నిర్మాణం కన్నా అనుమతే కష్టం!

ABN , First Publish Date - 2021-12-03T05:21:16+05:30 IST

నిర్మాణం కన్నా అనుమతే కష్టం!

నిర్మాణం కన్నా అనుమతే కష్టం!

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాల మధ్య సమన్వయ లేమి

క్షేత్రస్థాయి పరిశీలనలో జాప్యం

లక్షల్లో ఫీజులు చెల్లించి పడిగాపులు

‘21 రోజుల్లో అనుమతి’ ఉత్తమాటే

చుక్కలు చూపిస్తున్న డీపీఎంఎస్‌ ఫైల్స్‌


జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), డిసెంబరు 2: గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు అగ్నిపరీక్షగా మారాయి. పారదర్శకత, 21 రోజుల్లోనే అనుమతులు జారీ ప్రధాన ఉద్దేశంగా  ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన టీఎ్‌స–బీపాస్‌ (తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ సిస్టం ఆన్‌ సెల్ప్‌ సర్టిఫికేషన్‌) నూతన విధానం దరఖాస్తుదారులను ఆగమాగం చేస్తోంది.  ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారులు భవన నిర్మాణ అనుమతుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇక గతంలోని డీపీఎంఎస్‌ (డెవల్‌పమెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) విధానంలో పెండింగ్‌లో ఉన్న సుమారు 1700 ఫైళ్లు దరఖాస్తుదారులకు, జీడబ్ల్యూఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి. టీఎ్‌స–బీపాస్‌ అమలుతో పక్కగా 21 రోజుల్లో అనుమతి లభిస్తుందన్న ఆశలు అడియాసలే అయ్యాయి. పైగా 21 రోజుల్లో అనుమతులు రాకుంటే వచ్చినట్లే భావించాలని ప్రకటించిన నిబంధనలు జీవోలకే పరిమితం అయ్యాయి.   సాఫ్ట్‌వేర్‌ సమస్యలను పరిష్కరించడంతో పురపాలక శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు పెల్లుబికుతున్నాయి. 


650కి పైగా ఫైల్స్‌ తిరస్కరణ

టీఎ్‌స–బీపాస్‌ విధానంలో దరఖాస్తుదారులు, ఆన్‌లైన్‌ సెంటర్స్‌  నిర్వాహకులకు అవగాహన కొరవడడంతో సుమారు 650కి పైగా ఫైల్స్‌ తిరస్కరణకు గురయ్యాయి. డీపీఎంఎస్‌ విధానంలో అయితే ఫైల్‌ షార్ట్‌ఫాల్‌ స్టేటస్‌ తెలిసే అవకాశం ఉండేది. ఆ లోపాన్ని సవరించి ఆప్‌లోడ్‌ చేయడం ద్వారా సవరణ జరిగేది. కానీ టీఎస్‌ బీ–పాస్‌ సాఫ్ట్‌వేర్‌ క్లిష్టతరంగా రూపొందించారు. షార్ట్‌ఫాల్‌ స్టేటస్‌ తెలియకుండా ఎక్కడ లోపం జరిగిందో వెంటనే పసిగట్టే అవకాశం లేకుండా మారింది. 


టీఎ్‌స–బీపా్‌సలో రిజెక్ట్‌, అప్రూవ్‌ ఈ రెండు ఆప్షన్స్‌ మాత్రమే పొందుపరచడం జరిగింది. రిజెక్ట్‌ అయితే ఎక్కడ లోపం ఉందో తెలిసే అవకాశం దరఖాస్తుదారుడికి లేకుండా పోయింది. ఎందుకు రిజెక్ట్‌ అయ్యిందనే  విషయం తెలుసుకునేందుకు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మరోవైపు అధికారులకు కూడా ఏ లాగిన్‌లో ఉందో తెలియని పరిస్థితి. ఇలా ఫైల్‌ మూవ్‌మెంట్‌పై స్పష్టత, జవాబుదారీతనం కొరవడడం వంటి సమస్యలతో వందల్లో నిర్మాణ అనుమతుల దరఖాస్తులు రిజెక్ట్‌ అవుతున్నాయి. జీవో 168పై అవగాహన లేమి కూడా ప్రధాన కారణంగా మారింది. గతంలోని డీపీఎంఎస్‌ విధానంలో భవన నిర్మాణ అనుమతులు కోసం ముందస్తుగా రూ.2500 ఫీజు కడితే సరిపోయేది. ఆ తదుపరి మొత్తం ఫీజు చెల్లించే అవకాశం ఉండేది. కానీ టీఎ్‌స–బీపా్‌సలో ముందే మొత్తం ఫీజు చెల్లించాలి. లక్షల్లో పీజులు చెల్లించి, చివరకు ఫైల్‌ ఎందుకు రిజెక్ట్‌ అయ్యిందో తెలియని దుస్థితిని దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్నారు. 


సమన్వయ లేమి

టీఎ్‌స–బీపా్‌సలో పారదర్శక కోసం టౌన్‌ ప్లానింగ్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో బృందాలు బాధ్యతలు నిర్వహిస్తాయి. జీడబ్ల్యూఎంసీ టౌన్‌ ప్లానింగ్‌, ఫైర్‌, పోలీస్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. సైట్‌ వెరిఫికేషన్‌, టెక్నికల్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్స్‌ను బృందాల్లోని అధికారులు పరిశీలిస్తారు. ఒక శాఖతో మరోశాఖకు సంబంధం లేకుండా బృందాలు ఏర్పాటు చేయడం ద్వారా అవినీతికి తావుండదనే ఉద్దేశంతో బృందాలను ఏర్పాటు చేశారు. కానీ ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ లేమి నెలకొనడం, ఒకరికి సమయం చిక్కితే మరొకరు అందుబాటులో ఉండకపోవడం వంటివి కొత్త చిక్కులను తెస్తోంది. 


ఇతర శాఖల ఉద్యోగులకు మాతృ శాఖ పనులే భారంగా మారడంతో ఫిల్డ్‌ వెరిఫికేషన్‌, టెక్నికల్‌ వెరిఫికేషన్స్‌ జరగడం లేదు. సదరు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరుపకపోవడంతో దరఖాస్తులు ముందుకు కదలడం లేదు. మాతృ శాఖ పనిభారమే భరించలేని స్థితిలో ఉచితంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం విఽధులు నిర్వహించడం కిష్టతరంగా మారిందని అధికారులు అంటున్నారు. పైగా నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి ఇలా సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు నగరంలో వెరిఫికేషన్స్‌ కోసం రోజులు కేటాయించి రావడం సమస్యగా మారింది. మాతృశాఖ అధికారుల నుంచి అనుమతులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా తమకు అదనపు భత్యం అంటూ ఏమి లేదని, డిప్యూటేషన్‌ విధానం కూడా లేదంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందంలోని వివిధ శాఖల అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


అనుమతుల నిబంధన

ఒకవైపు సాఫ్ట్‌వేర్‌ చిక్కులు, మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాల్లోని ఇతర శాఖల అధికారులు ససేమిరా అనడం వంటి వ్యవహారాలు 21 రోజుల్లోనే ఇళ్ల అనుమతులు ఆనే ప్రధాన సూత్రంతో రూపొందించిన టీఎ్‌స–బీపా్‌సకు బ్రేకులు వేస్తోంది. 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులురాని పక్షంలో ఆ తదుపరి రోజు నుంచి అనుమతులు మంజూరు అయినట్లుగానే భావించాలనేది కొత్త పురపాలక చట్టం నిబంధన. అలా జరగని పక్షంలో ఫైల్‌ ఏ లాగిన్‌లో నిలిచిందో సంబంధిత ఉద్యోగికి ప్రతిరోజు రూ.1000 జరిమానా అనే కఠిన నిబంధన కూడా పొందుపరచడం జరిగింది. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల క్రమంలో 21 రోజుల్లోనే అనుమతుల జారీ అమలు దరఖాస్తుదారుడికి అత్యాశగానే మారింది.


చుక్కలు చూపిస్తున్న డీపీఎంఎస్‌ ఫైల్స్‌

టీఎ్‌స–బీపా్‌సకు ముందు అమలైన డీపీఎంఎస్‌ విధానంలో పెండింగ్‌లో ఉన్న ఫైల్స్‌ దరఖాస్తుదారులు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈవిధానంలో సుమారు 1700పెండింగ్‌ ఫైల్స్‌ ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో కొద్ది రోజుల కిందట ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులను ఏర్పాటు చేశారు. అయినా పరిస్థితి మారడం లేదు. ఫైల్స్‌ ఆప్‌లోడ్‌ కాకపోవడం, ఒక లాగిన్‌ నుంచి మరొ లాగిన్‌లోకి జంప్‌ కావడం వంటి లోపాలు తలెత్తడంతో గందరగోళంగా మారింది. ఈ విధానంలో నిర్మాణ అనుమతులు కోసం ముందస్తుగా రూ.2500 చెల్లించిన దరఖాస్తుదారులు త్రిశంకు స్వర్గంలో ఇరుక్కున్నారు. దరఖాస్తు రద్దు చేసుకుంటే ఫీజు కోల్పోవాల్సిందే. ఉపసంహరించుకొని తిరిగి టీఎ్‌స–బీపాస్‌ ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకుంటే ఇన్నాళ్లు వేచి చూసిన కాలం వృథాయేనా..? అనే సంశయాలతో దరఖాస్తుదారులు సతమతమవుతున్నారు.

Updated Date - 2021-12-03T05:21:16+05:30 IST