ప్రాజెక్టులకు నిధులివ్వండి

ABN , First Publish Date - 2022-01-21T08:38:39+05:30 IST

ప్రాజెక్టులకు నిధులివ్వండి

ప్రాజెక్టులకు నిధులివ్వండి

రాబోయే కేంద్ర బడ్జెట్లో కేటాయించండి

వరంగల్‌ ‘మెట్రో నియో’ పూర్తికి నిధులు కావాలి

ఎస్‌టీపీ ప్రాజెక్టుల నిర్మాణానికి సాయం చేయండి

లింక్‌ రోడ్ల నిర్మాణానికి మూడోవంతు 800 కోట్లివ్వండి

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ


హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. వరంగల్‌ మెట్రో నియో ప్రాజెక్టు పూర్తికి నిధులివ్వాలని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖకు ఇదివరకే సమర్పించినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ పాజ్రెక్టు వ్యయంలో 20ు (రూ.184) కోట్లు నిధులు మంజూరు చేయాలని, ఇది పూర్తయితే ద్వితీయ శ్రేణి నగరమైన వరంగల్‌ ప్రజా రవాణాలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. కేపీహెచ్‌బీ - కోకాపేట - నార్సింగి కారిడార్‌లో ఎంఆర్‌టీఎస్‌ (మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌) నిర్మాణానికి ప్రాథమిక అంచనా వ్యయం రూ.3,050 కోట్లు కాగా, అందులో 15ు అంటే రూ.450 కోట్లు కేంద్రం మంజూరు చేయాలని కోరారు. ఇది పూర్తయితే  2030 నాటికి అయిదు లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పటిష్ఠమైన మురుగునీటి వ్యవస్థ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకుగాను సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం.. 62 ఎస్‌టీపీ ప్లాంట్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఎస్‌టీపీ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.8,684.54 కోట్లు అంచనా వ్యయం కాగా.. ప్రాజెక్టు వ్యయంలో మూడోవంతు కేంద్రం మంజూరు చేయాలని, మిగతా మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా కేంద్రం అమలు చేస్తున్న మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పాలసీలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం మెట్రో నియో కోచ్‌ల తయారీపై దృష్టి సారించాలని భావిస్తోందని లేఖలో కేటీఆర్‌ వివరించారు. 


రవాణా వ్యవస్థ మెరుగుకు లింక్‌ రోడ్ల నిర్మాణం

హైదరాబాద్‌లోనే కాకుండా హైదరాబాద్‌ అనుబంధంగా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇందుకుగాను 22 మిస్సింగ్‌ లింక్‌ రోడ్లను చేపట్టి పూర్తి చేశామని తెలిపారు. 17 లింక్‌ రోడ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. రింగ్‌ రోడ్డు పరిసరాల్లోని పురపాలికలను కలుపుకొని 104 అదనపు కారిడార్లను గుర్తించామని, వీటి నిర్మాణానికి రూ.2,400 కోట్ల వ్యయం అంచనా వేసినట్లు తెలిపారు. దీన్ని పూర్తి చేసేందుకు కేంద్రం ప్రాజెక్టు వ్యయంలో మూడోవంతు రూ.800 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా రోడ్డు నెట్‌వర్క్‌ నిర్మాణం జరగాలన్న ప్రధానమంత్రి ఆశయం మేరకు.. తెలంగాణలో స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఆర్‌డీపీ)ను చేపట్టామన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలు ప్రణాళికలు రూపొందించామని, అందులో భాగంగానే పలు స్కైవేలు (100 కి.మీ), ప్రధాన కారిడార్లు (166 కి.మీ), ప్రధాన రహదారులు (348 కి.మీ) నిర్మించేందుకు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. దాదాపు 1400 కి.మీ మేర గ్రేడ్‌ సెపరేటర్లు, ఫ్లైఓవర్లు, మూసీ నది వెంట స్కైవేలు, మూసీకి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ప్రాధాన్యం ఉన్న రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ. 11,500 కోట్లతో అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. అంతే కాకుండా ప్యారడైజ్‌ కూడలి నుంచి శామీర్‌పేట - రాజీవ్‌ రహదారి - ఎస్‌హెచ్‌01 వరకు, ప్యారడైజ్‌ కూడలి నుంచి కండ్లకోయం విలేజ్‌ ఎన్‌హెచ్‌44 కలుపుకొని రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కారిడార్‌ కోసం అవసరమైన భూమికి సంబంధించిన అంశం రక్షణ శాఖలో పరిశీలనలో ఉందని, భూసేకరణ ఖర్చు మినహా మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయం రూ.9000 కోట్లు అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రెండో దశ ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా రోడ్ల నిర్మాణానికి రూ.14,000 కోట్ల అంచనాను రూపొందించామని, రోడ్ల అనుసంధానం, ముఖ్యమైన రోడ్ల విస్తరణ, రహదారులను మెరుగుపరచడం వంటివి ఇందులో ఉన్నట్లు వివరించారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కేంద్రం బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కేటీఆర్‌ కోరారు.

Updated Date - 2022-01-21T08:38:39+05:30 IST