చిగురుపాటి కేసులో ఎస్పీపీకి బెదిరింపులు

ABN , First Publish Date - 2021-10-20T09:05:31+05:30 IST

చిగురుపాటి కేసులో ఎస్పీపీకి బెదిరింపులు

చిగురుపాటి కేసులో ఎస్పీపీకి బెదిరింపులు

బంజారాహిల్స్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసును వాదిస్తున్న స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఎస్పీపీ)తోపాటు సాక్షులను బెదిరిస్తున్న ముగ్గురిని జూబ్లీహిల్స్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డబ్బు విషయంలో వివాదం తలెత్తడం ‘హనీ ట్రాప్‌’ ద్వారా 2019లో జయరాం హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాకేశ్‌ రెడ్డి ప్రధాన నిందితుడు. రాకేశ్‌తోపాటు హత్యకు సహకరించిన మరికొంత మందిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌లో ఉంచారు. ఈ కేసులో రాకేశ్‌ రెడ్డికి బెయిలు రాకపోవడంతో జైలులోనే ఉన్నాడు. ఇదిలావుండగా కేసు నుంచి బయటపడేందుకు రాకేశ్‌ రెడ్డి పథకం వేశాడు. చంచల్‌గూడ జైలులో మేల్‌ నర్సుగా పనిచేసే యాకుత్‌పురాకు చెందిన మహమ్మద్‌ అక్బర్‌ అలీకి వివరించాడు. తాను చెప్పినట్టు చేస్తే భారీగా డబ్బు ఇస్తానని ఆశ చూపించాడు. దీనికి అక్బర్‌ ఒప్పుకున్నాడు. గుట్టల బేగంపేటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కుర్రపాటి మంగయ్య గుప్తా, నాగోల్‌కు చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ కత్తుల శ్రీనివాస్‌ సహాయం అడిగాడు. ముగ్గురు కలిసి స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తోపాటు ముఖ్య సాక్షులను బెదిరిస్తూ లేఖలు రాశారు. రాకేశ్‌ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఐపీసీ 189, 506, 509 సెక్షన్ల  కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-10-20T09:05:31+05:30 IST