Abn logo
Oct 18 2020 @ 02:56AM

టీటీడీకి ఆ ధైర్యం ఉందా?

ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టాక వెనక్కి తేగలరా? 

టీటీడీ చట్టంలో ఈ పెట్టుబడుల ప్రస్తావన ఎక్కడుంది?

దేవస్థానం మాజీ అధికారుల సందేహాలు 


అమరావతి/తిరుపతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో ఒక్కసారి పెట్టుబడులు పెట్టాక తిరిగి వెనక్కు తీసుకునే ధైర్యం టీటీడీలో పనిచేసే అధికారుల్లో ఎవరికుంటుంది? అసలు టీటీడీ చట్టంలో ఈ పెట్టుబడుల ప్రస్తావన ఎక్కడైనా ఉందా?... ఇవీ దేవస్థానంలో గతంలో పనిచేసిన కొందరు అనుభవజ్ఞులైన అధికారులు లేవనెత్తుతున్న సందేహాలు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో టీటీడీ పెట్టుబడుల నిర్ణయంపై ‘‘గోవిందా గో...విందా!’’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. పలువురు ప్రముఖులు దీనిపై స్పందించగా తిరుపతిలో పలు సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. 


అంతా ప్రభుత్వం కనుసన్నల్లోనే... 

టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అంటూ ఎంతగా చెప్పుకున్నా వాస్తవానికి దేవస్థానం కార్యకలాపాలన్నీ సంపూర్ణంగా రాష్ట్రప్రభుత్వ అదుపాజ్ఞల్లోనే సాగుతుంటాయి. ఈవో, జేఈవో, డిప్యూటీ ఈవోల వరకూ నియామకాలన్నీ ప్రభుత్వమే చేపడుతోంది. చివరికి పాలక మండలిని కూడా ప్రభుత్వమే నియమిస్తోంది. ఈవో, పాలక మండలికి నామమాత్రపు నిర్ణయాలు తప్ప కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేవు. వారి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదముద్ర తప్పనిసరి. తర్వాతే అవి అమల్లోకి వస్తాయి. అలాంటప్పుడు దేవస్థానం నిధులను ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టాక తిరిగి తీసుకునే చొరవ, ధైర్యం ఈవో, పాలకమండళ్లకు ఉంటాయా అనే  సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గడువు పూర్తికాగానే పెట్టుబడులు వాపస్‌ తీసుకుంటామని ప్రభుత్వానికి కనీసం లేఖ రాసే ఽసాహసం కూడా అధికారులు చేయలేరని దేవస్థానం మాజీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.  


ట్రస్టులు నడిచేదెలా?

టీటీడీలోని పలు ట్రస్టులు తమ డిపాజిట్లపై నెలవారీ లేదా త్రైమాసిక వడ్డీల ఆధారంగా నడుస్తున్నాయని పాలక మండలే చెబుతోంది. జాతీయ బ్యాంకులు ఇప్పటిదాకా నెలవారీ లేదా త్రైమాసిక వడ్డీ చెల్లిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెడితే ఈ వడ్డీ ఎలా వస్తుందని మాజీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి గడువు ముగిశాకే ప్రభుత్వం నుంచీ వడ్డీ అందుతుందని, అప్పటిదాకా ట్రస్టులు ఎలా నడుస్తాయనే ప్రశ్నకు టీటీడీ నుంచి సమాధానం లేదు. 


టీటీడీకి బీజేపీ నేత నోటీసు

రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని తక్షణం ఆపాలంటూ దేవస్థానం ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి టీటీడీకి లీగల్‌ నోటీసులు జారీ చేశారు. హైకోర్టు న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి ద్వారా టీటీడీ చైర్మన్‌కు, పాలకమండలి సభ్యులకు, ఈవోకు ఆయన నోటీసులు జారీ చేయించారు. వడ్డీ నిర్ణయాన్ని అమలుచేస్తే హైకోర్టులో పిల్‌ దాఖలు చేస్తామన్నారు. కాగా, ఈ అంశంపై టీటీడీ పూర్తి వివరాలతో వివరణ ఇస్తే బాగుంటుందని మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనం క్లిప్పింగ్‌ను తన కామెంట్‌కు జత చేశారు. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే అర్హత టీటీడీకి ఉందా అంటూ సందేహం వ్యక్తం చేశారు. శ్రీవారి డిపాజిట్లు ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఉంచాలనుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు డొక్కా నాఽథ్‌భాబు విమర్శించారు., టీటీడీ సొమ్మును రాష్ట్రప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని తాను రెండునెలల క్రితం చెప్పిన విషయం నేడు నిజమైందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. భగవంతుని సొమ్మును తాకిన ఎంతోమంది కాలగర్భంలో కలిసి పోయారని గుర్తు చేశారు. టీటీడీ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీడీపీ చిత్తూరు పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు కార్జాల అరుణ డిమాండ్‌ చేశారు. జనసేన నేతలు తిరుపతిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. టీటీడీ నిధులను మళ్లించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. అబ్బాయి సేవలో తరించడం కోసం దేవుని సొమ్ముకు బాబాయి ఎసరు పెడతారా అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్‌ ఎద్దేవా చేశారు. 

Advertisement
Advertisement
Advertisement