ఊరెళ్లడమా.. ఉండిపోవడమా?

ABN , First Publish Date - 2022-01-06T07:49:55+05:30 IST

కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో నివసించే ఓ బ్యాంకు ఉద్యోగి సొంత ఊరు ఏపిలోని కాకినాడకు సమీపంలోని కొవ్వాడ. ఏటా భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సంక్రాంతికి సొంతూరుకు..

ఊరెళ్లడమా.. ఉండిపోవడమా?

  • సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లడంపై సందిగ్ధం..
  • పెరుగుతున్న కరోనా కేసులతో నగరవాసుల్లో దడ 
  • రద్దీ మధ్య బస్సు, రైలు ప్రయాణాలపై గుబులు 
  • టికెట్లు బుక్‌ చేసుకున్న వారిలో కొందరి వెనకడుగు
  • స్వస్థలాలకు వచ్చేయాలని అక్కడివారి నుంచి ఒత్తిడి 
  • 8 నుంచే సెలవులతో పిల్లలను ముందే పంపడంపై మల్లగుల్లాలు
  • పిల్లలను పంపాక.. కేసులు పెరిగితే వారక్కడ.. తామిక్కడ అనే ఆందోళన
  • కేసుల తీవ్రతతో పిల్లలను పంపించి వేయాలని కొందరి ఆలోచన


హైదరాబాద్‌ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో నివసించే ఓ బ్యాంకు ఉద్యోగి సొంత ఊరు ఏపిలోని కాకినాడకు సమీపంలోని కొవ్వాడ. ఏటా భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సంక్రాంతికి సొంతూరుకు వెళతారాయన. ఈసారి కూడా పండుగను ఊర్లోనే జరుపుకోవాలని నిర్ణయించుకొని నెల ముందే రైలు టికెట్లు బుక్‌ చేసుకున్నారు ఈ నెల పదిన సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరాల్సి ఉండగా, ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమైక్రాన్‌ కేసులు రెట్టింపవుతుండటంతో కుటుంబీకుల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల్లో కుటుంబంతో కలిసి ఊరెళ్లాలా? ఫ్లాట్‌కే పరిమితమవ్వాలా? అని ఆయన సందిగ్ధంలో పడ్డారు.నీటిపారుదల విభాగంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి శ్రీనగర్‌కాలనీలో నివసిస్తున్నారు. ఆయన సొంతూరు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి దగ్గర వేంసూరు. సంక్రాంతి సెలవులు రాగానే పిల్లలను సొంతూరికి పంపుతారాయన. అనంతరం పండుగకు ఒక రోజు ముందు భార్యతో కలిసి  ఊరెళ్తారు. ఈ నెల 8న విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలను ఊరికి పంపాలా.. వద్దా? అనే ఆలోచనలో పడ్డారు. అయితే నగరంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసుల నేపథ్యంలో పిల్లలను ఊరికి పంపడమే ఉత్తమమని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.


సంక్రాంతి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా సొంతూరుకు ప్రయాణం కట్టేందుకు సిద్ధవవుతున్న వారంతా కరోనా, ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో సందిగ్ధంలో పడ్డారు. ఒమైక్రాన్‌ కేసులతో అంత ప్రభావమేమీ ఉండదనుకుంటున్న తరుణంలోనే కొవిడ్‌ కేసులు రోజు రోజుకు రెట్టింపవుతున్న నేపథ్యంలో వారిలో ఆందోళన మొదలైంది.  సంక్రాంతి సంబరాలు ఏపీలోని పలు జిల్లాలో వైభవంగా జరుగుతాయి. దీంతో హైదరాబాద్‌లో ఉండే ఆయా ప్రాంతాల వారంతా పండుగకు సొంతూళ్లకు వెళ్లి వస్తుంటారు. ఇక్కడి వారిలో కొందరు ప్రత్యేకంగా కోడిపందాల్లో పాల్గొనేందుకు వెళుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది సొంతూళ్లకు వెళ్లేందుకు నెల రోజుల ముందే ట్రెయిన్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నారు. పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా, అందులోనూ టికెట్ల బుక్‌ అయ్యాయి.  టీఎ్‌సఆర్టీసీ కూడా పండుగ నేపథ్యంలో ప్రత్యేకంగా 1500 బస్సులను నడుపుతుండగా, ఏపీఆర్టీసీ కూడా అదేస్థాయిలో బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీతో పాటు ప్రైవేటు ట్రావెల్స్‌లో కూడా పెద్దఎత్తున బస్సు టికెట్లు బుకింగ్‌ జరిగిన్నట్లు తెలిసింది.


దడ పుట్టిస్తున్న పెరుగుతున్న కేసులు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు నగరవాసులను దడ పుట్టిస్తున్నాయి. విద్యాసంస్థలకు ఈ నెల 8నుంచి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించగా, కేసుల తీవ్రత పెరిగితే సెలవులను పొడిగిస్తారేమోనని భావిస్తున్నారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో పండుగ సంబరాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడమెందుకని కొందరూ ఊరెళ్ళే విషయంలో పునరాలోచనలో పడ్డారు. ఇంకొందరేమో జనం రద్దీ మధ్య ప్రయాణాలు అవసరమా? అని తమను తామే ప్రశ్నించుకుంటున్నారు. వీరిలో చాలామంది  కేసుల తీవ్రత రోజు రోజుకు ఇంకా పెరిగితే బుకింగ్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక పండుగకు ఊరెళ్ళేందుకు ప్రయాణాలు ఖరారు కానివారు, సెలవులు దొరకనివారు ఊరెళ్ళడం కంటే ఉన్న చోటనే ఇంటికి పరిమితమవ్వడం ఉత్తమం అని భావిస్తున్నారు.నగరంలో నివాసముంటున్న వారిని స్వస్థలాల్లోని కుటుంబీకులు, బంధువులు ఊర్లకు వచ్చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు.


హైదరాబాద్‌లోనే కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఊర్లలో కేసులు పెద్దగా లేవని అందుకే పండుగను ఊర్లోనే జరుపుకోవడం మేలని సూచిస్తున్నారు. 8నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలను ముందస్తుగా ఊరికి పంపాలని చెబుతున్నారు. అయితే పిల్లలను పంపించిన తర్వాత పరిస్థితులు అనుకూలించక.. తాము ఇక్కడి నుంచి వెళ్లలేని పరిస్థితులు నెలకొంటే పిల్లలు అక్కడ, తాము ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొందరు మాత్రం.. హైదరాబాద్‌లో కేసుల తీవ్రత నేపథ్యంలో ఏదేమైనా సరే పిల్లలను ఊరికి పంపించడమే ఉత్తమమని నిర్ణయించుకున్నారు.

Updated Date - 2022-01-06T07:49:55+05:30 IST