దెబ్బకొట్టిన అకాల వర్షం

ABN , First Publish Date - 2022-05-05T08:55:35+05:30 IST

దెబ్బకొట్టిన అకాల వర్షం

దెబ్బకొట్టిన అకాల వర్షం

వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి పంట

పిడుగుపాట్లు, ప్రమాదాల్లో ముగ్గురి మృతి 

హైదరాబాద్‌లో విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తం

తిప్పర్తిలో 8.8, సీతాఫల్‌మండిలో 8 సెం.మీ వాన

మరో మూడురోజుల పాటు తేలికపాటి వర్షాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

వరికోతల సమయంలో అకాల వర్షం అన్నదాతలకు కడగళ్లను మిగిల్చింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్లలో ఆరబోసిన.. రాశులుగా చేసిన వడ్ల వద్ద నిద్రించిన రైతులు మేల్కొని ఽధాన్యాన్ని కాపాడుకునేంత సమయమూ ఇవ్వలేదు. నిమిషాల వ్యవధిలో వడ్లు తడిసిముద్దయ్యాయి. చాలాచోట్ల వరద నీళ్లలో కొట్టుకుపోయాయి. ఈదురు గాలులు తోడవ్వడంతో రాశులపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. చాలా చోట్ల కోతకు సిద్ధమైన వరిపంట నేలకొరింది. వడగళ్ల వానకు కంకుల్లోని వడ్లు నేలపాలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల దాకా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నల్లగొండ, యాదాద్రి, మెదక్‌, హనుమకొండ, జనగామ, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌, గద్వాల, కరీంనగర్‌, కామారెడ్డి, రంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాలో వేల ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. వందల ఎకరాల్లో మామిడి తోటలకు.. మిర్చి, నువ్వులు, కూరగాయల పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పిడుగుపాట్లు, ప్రమాదాల్లో వేర్వేరు చోట్ల ముగ్గురు మృత్యువాత పడ్డారు. చెట్లు, స్తంభాలు నేలకూలాయి. పాత ఇళ్లు, షెడ్లు కూలిపోయాయి. ప్రధాన రహదార్లపై వరద పొంగి ప్రవహించింది. చాలాచోట్ల విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం జరిగింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో 8.8 సెంటీమీటర్లు, హైదరాబాద్‌ సీతాఫల్‌మండిలో 8 సెం.మీ, బన్సీలాల్‌ పేటలో 7.7 సెం.మీ, యాదాద్రి రూరల్‌ మండలంలో 7.9 సెం.మీ, మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో 6సెం.మీ, కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లో 5.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 చోట్ల భారీగా, 50 చోట్ల మోస్తరుగా, 171 చోట్ల తేలికపాటి వర్షాలు పడ్డట్లు తెలంగాణ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ వెల్లడించింది. కాగా రాగల మూడురోజుల్లో రాష్ట్రంలో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.


అన్నదాత గుండె చెరువు

ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో కలిపి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25వేల బస్తాల ధాన్యం, జగిత్యాల జిల్లాలో 20వేల క్వింటాళ్లు, కరీంనగర్‌ జిల్లాలో 20,700 క్వింటాళ్లు, కామారెడ్డి జిల్లాలో 300 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసిపోయింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం జనగామలో 1,525 ఎకరాల్లో, కరీంనగర్‌ జిల్లాలో 5,634 ఎకరాల్లో,  మంచిర్యాల జిల్లాలో 4,800 ఎకరాల్లో, పెద్దపల్లి జిల్లాలో 1250 ఎకరాల్లో, జగిత్యాల జిల్లాలో 2,340 ఎకరాల్లో, ఆసిఫాబాద్‌ జిల్లాలో 500 ఎకరాల్లో, మెదక్‌ జిల్లాలో 229 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. జగిత్యాల జిల్లాలో 500 ఎకరాల్లో, రంగారెడ్డి జిల్లాలో 200 ఎకరాల్లో మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. ఉమ్మడి నల్లగొండ్లలోని తొమ్మిది ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. నకిరేకల్‌ మండలం మోదుగులగూడెంలో పగడాల లింగరాజు(22) అనే యువకుడు మృతిచెందాడు. కేతేపల్లిలో ఇంటిపై పట్టాకప్పెందుకు వెళ్లి.. రేకులు కూలడంతో వీరారెడ్డి(50) మృతిచెందాడు. మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం నర్లేంగడ్డలో రైతు సౌడు పోచయ్య(65) ధాన్యంపై టార్పాలిన్‌ కప్పుతుండగా పిడుగు పడటంతో మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా కాసిపేటలో ధాన్యమ్మీద టార్పాలిన్‌ కప్పేందుకు వెళ్లి సిద్ధం వెంకటేశ్‌ (49) జారిపడి మృతిచెందాడు.


గ్రేటర్‌ ఉక్కిరిబిక్కిరి 

భారీ వర్షానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఉక్కిరిబిక్కిరైంది. తెల్లవారుజామున 5:30 గంటలకు మొదలవడంతోనే కుండపోతగా కురిసింది. దీంతో రోడ్లు, కాలనీల్లో వరద నీరు ఉప్పొంగింది. బైక్‌లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీరు చేరి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పశ్చిమాన ఐటీ కారిడార్‌ మొదలుకొని తూర్పున ఎల్బీనగర్‌ వరకు.. దక్షిణాన పాతనగరం మొదలుకొని ఉత్తరాన కొంపల్లి దాకా ఎక్కడ చూసినా వరద నీరే కనిపించింది. మ్యాన్‌హోల్స్‌ పొంగిపొర్లడం, రోడ్లపైకి వ్యర్థాలు చేరడంతో దుర్వాసన నెలకొంది. పారిశుధ్య సిబ్బంది స్పందించి వ్యర్థాలను తొలగించే దాకా మధ్యాహ్నం కావడంతో అప్పటిదాకా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూసు్‌ఫగూడ, జీడిమెట్ల, హైదర్‌నగర్‌, పంజాగుట్ట ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహించింది. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోవడం.. చెట్ల కొమ్మలు విద్యుత్తు తీగలపై పడటంతో సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, ముషీరాబాద్‌, అల్వాల్‌, జూబ్లీహిల్స్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురంతో పాటు పలు ప్రాంతాల్లో  విద్యుత్‌సరఫరాలో గంటలకొద్దీ అంతరాయాలు తలెత్తాయి. మెట్రోజోన్‌ 11 కేవీ ఫీడర్ల పరిధిలో 588, రంగారెడ్డిజోన్‌ 360 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. మెట్రోజోన్‌లో 226, రంగారెడ్డిలో 89 ప్రాంతాల్లో బ్రేక్‌ డౌన్‌ సమస్యలు నెలకొన్నాయి. 70 కిపైగా సబ్‌స్టేషన్లలో సమస్యలు తలెత్తడంతో సరఫరాలో తరుచూ అంతరాయాలు నెలకొన్నాయి. విద్యుత్తు సరఫరా సమస్యలపై 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌తో పాటు 100, 7382072104, 7382072106, 7382071574 ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.

Read more