రూ.4కోట్ల దోపిడీకి మస్తాన్‌వలీ స్కెచ్‌!

ABN , First Publish Date - 2022-01-21T08:47:13+05:30 IST

రూ.4కోట్ల దోపిడీకి మస్తాన్‌వలీ స్కెచ్‌!

రూ.4కోట్ల దోపిడీకి మస్తాన్‌వలీ స్కెచ్‌!

తెలుగు అకాడమీ తరహాలోనే గిడ్డంగుల సంస్థ

ఎఫ్‌డీలను దారి మళ్లించేందుకు విఫల యత్నం

పోలీసులకు యూబీఐ ఫిర్యాదు.. మరో కేసు నమోదు


హిమాయత్‌నగర్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న మస్తాన్‌ వలీ.. బాగోతం మరొకటి వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌కు చెందిన దాదాపు రూ.4కోట్లను కొల్లగొట్టేందుకు మాస్టర్‌ స్కెచ్‌ వేసినా.. సాంకేతిక కారణాలతో చివరి నిమిషంలో బెడిసికొట్టినట్లు తెలిసింది. సీసీఎస్‌ అధికారులు, గిడ్డంగుల సంస్థ ఎండీ జితేందర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది జనవరిలో తెలంగాణ గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98కోట్లను యూనియన్‌ బ్యాంక్‌ కార్వాన్‌ శాఖలో రెండు ఎఫ్‌డీ(రూ.1.99కోట్ల చొప్పున)లు వేశారు. వాటి మెచ్యూరిటీ గడువు ముగియడంతో ఈనెల 7న గిడ్డంగుల సంస్థకు చెందిన అధికారులు బ్యాంకుకు వెళ్లి ఎఫ్‌డీ పత్రాలు సమర్పించి.. ఆ మొత్తాన్ని తమ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని కోరారు. అయితే బ్యాంకు మేనేజర్‌ గిరి్‌షకుమార్‌ ఝా ఆ పత్రాలను పరిశీలించి..అవి నకిలీవని చెప్పడంతో గిడ్డంగుల సంస్థ అదికారులు అవాక్కయ్యారు. అయితే డబ్బులు మాత్రం ఎఫ్‌డీలలో సేఫ్‌గా ఉన్నాయని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అప్పట్లో మస్తాన్‌ వలీ.. ఉద్దేశపూర్వకంగానే నకిలీ ఎఫ్‌డీ పత్రాలను సృష్టించి.. గిడ్డంగుల సంస్థ అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది. డిపాజిట్ల మొత్తాన్ని గత ఏడాది మధ్యలోనే దారి మళ్లించడానికి ప్రయత్నించినా.. సాంకేతిక కారణాల వల్ల సాధ్యంకాలేదని సమాచారం. ఈలోగా తెలుగు అకాడమీ నిధుల స్కామ్‌ బయటకురావడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్‌ పడినట్లు తెలిసింది. ఈ మేరకు బ్యాంకు అధికారులు ఈనెల 13న సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పీటీ వారంట్‌పై మస్తాన్‌ వలీ కస్టడీ కోరుతూ ఈనెల 18న నాంపల్లిలోని 12వ ఏసీఎమ్‌ఎమ్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసినట్లు సీసీఎస్‌ అధికారులు తెలిపారు. మస్తాన్‌ వలీపై ఇప్పటికే రెండు కేసులు నమోదై ఉండగా.. తాజాగా సీసీఎస్‌ పోలీసులు మూడో కేసును నమోదు చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ(స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌)కు సంబంధించిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని ఎండీ జితేందర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-01-21T08:47:13+05:30 IST