వైద్యానికే సుస్తీ!

ABN , First Publish Date - 2022-01-21T08:23:03+05:30 IST

వైద్యానికే సుస్తీ!

వైద్యానికే సుస్తీ!

వైద్య సేవలందించే సిబ్బందికే పాజిటివ్‌ 

మిగతా సిబ్బందిలో ఆందోళన.. పని భారం.. భయంతో సెలవులు

కుంటుపడుతున్న పరీక్షలు, వైద్య సేవలు

‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌తో వెలుగులోకి 


హైదరాబాద్‌ సిటీ/న్యూ్‌సనెట్‌వర్క్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ పరీక్షలు చేస్తున్న సిబ్బందికి.. ఆస్పత్రిలో  వైద్యసేవలందించే సిబ్బందికే వైరస్‌ సోకుతోంది. హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఆశవర్కర్లలో పలువురికి పాజిటివ్‌ వస్తొంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు సేవలిందించాల్సిన వైద్య సిబ్బందికే వైరస్‌ సోకుతుండటం వైద్య శాఖలో గుబులు పుట్టిస్తోంది. ఓవైపు హైదరాబాద్‌లో థర్డ్‌వేవ్‌ కేసులు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని యూపీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లోని ఉద్యోగుల్లో ఎంతమంది కొవిడ్‌ బారిన పడ్డారు? సిబ్బంది కొరతతో ప్రజలకు ఎంతమేరకు సేవలు అందుతున్నాయి? అనే అంశాలపై గురువారం ‘ఆంధ్రజ్యోతి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. నగర పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఆశవర్కర్లు కొవిడ్‌ బారిన పడుతుండటంతో సరైన వైద్య సిబ్బంది లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆర్‌టీ పీసీఆర్‌ లాంటి పరీక్షలు చేయకుండా కేవలం యాంటిజెన్‌ టెస్టులు మాత్రమే చేస్తున్నారు.  ఈ క్రమంలో మిగిలిన సిబ్బందిలో కొందరు కరోనా భయంతో సెలవులు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన ఆ కొందరిపై  అదనపు భారం పడుతోంది. ఇదంతా గమనిస్తున్న ఉన్నతాధికారులు, పాజిటివ్‌గా తేలిన సిబ్బంది స్థానంలో తాత్కాలిక సిబ్బందిని నియమించకపోవడం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆస్పత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు కాదు కదా.. సాధారణ సేవలందించే సిబ్బంది కూడా ఉండరనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

Updated Date - 2022-01-21T08:23:03+05:30 IST