సీఎం జగన్‌ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-07-01T07:12:11+05:30 IST

ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ రాష్ట్ర నాయకుడు, ఒంగోలు మాజీ ఎంపీ..

సీఎం జగన్‌ కీలక నిర్ణయం!

వైవీకే మళ్లీ టీటీడీ!

సోషల్‌ మీడియా ప్రచారాలకు తెరదించిన వైనం


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ రాష్ట్ర నాయకుడు, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్‌ కాబోతున్నారు. ఆ మేరకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత టర్మ్‌లో చివరి టీటీడీ పాలకమండలి సమావేశానికి వెళ్తున్న వైవీ ముందుగానే తన పరిస్థితి ఏమిటని సీఎంను కోరినట్లు సమాచారం. అందుకనుగుణంగా సీఎం కూడా పరిస్థితిని అధ్యయనం చేశారు. అప్పటికే వైవీ కేబినెట్‌ విస్తరణలో మంత్రి కాబోతున్నారని, అందుకనుగుణంగా ఎమ్మెల్సీ స్థానం కూడా కేటాయిస్తారని ప్రచారం జరిగింది. సీఎంగా జగన్‌ బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత వారంరోజులకు మంత్రులను నియమించిన రోజే రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తానని ప్రకటించారు. ఆ సమయం ఆసన్నమైంది. అదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌ పదవీకాలం పూర్తవుతోంది. దీంతో వైవీ రాజకీయ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. చివరికి వైవీ కూడా ఇటు మంత్రిగా అవకాశం వస్తే మంచిదని, కాకుంటే రాజ్యసభ సభ్యుడిగా కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు వినిపించింది. అలాగే టీటీడీ చైర్మన్‌గా మున్ముందు అవకాశం కల్పిస్తానని జగన్‌ కూడా రాష్ట్రంలో కొందరు నాయకులకు హామీ ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది.


ఈ నేపథ్యంలో జిల్లా నుంచి మంత్రిగా కొనసాగాలని, అలాగే విస్తరణలో ఆ పదవి చేపట్టాలని ఆశిస్తున్న నాయకులు వైవీ వచ్చి ఎక్కడ అడ్డం పడతారోనని ఆందోళన చెందారు. ఈ సమయంలో సీఎం జగన్‌ కుటుంబ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని   అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో ఆయన సమీప బంధువైన బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు. వైవీకి మంత్రి పదవి ఇస్తే బాలినేనికి చెక్‌ పడినట్లేనని కూడా అందరూ భావించారు. ఈ సమయంలో సీఎం జగన్‌ అటు ఒకరిద్దరు పార్టీ నేతలతో, ముఖ్యంగా కుటుంబసభ్యులతో ఈఅంశంపై చర్చించినట్లు తెలిసింది. వారం క్రితం మంత్రి బాలినేనితో కూడా ఆయన చర్చించినట్లు సమాచారం. తదనంతరం ఆయన వైవీని తిరిగి టీటీడీ ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 

Updated Date - 2021-07-01T07:12:11+05:30 IST