TGలో హాట్ టాపిక్‎గా KA Paul రాజకీయం.. సడన్‌గా ఈ ఎంట్రీ ఎందుకో.. ఈయన వెనుక ఎవరున్నారు.. అసలు కథేంటి..!?

ABN , First Publish Date - 2022-05-21T17:55:54+05:30 IST

లారి ఆనంద పాల్‌. ఇలా పూర్తి పేరు చెపితే ఎవరూ గుర్తుపట్టలేరు. అదే కేఏ పాల్‌ అంటే రెండు తెలుగురాష్ట్రాల్లోనూ తెలిసిపోతుంది.ఆయన ఏం మాట్లాడినా సంచలనమే

TGలో హాట్ టాపిక్‎గా KA Paul రాజకీయం.. సడన్‌గా ఈ ఎంట్రీ ఎందుకో.. ఈయన వెనుక ఎవరున్నారు.. అసలు కథేంటి..!?

తెలంగాణ రాజకీయాల్లోకి కేఏపాల్‌ హఠాత్తుగా ఎంట్రీ ఇవ్వడం వెనుక ఎవరున్నారు? పదే పదే ఆయన కేసీఆర్‌ సర్కారును ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు. పాల్‌కు తెలంగాణ గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పించినది ఎవరు... అమిత్‌ షాతో పాల్‌ భేటీ వెనుకున్న లోగుట్టు ఏమిటి... అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..


పాల్‌ హడావుడి అంతా ఇంతా కాదు..

కిలారి ఆనంద పాల్‌. ఇలా పూర్తి పేరు చెపితే ఎవరూ గుర్తుపట్టలేరు. అదే కేఏ పాల్‌ అంటే రెండు తెలుగురాష్ట్రాల్లోనూ తెలిసిపోతుంది.ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ప్రపంచ యుద్ధాలనూ ఆపేయగల సత్తా తనకుందని చెప్పినా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మార్చేస్తానన్నా ఆయనకే చెల్లింది. కిందటిసారి ఎన్నికల్లో ఏపీలో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రజాశాంతి పార్టీ పేరుతో పెద్ద సంచలనమే సృష్టించారు. వైసీపీ గుర్తుకు దగ్గరగా ఉండేలా హెలికాప్టర్‌ గుర్తు తెచ్చుకోవడం, వైసీపీ అభ్యర్థుల పేర్లకు దగ్గరగా ఉండే వ్యక్తులను వెతికి మరీ టిక్కెట్లు ఇవ్వడం ఇలా అప్పట్లో చాలా హడావుడే చేశారు. 


తెలంగాణ పాలిటిక్స్‌ దిశ మార్చేస్తా..

ఏపీకి తానే వెలుగునిస్తానని పాల్‌ చెప్పినమాటలు ఇప్పటికీ ఏపీ జనాలకు గుర్తే. తాజాగా మూడేళ్ళ తరువాత ఆయన తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇకపై తెలంగాణ పాలిటిక్స్‌ దిశ మార్చేస్తానంటూ తానూ బరిలో ఉంటానంటూ చెప్పుకొస్తున్నారు. పనిలో పనిగా కేసీఆర్‌ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు.  దీంతోపాటు ఇటీవల అకాలవర్షంతో నష్టపోయిన  రైతుల పరామర్శకు బయల్దేరారు. ఈ క్రమంలో సిద్ధిపేట జిల్లా జక్కాపూర్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయనను అడ్డుకోవడమే కాక, ఓ కార్యకర్త పాల్‌పై చేయి చేసుకున్నారు. ఈ సంఘటనతో మరోసారి పాల్‌ వార్తలలో ప్రముఖంగా నిలిచారు. అదే సందర్భంలో  హఠాత్తుగా తెలంగాణ రాజకీయాలలో పాల్‌ ఎందుకు ప్రత్యక్షమయ్యారని చర్చ నడుస్తోంది.


పాల్‎ను బీజేపే రంగంలోకి దిచ్చిందా..?

పాల్‌ సీజనల్‌ పొలిటిషియన్‌లా తెలంగాణకు రావడం వెనుక ఎవరున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. తరచూ ప్రెస్‌మీట్లు పెట్టి కేసీఆర్‌ సర్కారును దుమ్మెత్తి పోయడం వెనుక కారణం ఏమై ఉంటుందా అనే చర్చ సాగుతోంది. నిజానికి కేఏ పాల్‌కు తెలంగాణలో చెప్పుకోదగిన బలమైతే లేదు. ఆయన పార్టీకి పెద్దగా ఉనికి కూడా లేదు. ఎన్నికల్లో నిలబడితే పట్టుమని పదిసీట్లు వచ్చే పరిస్థితీ లేదు.  కానీ తాజా  పరిస్థితులను  చూస్తే పాల్‌ను బీజేపీనే రంగంలోకి దించిందంటున్నారు.


ఇటీవల తనపై దాడి జరిగిన తరువాత పాల్‌ డీజీపీ అపాయింట్‌మెంట్‌ కోరారు కానీ లభించలేదు. దీనివెనుక కేసీఆర్‌ సర్కారు కుట్ర ఉందని పాల్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈనెల 7వ తేదీన పాల్‌ గవర్నర్‌ తమిళిసైని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసందర్బంగా తనపై జరిగిన దాడిని ఆయన గవర్నర్‌కు వివరించారు. ఇక తెలంగాణ గవర్నర్‌ను పాల్‌ కలవడం వెనుక ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.


తెలంగాణలో క్రిస్టియన్ల ఓట్లపై బీజేపీ గురిపెట్టిందా..?

కేంద్ర పాడి పరిశ్రమల శాఖామంత్రి పురుషోత్తమ్‌ రూపాల పాల్‌కు గవర్నర్‌ అపాయింట్‌మెంట్ ఇప్పించినట్టు తెలిసింది. ఈసీన్‌ కట్ చేస్తే ఢిల్లీలో హోంశాఖామంత్రి అమిత్‌షా వద్ద పాల్ తేలారు. దాదాపు అరగంటసేపు వీరి మధ్య మాటా మంతి జరిగింది. ఇక్కడ కూడా కేసీఆర్‌, కేటీఆర్‌ తనపై దాడి చేయించారని అమిత్‌షాకు  ఫిర్యాదు చేశారని తెలిసింది. తరువాత మీడియాతో మాట్లాడిన పాల్‌ తన భేటీ పరిణామాలేమిటో త్వరలోనే కేసీఆర్‌ సర్కారు చూస్తుందని చెప్పారు. ఇక తెలంగాణలో క్రిస్టియన్ల ఓట్లపై బీజేపీ గురిపెట్టిందని, అందుకు పాల్‌ను ఓ బాణంలా ఉపయోగించుకోవాలని చూస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. మొత్తం మీద పాల్‌ తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారారు. 

Updated Date - 2022-05-21T17:55:54+05:30 IST