అవును.. బెదిరించా!.. అంగీకరించిన వనమా రాఘవ

ABN , First Publish Date - 2022-01-09T08:55:10+05:30 IST

అవును.. బెదిరించా!.. అంగీకరించిన వనమా రాఘవ

అవును.. బెదిరించా!.. అంగీకరించిన వనమా రాఘవ

12 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి: ఏఎస్పీ

14 రోజుల రిమాండ్‌  విధించిన కోర్టు


పాల్వంచ రూరల్‌, జనవరి 8: నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. శనివారం పాల్వంచలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. నాగరామకృష్ణ బావమరిది జనార్దనరావు ఫిర్యాదు మేరకు వనమా రాఘవ, మండిగ సూర్యవతి, కొమ్మిశెట్టి మాధవిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదైనప్పటి నుంచి రాఘవ పరారీలో ఉన్నాడన్నారు. కారులో హైదరాబాద్‌ వెళుతుండగా శుక్రవారం రాత్రి మందలపల్లి క్రాస్‌రోడ్‌ వద్ద రాఘవ, ముగ్దేవి గిరీశ్‌, కొమ్ము మురళీలను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నాగరామకృష్ణను బెదిరించిన మాట వాస్తవమేనని రాఘవ అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడిపై 12 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కొత్తగూడెం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా.. 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. కాగా, రాఘవతో పాటు గిరీశ్‌, మురళిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన ఏఎస్పీ రాఘవను ఒక్కడినే న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం గమనార్హం. మాధవి, సూర్యవతిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదో వివరించలేదు. రాఘవను భద్రాచలం ప్రత్యేక సబ్‌జైలుకు తరలించారు. అతనికి రిమాండ్‌ ఖైదీగా నంబరు 985 సంఖ్యను కేటాయించారు. రాఘవకు అడుగడునా ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి నిరసన సెగ ఎదురైంది. రాఘవను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అతడ్ని పాల్వంచ స్టేషన్‌కు తీసుకొచ్చారనే సమాచారంతో ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రాఘవను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న వాహనాన్ని బీజేపీ, సీపీఐ నాయకులు అడ్డుకున్నారు. ఇక రాఘవ పరారీకి సహకరించాడనే కారణంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్‌ఎ్‌సయూఐ అధ్యక్షుడు ముక్తేవి గిరీశ్‌ను సంఘం నుంచి తొలగిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ తెలిపారు.

Updated Date - 2022-01-09T08:55:10+05:30 IST