TSRTC ఉద్యోగులకు సజ్జనార్ శుభవార్త..

ABN , First Publish Date - 2021-10-01T15:54:45+05:30 IST

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ సజ్జనార్‌ శుభవార్త అందించారు.

TSRTC ఉద్యోగులకు సజ్జనార్ శుభవార్త..

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ సజ్జనార్‌ శుభవార్త అందించారు. సిబ్బంది శుక్రవారం జీతాలు అందుకోనున్నారు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ నుంచి మొదటి వారం లోపే జీతాలు అందనున్నాయి. జీతాల విషయంలో ఇబ్బందులు లేకుండా జాతీయ బ్యాంక్‌తో ఒప్పందం కుదిరింది. ఇప్పటి వరకు ప్రతి నెలాఖరులో ఆర్టీసీ సిబ్బంది జీతాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.


మూడేళ్ల తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు అందుకోనున్నారు. ఇకపైనా ప్రతి నెలా మొదటి వారం లోపే జీతాలు చెల్లించాలని సంస్థ ఎండీ సజ్జనార్‌ ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. దాదాపు 48 వేల మంది ఉద్యోగులు, పింఛనుదారులు ఒకటో తేదీన వేతనాలు అందుకోనున్నారు.


కాగా.. మొత్తం 47 వేల మందికిపైగా ఉద్యోగులకు నెలనెలా వేతనాలకు రూ.230 కోట్లకు పైగా కావలసి ఉంది. పీఎఫ్‌ సుమారు రూ.40 కోట్లు, సీసీఎస్‌ రూ.30 కోట్లు మొత్తం రూ.70 కోట్లను ఆర్టీసీ ఆ తర్వాత సర్దుబాటు చేసుకుంటుంది. ఈ మొత్తాన్ని మినహాయించి వేతనాల వరకు సుమారు రూ.160 కోట్లు ఓడీ కింద బ్యాంకు సమకూర్చడానికి అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత నెల రోజులుగా ఆర్టీసీ పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించింది. కానీ, కరోనా భయంతో ఆశించిన స్థాయిలో బస్సుల్లో ప్రజలు ప్రయాణించడంలేదు.


రోజువారీ ఆర్టీసీ ఆదాయం రూ.15 కోట్ల నుంచి రూ.9.5 కోట్లకు పడిపోయింది. దీనికి తోడు డీజిల్‌, బస్సుల విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సంస్థ ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కొంటోంది. కాగా, ఆర్టీసీలో దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లే ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు నిలిపివేస్తూ అధికారులు సర్క్యులర్‌ జారీ చేశారు. విదేశాలకు వెళ్లే వారికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసేవారు. ఇక నుంచి ఉద్యోగులు వారి పరిమితి మేరకు వినియోగించే సెలవులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తారు.

Updated Date - 2021-10-01T15:54:45+05:30 IST