వెంకన్నపై నమ్మకముంటే చాలు

ABN , First Publish Date - 2020-09-19T08:42:11+05:30 IST

‘శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందినవారైనా దేవుడిపై నమ్మకంతో వస్తే చాలు.

వెంకన్నపై నమ్మకముంటే చాలు

  • ఏ మతస్థులైనా శ్రీవారిని దర్శించుకోవచ్చు 
  • డిక్లరేషన్‌పై సంతకం అవసరం లేదు: వైవీ 
  • బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 
  • నేటి నుంచి తొమ్మిది రోజులు వేడుక 


తిరుమల, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందినవారైనా దేవుడిపై నమ్మకంతో వస్తే చాలు. ఏ మతస్థులైనా స్వామిని దర్శించుకోవచ్చు. డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిన అవసరం లేదు. గతంలో కూడా టీటీడీకి ఎవరూ డిక్లరేషన్‌ ఇచ్చిన సందర్భాలు లేవు. ప్రస్తుతం ఎంతోమంది శ్రీవారిని దర్శించుకుని వెళ్తున్నారు. వాళ్లందరినీ గుర్తించి మనం డిక్లరేషన్‌ అడుగుతున్నామా. చంద్రబాబు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన తిరుమలలో మాట్లాడుతూ ప్రస్తుతం టీటీడీతో పాటు రాష్ట్రంలో ఎక్కడా అన్యమత ప్రచారాలు జరగడం లేదన్నారు.


గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు ఆర్టీసీ డిపోలో ముద్రించిన అన్యమత ప్రచార టికెట్లను కుట్రపూరితంగా తిరుమలకు పంపిన విషయం తమ విచారణలో తేలిందన్నారు. దీనిపై పోలీసు కేసు కూడా నమోదు చేశామన్నారు. లోకకల్యాణం కోసం మఠాలు నిర్వహించే కార్యక్రమాలకు నిధులు ఇచ్చే సంప్రదాయం గతంలో కూడా ఉందన్నారు. ఇతర మఠాలకు ఇచ్చినట్లే శారదాపీఠం కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేశామన్నారు. కాగా, కొవిడ్‌ ఇబ్బందులతో బ్యాంకులు వడ్డీని తగ్గించడంతో గతంలో డిపాజిట్లపై 9శాతం వరకు వచ్చే వడ్డీ ప్రస్తుతం 4.5 శాతానికి తగ్గిందన్నారు. అధిక వడ్డీ లభించేలా నిబంధనలకు లోబడి ఆర్‌బీఐ గ్యారంటీ ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. 

Updated Date - 2020-09-19T08:42:11+05:30 IST