బూస్టర్‌ డోసుకు క్యూ

ABN , First Publish Date - 2022-01-21T08:31:38+05:30 IST

బూస్టర్‌ డోసుకు క్యూ

బూస్టర్‌ డోసుకు క్యూ

వయసుతో సంబంధం లేకుండా పరుగులు

కొత్త వేరియంట్‌ ఆందోళనతో మూడో టీకాకు ఆసక్తి

9 నెలలు ఆగాలని కేంద్రం చెప్పినా బేపర్వా

డాక్టర్ల సలహాతో కొందరు.. స్వచ్ఛందంగా మరికొందరు

నిమిషానికి ముగ్గురికి కొవిడ్‌

కొత్తగా 4,207మందికి కరోనా.. 31 వరకు ఆంక్షలు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పాజిటివ్‌.. జగిత్యాల ఎమ్మెల్యేకూ

నేటి నుంచి మళ్లీ జ్వర సర్వే 

ప్రజల చెంతకే కొవిడ్‌ వైద్యం, టెస్టులు, కిట్లు 

అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: మంత్రి హరీశ్‌రావు


హైదరాబాద్‌, జనవరి 20 (ఆంఽధ్రజ్యోతి): ఒమైక్రాన్‌ దెబ్బకు కేసులు భారీగా పెరిగిపోతుండడంతో.. జనమంతా బూస్టర్‌ డోసు కోసం క్యూ కడుతున్నారు! కేంద్రం చాలా జాగ్రత్తగా ‘ముందుజాగ్రత్త డోసు’ను ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు మాత్రమే ఇవ్వాలని చెబుతున్నప్పటికీ.. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో వయసుతో సంబంధం లేకుండా 18 ఏళ్లు దాటినవారందరికీ బూస్టర్‌ డోసులు వేస్తున్నారు. సంక్రాంతి తర్వాత కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. బూస్టర్‌ డోసు తీసుకుంటే ఒమైక్రాన్‌ను నిరోధించే యాంటీబాడీల సంఖ్య

 

బాగా పెరుగుతుందంటూ రోజుకొక అధ్యయన ఫలితం వెలువడుతుండంతో చాలా మంది వైద్యులను సంప్రదిస్తున్నారు. పలు పాశ్చాత్యదేశాలు 18 ఏళ్లు దాటినవారందరికీ బూస్టర్‌ డోసులను ఇస్తుండడంతో.. ఇక్కడి వైద్యుల్లో కొందరు తమను సంప్రదించినవారికి బూస్టర్‌ డోసు తీసుకోవచ్చని చెబుతున్నారు. వారి సలహాతో.. 40 ఏళ్లు దాటినవారు ప్రైవేటులో మూడో డోసు తీసుకుంటున్నారు. మరికొందరైతే.. తమ ఇంట్లో 18 ఏళ్లు దాటినవారందరికీ కూడా ఈ ప్రికాషనరీ డోసు ఇప్పిస్తున్నారు.  ప్రైవేటు ఆస్పత్రుల వద్ద టీకా నిల్వలు భారీగా ఉండడం.. కొందరు వైద్యులు కూడా వేసుకోవచ్చని చెబుతుండడంతో.. ‘‘రోగి కోరిందీ.. వైద్యుడిచ్చిందీ ఒకటే’’ అన్న సామెత చందంగా మారింది పరిస్థితి. బూస్టర్‌డోసుకు సంబంధించి ఎలాంటి ఆంక్షలూ లేకపోవడం, సర్టిఫికెట్‌ తప్పనిసరి కాకపోవడంతో అనధికారికంగా మూడో డోసు తీసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. రెండో డోసు తీసుకున్న 9 నెలలకు మూడో డోసు తీసుకోవాలని కేంద్రం చెబుతుండగా.. చాలా మంది ఆరునెలలు, అంతకు ముందే మూడో డోసు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ప్రికాషనరీ డోసు ప్రభావం కూడా మూడు నెలలపాటే ఉంటుందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీకా తీసుకున్న తర్వాత యాంటీబాడీలు ఉత్పత్తి కావాలంటే కనీసం 14 రోజుల సమయం కావాలి. ఇప్పుడు ఇస్తున్న బూస్టర్‌ డోసుతో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యే సమయానికి మనదగ్గర మూడోవేవ్‌ పతాక స్థాయికి చేరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఫలితంగా.. రాబోయే మూడు నెలల్లో మరో వేవ్‌ వస్తేనే ఈ డోసు వల్ల ఉపయోగం ఉంటుందని, లేకపోతే పెద్దగా ప్రయోజనం ఉండదని వైద్యనిపుణులు చెబుతున్నారు.  


అందుబాటులో ఉంటే బూస్టర్‌  తీసుకోవచ్చు 

బూస్టర్‌ డోసుతో ఉపయోగం ఉంది. ఇతర దేశాల్లో 18 పైబడిన వారందరికీ బూస్టర్‌ డోసులు ఇస్తున్నారు. సాధారంగాణ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత యాంటీబాడీస్‌ తగ్గుతాయి. ఇలా శరీరంలో యాంటీబాడీస్‌ తగ్గిన వారికి డెల్టా, ఒమైక్రాన్‌ సోకుతున్నాయి. కనుక రెండో డోసు తీసుకున్న ఆరు మాసాల తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవచ్చు. అయితే మనదేశంలో మొదటి, రెండో డోసులే పూర్తి కాలేదు కాబట్టి బూస్టర్‌ ఇస్తే అసమానత వస్తుందనే అభిప్రాయంతోనే కేంద్రం రెండో డోసు తర్వాత 9 నెలలు ఆగాలని చెప్పింది. ఆ వ్యవధిని ఆరు నెలలకు తగ్గిస్తే మంచింది. 

- డాక్టర్‌ ఎంవీ రావు, జనరల్‌ మెడిసిన్‌, 

కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌, యశోదా ఆస్పత్రి, హైదరాబాద్‌

Updated Date - 2022-01-21T08:31:38+05:30 IST