పోలీసుశాఖకు 90 క్వింటాళ్ల బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2020-04-03T21:36:21+05:30 IST

తెలంగాణ లాక్‌డౌన్‌ నేపధ్యంలో రాష్ట్రంలో నివసించే ఏపేదవాడూ ఆకలితో అలమటించకూడదని నగర మేయర్‌ బొంతురామ్మోహన్‌ అన్నారు.

పోలీసుశాఖకు 90 క్వింటాళ్ల బియ్యం పంపిణీ

హైదరాబాద్‌: తెలంగాణ లాక్‌డౌన్‌ నేపధ్యంలో రాష్ట్రంలో నివసించే ఏపేదవాడూ ఆకలితో అలమటించకూడదని నగర మేయర్‌ బొంతురామ్మోహన్‌ అన్నారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ల పరిధిలోని జీహెచ్‌ఎంసి పునరావాస కేంద్రాలు, భవన నిర్మాణ రంగం కార్మికులు, పోలీస్‌షెల్టర్‌లో ఉన్న వారికి, కిందిస్థాయి పోలీస్‌ సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించడానికి బియ్యం అందించాలని పోలీస్‌శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ శుక్రవారం జీహెచ్‌ఎంసి కార్యాలయంలో 90క్వింటాళ్ల నాణ్యమైన సన్నబియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ శాఖ తరపున అడిషనల్‌ ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, తెలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గంపా నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మానవతా దృక్పధంతో రాష్ట్రంలోని నిరుపేదలకు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కార్మికులకు ఉచితంగా 12 కిలో బియ్యం అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సహాయానికి తోడుగా ఇతర స్వచ్చంద సంస్థలు  కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేదలకు నాణ్యమైన భోజనం అందించేందుకు తెలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ బియ్యాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి క్లిష్టసమయంలో పేదలకు సహాయంగా నిలబడినందుకు తెలంగాణ రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌, జీహెచ్‌ఎంసి, పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-04-03T21:36:21+05:30 IST