ఆచారం.. అంతేనా!

ABN , First Publish Date - 2020-09-20T08:58:29+05:30 IST

అది వెంకన్న సన్నిధి! ‘అన్యమతస్థులకు ప్రవేశం లేదు’... అనే బోర్డు అక్కడ ఉండదు. క్యూలో వెళ్తున్న వారిని ఆపి నువ్వు ఎవరు, నీ కులం ఏది, నీ మతం ఏది అని ఎవ్వరూ అడగరు! ఏడుకొండల వాడి సన్నిధికి అందరికీ స్వాగతం,

ఆచారం.. అంతేనా!

టీటీడీ చైర్మన్‌ వ్యాఖ్యలపై విస్మయం

క్యూలో ఉన్నవారిని కులం, మతం అడగరు

వీవీఐపీ ప్రొటోకాల్‌తో దర్శనానికి వచ్చే

అన్యమతస్థులకే నిక్కచ్చిగా వర్తింపు

అలా వచ్చేది ఏడాదికి ఒక్కరో ఇద్దరో!

అది ఇతర మతాలను అవమానించడం 

కాదు.. భక్తి ఉందని చెప్పేందుకే

ఇందిర, జాఫర్‌, కలాం కూడా ఇచ్చారు! 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)  

అది వెంకన్న సన్నిధి!  ‘అన్యమతస్థులకు ప్రవేశం లేదు’... అనే బోర్డు అక్కడ ఉండదు. క్యూలో వెళ్తున్న వారిని ఆపి నువ్వు ఎవరు, నీ కులం ఏది, నీ మతం ఏది అని ఎవ్వరూ అడగరు! ఏడుకొండల వాడి సన్నిధికి అందరికీ స్వాగతం, సుస్వాగతం! కానీ... వీఐపీ హోదాలో ప్రొటోకాల్‌ దర్శనం చేసుకునే అన్యమతస్థులకు మాత్రమే వర్తించే ఒక నిబంధన.. ‘వెంకన్న స్వామిపై  మాకు విశ్వాసం ఉంది’ అని డిక్లరేషన్‌ ఇవ్వడం! మహా అయితే ఏడాదికి ఒక్కరో, ఇద్దరో ఇచ్చే డిక్లరేషన్‌ను కూడా వివాదాస్పదంగా మార్చారు. ‘అన్యమతస్థులకు డిక్లరేషన్‌ అవసరం లేదు’ అంటూ టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆకస్మికంగా ఎందుకు చెప్పారో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. వాస్తవానికి వెంకన్నను దర్శించుకునే ఇతర మతాల వారు డిక్లరేషన్‌ ఇవ్వాలి. ‘వేంకటేశ్వర స్వామిపై మాకు విశ్వాసం ఉంది’ అని ముద్రించిన పత్రంపై సంతకం చేయాలి. క్యూలో వెళ్లే భక్తులెవరినీ దీని గురించి అడగరు. అయితే, వీవీఐపీలకు వారి హోదాను అనుసరించి ఆలయ సంప్రదాయం ప్రకారం మర్యాదలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల, వారి నుంచి మాత్రమే డిక్లరేషన్‌ తీసుకుంటారు. 1960 నుంచి ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తున్నారు. దీనిపై 1990లో ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా జారీ చేసింది.


‘డిక్లరేషన్‌’ నిబంధనను ప్రధాని, రాష్ట్రపతి హోదాలో పని చేసిన వారు సైతం గౌరవించారు. దానిని అవమానంగానో, తమ మతాన్ని కించపరిచినట్లుగానో భావించలేదు. ఇందిరాగాంధీ నుంచి టీటీడీ అధికారులు డిక్లరేషన్‌ తీసుకున్నారు. ఇందిర జన్మతః హిందువు. పార్శీ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లాడినందున ‘డిక్లరేషన్‌’ ఇవ్వాలని కోరారు. తొలుత తటపటాయించినప్పటికీ, ఆ తర్వాత డిక్లరేషన్‌పై ఆమె సంతకం పెట్టారు. ఇక... కేంద్ర మంత్రి హోదాలో వచ్చిన జాఫర్‌ షరీఫ్‌ ఆయనకు డిక్లరేషన్‌ గురించి చెప్పారు. ‘అందులో ఏముంటుంది?’ అని అడిగారు. ‘వేంకటేశ్వర స్వామిపై నాకు విశ్వాసం ఉంది’ అని ఉంటుందని అధికారులు తెలిపారు. ‘‘స్వామిపై భక్తి లేనప్పుడు ఎక్కడి నుంచో ఎందుకు వస్తాను. పత్రం తీసుకురండి సంతకం పెడతాను’ అంటూ జాఫర్‌ షరీఫ్‌ సూటిగానే చెప్పారు. ఇక...కశ్మీర్‌కు చెందిన ఫరూక్‌ అబ్దుల్లా కూడా ఏమాత్రం సంశయం లేకుండా డిక్లరేషన్‌ ఇచ్చా రు. రాష్ట్రపతిగా వ్యవహరించిన ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ నుంచి కూడా అధికారులు డిక్లరేషన్‌ తీసుకున్నారు. 1998లో సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత వెంకన్న దర్శనానికి వచ్చారు. అప్పట్లో... టీటీడీ ఈవోగా ఐవీ సుబ్బారావు ఉన్నారు. సోనియాను అన్యమతస్థురాలిగా గుర్తించి... డిక్లరేషన్‌పై సంతకం కోరా రు. ఆమె అందుకు నిరాకరించారు. అధికారుల తీరుపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న వైఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆ వెంటనే ఐవీ సుబ్బారావు అప్పటి సీఎం చంద్రబాబు సలహా కోరారు. ‘ఆలయ సంప్రదాయం, పద్ధతుల ప్రకారమే నడుచుకోండి’ అని చంద్రబాబు చెప్పారు. చివరికి... ‘నేను భారతీయ మహిళను. భారతీయ సంప్రదాయాలు, కుటుంబ ఆచారాలు పాటిస్తున్నాను’ అని సోనియా డిక్లరేషన్‌ ఇచ్చాకే దర్శనం చేసుకున్నారు.


కాదన్నది కక్రూ మాత్రమే!

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ నిస్సార్‌ అహ్మద్‌ కక్రూ తిరుమల వచ్చినప్పుడు అధికారులు ఆయన వద్దకు డిక్లరేషన్‌ ఫామ్‌ తీసుకెళ్లారు. ఆయన డిక్లరేషన్‌ ఇచ్చేందుకు ఇష్టపడలేదు. కానీ, ‘మీ సంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను’ అని చెప్పి, దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయారు. జస్టిస్‌ కక్రూ మినహా... డిక్లరేషన్‌ ఇచ్చేందుకు నిరాకరించిన ప్రముఖులు లేరు.


వైఎస్‌... విషయంలో ఇలా!

వైఎస్‌ రాజశేఖర రెడ్డి వెంకన్నను దర్శించుకునే విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇంటి వరకు క్రైస్తవ మత సంప్రదాయాలు పాటించినా... ఆ మత చిహ్నాలు ధరించడంకానీ, మతగ్రంధంతో కనిపించడంకానీ జరగలేదు. చర్చిలతోపాటు ఆలయాలు, దర్గాలకూ వెళ్లారు. అందువల్ల, ఆయన నుంచి డిక్లరేషన్‌ కోరాల్సిన అవసరం  రాలేదు. కానీ, జగన్‌ విషయంలో మాత్రం ఇతరుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగిన కారణాలూ ఉన్నాయి. 


చైర్మన్‌కు అధికారం ఉందా?

ఇందిరను పూరీ జగన్నాథ్‌ ఆలయంలోకే అనుమతించలేదు. రాజీవ్‌కీ అదే పరిస్థితి ఎదురైంది. కానీ... తిరుమల ఎవరైనా రావచ్చు! డిక్లరేషన్‌ సంప్రదాయం వద్దనుకుంటే... దీనిపై ఆగమ సలహాదారుల సూచనలు తీసుకోవాలి. అంతేకాదు, దీనిపై ఇప్పటికే జారీ అయిన జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. కనీసం, టీటీడీ పాలకమండలిలో కనీస చర్చకూడా జరపకుండా... వైవీ సుబ్బారెడ్డి దీని గురించి మాట్లాడటంలో అర్థమేమిటో?

Updated Date - 2020-09-20T08:58:29+05:30 IST