Tirumala Employees Tension: టీటీడీ చర్యలు.. ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్

ABN , First Publish Date - 2022-09-01T02:06:27+05:30 IST

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని క్షణకాలం దర్శించుకుంటే చాలు.. జీవితం ధన్యమవుతుందని భక్తులు భావిస్తారు. అయితే ..

Tirumala Employees Tension: టీటీడీ చర్యలు.. ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్

తిరుమల (Tirumala): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని క్షణకాలం దర్శించుకుంటే చాలు.. జీవితం ధన్యమవుతుందని భక్తులు భావిస్తారు. అయితే స్వామివారిని ప్రతి నిత్యం దర్శించుకునే భాగ్యం కేవలం టీటీడీ ఉద్యోగులకు మాత్రమే దక్కుతోంది. ఇక టీటీడీలో ఉద్యోగం రావడం ఒకటైతే...డిప్యూటేషన్‌ (Deputation)పై రావడం మరో ఎత్తులా ఉంటుంది. టీటీడీలో డిప్యూటేషన్ కోసం కీలక పదవులు కూడా వదులుకున్న అధికారులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇదంతా చరిత్ర.. ఇప్పుడంతా మారిపోతోంది.


టీటీడీ ఉద్యోగులు (Ttd Employees) ఒకప్పుడు తిరుమల (Tirumala), తిరుపతి (Tirupati)కి మాత్రమే పరిమితమై విధులు నిర్వహించే వారు. కానీ ఇప్పుడు టీటీడీ ధార్మిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దాంతో ఉద్యోగుల విధి నిర్వహణ పరిధి పెరుగుతోంది. ఈ మేరకు టీటీడీ ఉద్యోగులు దేశవ్యాప్తంగా వెళ్లాల్సి వస్తోంది. దాంతో స్వామి వారి సన్నిధిలో ఉండే భాగ్యాన్ని వారు కోల్పోతున్నారు. 1996 నాటికి టీటీడీలో గరిష్టంగా 16 వేల మంది ఉద్యోగులు విధుల్లో ఉండేవారు. ఆ తరువాత భక్తుల సంఖ్య అంతకంతకు పెరిగినా...టీటీడీ ఉద్యోగుల సంఖ్య పెరగకపోగా తగ్గుతూ వచ్చింది. మరోవైపు ఔట్ సోర్సింగ్ (out Sourcing) వైపే యజమాన్యం మొగ్గుచూపడంతో టీటీడీ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 6500కి పరిమితమైంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య 13 వేలు దాటేసింది. అయినా టీటీడీ ఉద్యోగులకు తిరుమల, తిరుపతి కంటే ఇతర ప్రాంతాలలోనే ఎక్కువగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


దేశ వ్యాప్తంగా టీటీడీ.. శ్రీవారి ఆలయాలను నిర్మిస్తోంది. భక్తులు సౌకర్యం కోసం కళ్యాణమండపాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. దాంతో టీటీడీ ఉద్యోగులు యాజమాన్యం సూచించిన చోట ఉద్యోగ బాధ్యతలు చేయాల్సి వస్తోంది. ఏపీలోనే ఉమ్మడి చిత్తూరు (Chittoor) జిల్లాలోని పలు పట్టణాలతో పాటు విజయవాడ (Vijayawada), విశాఖ (Visakha) వంటి ప్రాంతాలకు ఉద్యోగులు బదిలిపై వెళ్ళి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక తమిళనాడులోని చెన్నై, వేలూరు, కాంచీపురం, మధురై, కన్యాకుమారి, నైవేలి వంటి ప్రాంతాలు...కర్నాటకలోని బెంగళూరు, బంగారు తిరుపతి, హోసూరు, చింతామణిలోనూ ఉద్యోగులను బదిలీపై పంపుతున్నారు. కేరళలోని గురువాయురు...ఒడిశాలోని భువనేశ్వర్...ఉత్తరాఖండ్‌లోని రిషికేష్...హర్యానాలోని కురుక్షేత్రం..మహారాష్ట్రలోని ముంబయి, పాండిచ్చేరి రాష్ట్రంతో పాటు తెలంగాణ (Telangana)లోని 18 ప్రాంతాలకు టీటీడీ ఉద్యోగులు వెళ్లాల్సి వస్తోంది. 


తాజాగా జమ్ములో కూడా టీటీడీ శ్రీవారి ఆలయం నిర్మిస్తోంది. దీంతో ఆ ప్రాంతానికి కూడా టీటీడీ ఉద్యోగులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఒక్కప్పుడు స్వామి వారి సన్నిధికి మాత్రమే పరిమితమైన టీటీడీ ఉద్యోగులు ..ఇప్పుడు విధుల కోసం దేశవ్యాప్తంగా వెళ్లాల్సి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.


అయితే టీటీడీలో విధులు నిర్వహించే ఉద్యోగులంతా చిత్తూరు జిల్లా వాసులే.  దాంతో వారంతా తిరుపతిలోనే స్ధిరనివాసం ఏర్పర్చుకుని.. తిరుమల, తిరుపతిలోనే విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం టీటీడీ.. దేశ వ్యాప్తంగా విస్తరిస్తుండటంతో ఉద్యోగ రిత్యా బదిలీలపై వెళ్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై వారంతా ఆందోళన చెందుతున్నారు. పిల్లలు చదువులు, కుటుంబ సమస్యలు వారికి అడ్డంకిగా మారాయి. బదిలీపై వెళ్లే ప్రాంతానికి కుటుంబాన్ని కూడా తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో ఒంటరిగానే విధులు నిర్వహిస్తున్నారు. ఈ కారణాలతో ఒకప్పుడు టీటీడీ ఉద్యోగం అంటే అదృష్టమని భావించే పరిస్థితి నుంచి ఆనాసక్తి ఏర్పడే స్థితికి చేరింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అదనపు పని భారమే పెద్ద సమస్యగా భావిస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు... బదిలీ (Transfers) అంశంతో ఆందోళన చెందుతున్నారు. 




Updated Date - 2022-09-01T02:06:27+05:30 IST