వెంకన్న ఆస్తులు అమ్మం!

ABN , First Publish Date - 2020-05-29T08:17:28+05:30 IST

‘వెంకన్న భూముల వేలం’పై పెను వివాదం చెలరేగిన నేపథ్యంలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్రీవారికి భక్తులు ఇచ్చిన కానుకలు, టీటీడీ

వెంకన్న ఆస్తులు అమ్మం!

  • వాటి వినియోగంపై కమిటీ ఏర్పాటు 
  • ఆస్తులపై శ్వేతపత్రం విడుదల
  • తిరుపతిలో చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం
  • పాలకమండలి భేటీలో తీర్మానాలు
  • డోనర్‌ కాటేజీలపై యూటర్న్‌?

తిరుమల, మే 28: ‘వెంకన్న భూముల వేలం’పై పెను వివాదం చెలరేగిన నేపథ్యంలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్రీవారికి భక్తులు ఇచ్చిన కానుకలు, టీటీడీ ఆస్తులను విక్రయించకుండా నిషేధం విధిస్తూ తీర్మానం చేసింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం టీటీడీ పాలక మండలి సమావేశమైంది. బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్‌, సభ్యుడు మల్లికార్జునరెడ్డి, ఎక్స్‌ అఫిషియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడు కరుణాకర రెడ్డి ఇందులో పాల్గొన్నారు. మిగిలినవారు వీడియో కాన్ఫరెన్స్‌ పాల్గొని, తీర్మానాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.


‘‘శ్రీవారి ఆస్తుల విక్రయంపై నిషేధం విధిస్తూ తీర్మానం చేశాం. అవి ఉపయోగంలో లేకపోయినప్పటికీ వాటిని ఎలా వినియోగించుకోవాలి, దురాక్రమణకు కాకుండా ఎలాచూడాలి అనే అంశంపై బోర్డు సభ్యులు, స్వామిజీలు, భక్తులు, మేధావులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు. లాక్‌డౌన్‌  తర్వాత ప్రభుత్వ అనుమతితో వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యాన తిరుపతిలో చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మించాలని బోర్డు నిర్ణయించిందన్నారు. టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదేశించారు. తిరుపతిలో టీటీడీకి చెందిన గదులు, దుకాణాలు, పార్కింగ్‌ ప్రాంతాలను లీజుకు పొందినవారు లాక్‌డౌన్‌లోనూ అద్దె కట్టాల్సిందేనని టీటీడీ తేల్చిచెప్పింది.   


డోనార్‌ కాటేజీలపై యూటర్న్‌?

తిరుమలలో గెస్ట్‌హౌ్‌సల నిర్మాణంపై టీటీడీ యూటర్న్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. గెస్ట్‌హౌ్‌సల ఆధునీకరణ, తిరిగి నిర్మాణం పనులను టీటీడీ ‘అస్మదీయులకు’ కేటాయించబోతోందనే అంశంపై ‘మళ్లీ అతిథి భాగ్యం’ శీర్షికన ‘ఆంధజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ధర్మకర్తల మండలి సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్టు సమాచారం. తిరుమలలోని గెస్ట్‌హౌ్‌సల నిర్మాణానికి స్థలాలు కేటాయించబోతున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవంలేదని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నామినేషన్‌ ద్వారా కాకుండా డొనేషన్‌ పథకంలో చేర్చి, కొన్ని మార్గదర్శకాలు రూపొందించి అర్హులైన వారికే అవకాశమిస్తామన్నారు. అతిథిగృహాల నిర్వహణ కోసం నిర్వహించిన కొన్ని టెండర్లను రద్దు చేసినట్టు తెలిసింది. వీటిపై రివర్స్‌ టెండరింగ్‌కి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం.


‘ఆస్తుల విక్రయం’పై వివరణ ఇవ్వండి:హైకోర్టు 

అమరావతి: శ్రీవారికి భక్తులు విరాళంగా ఇచ్చిన ఆస్తుల విక్రయాలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని టీటీడీ ఈవోను ఆదేశించింది. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2020-05-29T08:17:28+05:30 IST