వెనక్కి తగ్గిన టీటీడీ

ABN , First Publish Date - 2020-10-18T08:21:20+05:30 IST

వెనక్కి తగ్గిన టీటీడీ

వెనక్కి తగ్గిన టీటీడీ

వెంకన్న నిధులు బ్యాంకుల్లోనే ఎఫ్‌డీ

రాష్ట్ర సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టం

టీటీడీ అధికారిక ప్రకటన


తిరుమల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): వెంకన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టాలన్న నిర్ణయంపై టీటీడీ వెనక్కి తగ్గింది. ‘అబ్బాయ్‌ సేవలో బాబాయ్‌... వెంకన్న సొమ్ము జగనన్న సర్కారు’కు అంటూ శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో టీటీడీ కొండ దిగి వచ్చింది. భక్తుల ఆగ్రహంతో తన వైఖరి మార్చుకుంది. టీటీడీ నిధులను ఎప్పట్లాగానే బ్యాంకుల్లోనే డిపాజిట్‌ చేస్తామని తెలిపింది. దీనిపై శనివారం రాత్రి టీటీడీ ఒక ప్రకటన జారీ చేసింది. ‘‘ఇప్పటి వరకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో టీటీడీ పెట్టుబడులు పెట్టలేదు. అయితే, వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో టీటీడీ బోర్డు ఈ సెక్యూరిటీల్లో పెట్టుబడులపై అధ్యయనం చేసింది. ప్రస్తుతం దీనిని పరిగణించాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశమున్నందున... ఇకపై బ్యాంకుల్లోనే ఎఫ్‌డీలను కొనసాగిస్తాం’’ అని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ నడిపే అన్నదాన ట్రస్టు, బర్డ్‌, గోసంరక్షణ ట్రస్టుల రోజువారీ కార్యకలాపాలు వడ్డీ డబ్బులతోనే నడుస్తాయని... అధిక వడ్డీ కోసం కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టాలని టీటీడీ ఫైనాన్స్‌ కమిటీ సిఫారసు చేసింది. కానీ... వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి దీనికి ‘రాష్ట్ర సెక్యూరిటీలు’ అనే పదాన్ని చేర్చింది. ఏరోజుకారోజు అప్పుల కోసం అన్వేషణ సాగిస్తున్న జగన్‌ సర్కారుకు అండగా ఉండేందుకే వ్యూహాత్మకంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపైనే ‘ఆంధ్రజ్యోతి’ శనివారం సవివరమైన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-10-18T08:21:20+05:30 IST