ఆర్‌టీసీ - 24కు ఆదరణ

ABN , First Publish Date - 2022-04-16T16:54:59+05:30 IST

గ్రేటర్‌ ఆర్టీసీ బస్సుల్లో టీ - 24 టికెట్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది. సెస్‌ల పేరుతో టికెట్ల చార్జీలు పెరగడంతో ప్రయాణికులు

ఆర్‌టీసీ - 24కు ఆదరణ

గ్రేటర్‌లో రోజుకు 8 వేల టికెట్ల అమ్మకం

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ ఆర్టీసీ బస్సుల్లో టీ - 24 టికెట్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది. సెస్‌ల పేరుతో టికెట్ల చార్జీలు పెరగడంతో ప్రయాణికులు పాస్‌లు, టీ-24 టికెట్ల వైపు మళ్లుతున్నారు. నెల రోజుల క్రితం గ్రేటర్‌జోన్‌లో రోజుకు 5 వేల వరకు మాత్రమే అమ్ముడుపోయిన టీ-24 టికెట్ల విక్రయాలు వారం రోజులుగా 8 వేలకు పెరిగాయి. రూ. 100తో టీ-24 టికెట్‌ తీసుకుంటే 24 గంటలూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎన్నిసార్లయినా ప్రయాణించే వీలుంటుంది. ఒకే రోజు రెండు, మూడు ప్రాంతాలకు ప్రయాణించే వారు ఈ టికెట్లు తీసుకుంటున్నారు. ఉద్యోగులు, బస్సుల్లో రోజూ ప్రయాణించే వారు నెల వారీ పాస్‌లు తీసుకుంటున్నారు. గ్రేటర్‌ జోన్‌లో 4.5 లక్షల బస్‌ పాస్‌లుండగా వాటిలో 1.3 లక్షల వరకు జనరల్‌ పాస్‌లు, 2.5 లక్షల వరకు విద్యార్థుల పాస్‌లున్నాయి. ఐటీ కారిడార్‌లో పూర్తిస్థాయిలో కంపెనీలు ప్రారంభమైతే ఆయా కంపెనీల్లోని చిరుద్యోగులు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తారని, దీంతో మే నుంచి జనరల్‌ బస్‌పా్‌సల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మార్చి నెలలో పాస్‌ల ద్వారా గ్రేటర్‌ ఆర్టీసీకి రూ. 17.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఆదాయాన్ని 25 కోట్లకు పెంచుకోవాలని ఆర్టీసీ లక్ష్యం నిర్ధేశించుకుంది.


10 వేల టీ-24 టికెట్ల విక్రయాలే లక్ష్యం 

గ్రేటర్‌ జోన్‌లో రోజుకు 10 వేల టీ-24 టికెట్ల అమ్మకాలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. బస్‌ల ట్రిప్పుల సంఖ్య పెంచుతున్నాం. రద్దీ పాయింట్ల వద్ద సూపర్‌వైజర్లను నియమిస్తూ, బస్‌ బేలో బస్సులు నిలిపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎండలను దృష్టిలో పెట్టుకొని 25 ప్రాంతాల్లో తాత్కాలిక బస్‌ షెల్టర్లు ఏర్పాటు చేశాం. 

- యాదగిరి, గ్రేటర్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ

Updated Date - 2022-04-16T16:54:59+05:30 IST