Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 23 Sep 2022 03:50:45 IST

తహసీల్దార్‌ రాజయ్యపై సస్పెన్షన్‌ వేటు

twitter-iconwatsapp-iconfb-icon

మహిళ బతికుండగానే రికార్డుల్లో చంపి, పట్టా మార్పిడి చేసిన రాయికోడ్‌ తహసీల్దార్‌

ఆర్‌ఐపై క్రమశిక్షణా చర్యలకు కలెక్టర్‌ సిఫారసు


సంగారెడ్డి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మహిళ బతికుండగానే రికార్డుల్లో చంపేసి, పట్టా మార్పిడి చేసిన సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ తహసీల్దార్‌ రాజయ్యపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ శరత్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజయ్యపై క్రిమినల్‌ కేసు నమోదు చేయించారు. రాజయ్యకు సహకరించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) శ్రీకాంత్‌పై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆర్డీవోతో విచారణ జరిపించిన కలెక్టర్‌ శరత్‌ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. రాయికోడ్‌ మండలం నాగన్‌పల్లికి చెందిన పట్లూరి శివమ్మ, తాను బతికి ఉండగానే రెవెన్యూ రికార్డుల్లో చనిపోయినట్లు నమోదు చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన పేరిట 198 సర్వే నంబరులో ఉన్న 27.34 ఎకరాల వ్యవసాయ భూమిని తమ బంధువైన శేరి అంజమ్మ పేరిట మార్చేశారని ఫిర్యాదులో వివరించారు.  జహీరాబాద్‌ ఆర్డీవో రమేశ్‌ బాబుతో విచారణ జరిపించిన కలెక్టర్‌ శరత్‌.. తహసీల్దార్‌, ఆర్‌ఐలపై చర్యలు చేపట్టారు. ఈ విషయమై వివరణ కోసం రాజయ్యను సంప్రదించగా జూన్‌ 27న ఫౌతి గురించి అంజమ్మ స్లాట్‌ బుక్‌ చేసుకుని తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిందని, సరైన పత్రాలు లేకపోవడంతో మూడు నెలలుగా రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఆపేశామని తెలిపారు. ఈ నెల 19న అంజమ్మ, ఆమె కుమారుడు అమృత్‌రెడ్డి వచ్చి రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ కొన్ని పత్రాలను చూపారని.. తొందరలో తాను పత్రాలను సరిగా పరిశీలించకుండా రిజిస్ట్రేషన్‌ చేశానని రాజయ్య అంగీకరించారు. శివమ్మ చనిపోయినట్లు తప్పుడు సర్టిఫికెట్‌ సృష్టించి ఆమెకు చెందిన 27.34 ఎకరాల భూమిని పట్టా మార్పిడి చేసుకున్న శేరి అంజమ్మ, అమృత్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డితో పాటు సాక్షులుగా వ్యవహరించిన టి.మల్లేశం, బి.నర్సింహులుపై రాయికోడ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.