రూ.లక్షల ‘రూటు’ మార్చేశారు!

ABN , First Publish Date - 2022-01-03T08:51:45+05:30 IST

ఆదాయం తగ్గిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ.. కొందరు అధికారుల వల్ల మరింతగా నష్టాల్లో కూరుకుపోతోందా? ఇంటి దొంగల కారణంగా సంస్థకు తీరని నష్టం వాటిల్లుతోందా?

రూ.లక్షల ‘రూటు’ మార్చేశారు!

  • ఆర్టీసీలో ఇంటి దొంగల ఇష్టారాజ్యం
  • ఇన్‌చార్జ్‌ల పాలనలో యథేచ్ఛగా అక్రమాలు
  • అక్రమార్కులను కాపాడేందుకు పైరవీలు!
  • సజ్జనార్‌ రాకతో అవకతవకలు వెలుగులోకి..


హైదరాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఆదాయం తగ్గిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ.. కొందరు అధికారుల వల్ల మరింతగా నష్టాల్లో కూరుకుపోతోందా? ఇంటి దొంగల కారణంగా సంస్థకు తీరని నష్టం వాటిల్లుతోందా? అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న కొంత మంది అధికారులు కింది స్థాయి సిబ్బందిని గుప్పిట్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతూ రూ.లక్షల నిధులను దారి మళ్లించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ నిధులను దారి మళ్లించిన ఘటనలపై సమగ్ర నివేదిక రూపొందించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సుదీర్ఘకాలంగా ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ల పాలనలో ఉండడంతో కొందరు అధికారులు స్థానికంగా ఆయా ప్రాంతాల్లోని చోటామోటా నాయకులను మచ్చిక చేసుకుని అవినీతి అక్రమాలకు తెరలేపినట్టు తెలిసింది. ఇటీవల ఆర్థిక కార్యకలాపాలు, ఆదాయ-వ్యయాలపై నిర్వహించిన అంతర్గత పరిశీలనలో భారీగా నిధులు దారి మళ్లినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో బడాబాబుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఆర్థిక అవకతవకలకు కారకుడిగా భావించిన ఆర్టీసీ అధికారిని ఇటీవల రీజినల్‌ మేనేజర్‌ స్థాయి నుంచి డీవీఎం ర్యాంక్‌కు రివర్ట్‌ చేసినట్టు తెలిసింది. 


అక్రమాలు.. పలు రకాలు..

వరంగల్‌ జిల్లాలో గతంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు పీఎఫ్‌ ఖాతాలో జమ చేయాల్సిన రూ.3.5 లక్షలను ఆర్టీసీ అధికారులు కాజేసినట్లు తెలిసింది. ఈ సంఘటనలో కింది స్థాయిలోని అధికారిని బాఽధ్యతల నుంచి తప్పించగా బాధ్యులైన వారు ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో విజిలెన్స్‌ అధికారులను మభ్యపెట్టి అవినీతికి పాల్పడిన అధికారి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో అద్దె బస్సుల వ్యవహారంలో సుమారు రూ.6.5 లక్షలకుపైగా అదనంగా చెల్లింపులు జరిపి నిధులు నొక్కేసినట్లు తెలిసింది. దిల్‌సుఖ్‌నగర్‌ డిపోలో అద్దె బస్సులకు సంబంధించిన లెక్కలను తప్పుగా చూపి రూ.లక్షలు కాజేసినట్టు ఆరోపణలున్నాయి. మరికొన్ని చోట్ల అద్దె బస్సుల పనితీరులో ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకుంటూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఇక బస్‌భవన్‌లో ఏళ్ల తరబడి తిష్ట వేసిన అధికారులు కొందరు అవినీతి అక్రమాలను బాహాటంగా ప్రోత్సహించినట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అప్పట్లో కోర్టు వివాదాలు, ఇతర న్యాయపరమైన అంశాలను పరిశీలించేందుకు ఉద్దేశించిన విభాగంలోని అధికారులు, సిబ్బందికి పని లేకపోవడంతో క్షేత్ర స్థాయి సిబ్బందిని బస్‌ భవన్‌కు రప్పించుకుని కమీషన్లు డిమాండ్‌ చేస్తున్నారని సమాచారం.


మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక బస్సుల నిర్వహణలోనూ కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలున్నాయి. తార్నాక ఆస్పత్రిలో ఔషధాల కొనుగోళ్లలో భారీగా అవినీతి చోటుచేసుకున్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా పారామెడికల్‌ సిబ్బందిని నియమించేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇన్‌చార్జ్‌ల పాలనలో ఆర్టీసీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. సజ్జనార్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన చర్యలతో అవకతవకలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-01-03T08:51:45+05:30 IST