, టీడీపీ నేత పట్టాభి, సీపీఎం నేత కందారపు మురళి, బీజేపీ నేత రమేష్‌నాయుడు పాల్గొన్నారు. 



ఈ సందర్భంగా సీపీఎం నేత కందారపు మురళి మాట్లాడుతూ ‘‘ఏఈవోల స్థాయిలోనే అమ్మకాలు జరుగుతాయి. ఈవోల ఫోటోలు పెట్టి ఏఈవోలే సంతకాలు పెడతారు, టీటీడీకి భక్తులు ఇస్తున్న ఆస్తులకు సంబంధించి నిర్థిష్టమైన విధానం ఉండాలి. గతంలో కూడా టీటీడీ బోర్డు ఇదే తీర్మానం చేసింది. కరోనా సమయంలో ఇంత అర్జెంటుగా అమ్మాల్సిన అవసరమేంటి?. టీటీడీ ఆస్తుల అమ్మకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.’’ అని అన్నారు. 


బీజేపీ నేత రమేష్‌నాయుడు మాట్లాడుతూ ‘‘ స్వామివారి విశ్వాసాలను దెబ్బతీయాలని చూస్తున్నారు. ఏడుకొండలపై అన్యమత ప్రచారం చేశారు. ప్రపంచంలో టీటీడీ ఆస్తులు ఎక్కడ ఉన్నా అమ్మేస్తారు. భక్తులు, పరిరక్షణ సంఘాలు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు.’’ అని చెప్పారు. 


Updated Date - 2020-05-26T01:10:18+05:30 IST