నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

ABN , First Publish Date - 2021-02-27T07:50:37+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం శనివారం జరగనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సభ్యులు సుమారు 80 అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

2020-21 వార్షిక బడ్జెట్‌ సవరించనున్న టీటీడీ


తిరుమల, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం శనివారం జరగనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సభ్యులు సుమారు 80 అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.  2020-21 ఆర్థిక సంవత్సరానికి  వార్షిక బడ్జెట్‌ రూ.3,309.89కోట్ల్ల అంచనాలతో ప్రవేశపెట్టిన  విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో కొంతకాలం దర్శనాలు రద్దు కావడంతో పాటు వివిధ ఆదాయ మార్గాలకు గండి పడింది. ఈ క్రమంలో బడ్జెట్‌ సవరణపై చర్చ.  ఆర్జిత సేవల నిర్వహణ, సేవకు భక్తుల అనుమతితోపాటు కల్యాణమస్తు నిర్వహించాల్సిన ప్రదేశాల ఎంపికపై నిర్ణయం.  పౌరోహిత సంఘానికి చెందిన పురోహితులను సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతించే అంశంపై చర్చ.  టీటీడీ డిపాజిట్లపై తక్కువ వడ్డీ ఇచ్చిన కారణంగా యాక్సిస్‌ బ్యాంకును బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేలా తీర్మానం చేయనున్నట్టు తెలిసింది. అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసే అంశంపైనా చర్చ. తిరుపతిలోని తుమ్మలగుంట వద్దనున్న ఓల్డ్‌ గ్యాస్‌ బిల్డింగ్‌ను తెలుగు అకాడమీకి మూడేళ్లకు కేటాయించే విషయంపై తీర్మానం.   హెల్త్‌ విభాగానికి సంబంధించి ఎనిమిది మంది జూనియర్‌ వాటర్‌ ఎనలిస్టులను అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా తీసుకునే అంశంతోపాటు విజిలెన్స్‌ విభాగానికి 300 మంది ఎక్స్‌ సర్వీస్‌ సిబ్బందిని కూడా కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకునే విషయంపై తీర్మానం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఒకే ప్రాంతంలో గదుల కేటాయింపుపైనా చర్చ.  తిరుమల నిర్వాసితులకు ఉద్యోగాలు పర్మినెంట్‌ చేసే అంశంపైనా తీర్మానం. వీటితోపాటు టేబుల్‌ అజెండాగా మరికొన్ని అంశాలపైనా చర్చించి, తీర్మానించనున్నారు. 

Updated Date - 2021-02-27T07:50:37+05:30 IST