PRC ఉద్యమం : ఉపాధ్యాయ సంఘాలకు TTD ఉద్యోగుల మద్దతు.. నేడు కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-02-01T12:27:51+05:30 IST

కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు టీటీడీ ఉద్యోగులు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు.

PRC ఉద్యమం : ఉపాధ్యాయ సంఘాలకు TTD ఉద్యోగుల మద్దతు.. నేడు కీలక నిర్ణయం

చిత్తూరు జిల్లా/తిరుపతి : కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు టీటీడీ ఉద్యోగులు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. 6500 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, సొసైటీల కింద 7 వేల మంది, కాంట్రాక్టు, ఎఫ్‌ఎంఎస్‌ల కింద మరో 7500 మంది, పీస్‌ రేటు, సంభావన కేటగిరీల కింద ఇంకో 2 వేల మంది.. ఇలా మొత్తం 22 వేల నుంచీ 23 వేల మంది ఉద్యోగులు  టీటీడీలో పనిచేస్తున్నారు. వీరు కాకుండా 10 వేల మంది పెన్షనర్లు కూడా వున్నారు. వీరిలో రెగ్యులర్‌ ఉద్యోగులకు, పెన్షనర్లకు పీఆర్సీ వర్తిస్తుంది. అలాగే జీవో నంబరు 151 వర్తించే 3వేల మంది కాంట్రాక్టు, సొసైటీల కింద పనిచేసే ఉద్యోగులకు కూడా పీఆర్సీ వర్తిస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లాగా టీటీడీ ఉద్యోగులకు కొత్త జీతాలు ఇవ్వడం లేదు.


ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఆ తర్వాతే అమల్లోకి వస్తుంది. ప్రస్తుతానికి టీటీడీ ఉద్యోగులకు పాత జీతాలే చెల్లిస్తున్నారు. కాబట్టి దేవస్థానం ఉద్యో గుల్లో వేతనాలు తగ్గుతాయన్న ఆందోళన అయితే ప్రస్తుతానికి లేదు. కాకపోతే ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం బోర్డు నిర్ణయం తర్వాతైనా కొత్త జీతాలు చెల్లించక తప్పదని,అప్పుడు తమ వేతనాలు తగ్గుతా యన్న ఆందోళనతో వున్నారు. అందుకే వారు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నారు. టీటీడీ ఉద్యోగులు ఇప్పటి వరకూ నేరుగా ఆందోళనకు దిగలేదు కానీ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమావేశాలకు, ఆందోళనలకు హాజరవుతున్నారు.


ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ కార్యక్రమానికి కూడా నాయకులంతా వెళుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల తీరులోనే టీటీడీకి సమ్మె నోటీసు ఇచ్చే విషయంపైనా, ఫిబ్రవరి 7వ తేదీ నుంచీ విధులు బహిష్కరించి సమ్మెకు దిగే విషయంపైనా టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు తర్జన భర్జన పడుతున్నారు. దీనిపై మంగళవారం సంఘాల నేతలంతా సమావేశమై చర్చించనున్నట్టు తెలిసింది. భవిష్యత్‌ కార్యాచరణకు సంబంధించి మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. భక్తులకు సేవలందించే ఉద్యోగులు సమ్మెకు దూరంగా వుండి, భక్తులతో ముడిపడని విధుల్లో వున్న ఉద్యోగులు సమ్మె లో పాల్గొనేలా తొలి దశ కార్యాచరణ వుంటుందని చెబుతున్నారు. అయితే మంగళవారం సంఘాల నేతల సమావేశం తర్వాతే దీనిపై స్పష్టత రానుంది. 


టీటీడీలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఉద్యోగ సంఘాలు, అనుకూలంగా వుండే ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పటికైతే ఒక్కటిగా నిలిచి ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతు ప్రకటించాయి. తాము స్వయంగా సమ్మెకు దిగే విషయంలోనే ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. సమ్మెకు దిగితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని, దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటుందేమోనన్న సెంటి మెంట్‌ ఉద్యోగ సంఘాల నేతలకు బంధనాలు వేస్తోందని సమా చారం. కేవలం ఆ ఒక్క కారణంతోనే ఉద్యోగ సంఘాల నేతలు దూకుడుగా వెళ్ళలేకపోతు న్నారని ఉద్యోగులు చెబుతున్నారు. మొత్తానికీ తొలి దశలో ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఎంత వరకూ సహకరిం చాలనే విషయమై మంగళవారం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-02-01T12:27:51+05:30 IST