యువకుడి హత్య!

ABN , First Publish Date - 2022-05-05T09:27:14+05:30 IST

యువకుడి హత్య!

యువకుడి హత్య!

హైదరాబాద్‌లో దారుణం.. ప్రేమ పెళ్లే కారణం

పగతో రగిలిన అమ్మాయి సోదరుడు!

బైక్‌పై వెళుతుండగా మరికొందరితో కలిసి వేటాడిన వైనం 

కింద పడిన యువకుడిపై గడ్డపారతో దాడి.. అక్కడికక్కడే మృతి


సరూర్‌నగర్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): అమ్మాయి కుటుంబీకులకు ఇష్టంలేకుండా ప్రేమ వివాహం చేసుకోవడం ఆ యువకుడి ప్రాణాలు తీసింది! పగతో రగిలిపోయిన యువతి సోదరుడు, మరికొందరితో కలిసి యువకుడిని వెంటాడి గడ్డపారతో కొట్టి చంపాడు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో బుధవారం రాత్రి 9:30 గంటలకు నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే జరిగిన ఘటన అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మర్‌పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), పోతిరెడ్డిపల్లెకు చెందిన ఆశ్రిన్‌ సుల్తానా (23) కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఆశ్రిన్‌ సుల్తానా కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయితే జనవరి 31న ఆర్యసమాజ్‌లో నాగరాజు-ఆశ్రిన్‌ సుల్తానా వివాహం చేసుకున్నారు. తొలుత బాలానగర్‌ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పెళ్లికి మునుపు వికారాబాద్‌ పోలీసులను.. పెళ్లి తర్వాత బాలానగర్‌ పోలీసులను ఆశ్రయించారు. గత రెండు నెలల నుంచి ఈ జంట.. సరూర్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని పంజాల అనిల్‌ కుమార్‌ కాలనీలోని ఇంట్లో నివాసం ఉంటోంది. మూసారాంబాగ్‌లోని ఓ కార్ల షోరూంలో నాగరాజు సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నారు. బుధవారం నాగరాజు, ఆశ్రిన్‌ దంపతులు.. బైక్‌పై ముసారాంబాగ్‌ వెళ్లారు. తిరిగి ఈ జంట ఇంటికి వస్తున్న సమయంలో కొందరు బైక్‌ను అడ్డగించి నాగరాజుపై దాడి చేసి చంపారని ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. తీవ్ర గాయాలపాలైన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు.  ఈ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు ఆశ్రిన్‌ సుల్తానా సోదరుడు ముబీన్‌ అని అనుమానిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. సోదరి మతాంతర వివాహం చేసుకోవడం నచ్చని అతడు, అప్పటి నుంచే నాగరాజుపై పగతో రగిలిపోతున్నాడు.  నాగరాజును హత్యచేసేందుకు అదును కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో నాగరాజు, ఆశ్రిన్‌ సుల్తానా సరూర్‌నగర్‌ పంజాల అనిల్‌ కుమార్‌ కాలనీలో ఉంటున్న విషయం తెలుసుకున్నాడు. బుధవారం వారిపై నిఘా పెట్టాడు. మూసారాంబాగ్‌ నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్న దంపతులను అనుసరించాడు. కొత్తపేట నుంచి మరికొంత మంది ముబీన్‌కు తోడయ్యారు. వారు తమను తరుముతున్నారని గుర్తించిన నాగరాజు బైక్‌ వేగం పెంచాడు. అయితే వారి ఇంటికి వెళ్లే వీధి వద్ద బైక్‌ అదుపు తప్పడంతో వాహనం నడుపుతున్న నాగరాజు, వెనుక కూర్చున్న ఆశ్రిన్‌ సుల్తానా కింద పడ్డారు. ఇదే అదునుగా ముబీన్‌, అతడి అనుచరులు నాగరాజుపై దాడికి దిగారు. తమ వద్ద ఉన్న గడ్డపారతో నాగరాజు ముఖంపై విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ముబీన్‌, పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. కాగా ఘటనా స్థలికి బీజేపీ నాయకులు చేరుకున్నారు. రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ధర్నాకు దిగారు. 

Read more