నీళ్ల కోసం కొట్లాడని దద్దమ్మ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-09-23T08:37:47+05:30 IST

నీళ్ల కోసం కొట్లాడని దద్దమ్మ ఎమ్మెల్యేలు

నీళ్ల కోసం కొట్లాడని దద్దమ్మ ఎమ్మెల్యేలు

దమ్ముంటే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపండి

ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల సవాల్‌


వికారాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి, పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు నీళ్ల కోసం కొట్లాడని దద్దమ్మలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇప్పటిదాకా నీళ్లు రాకపోయినా.. రూ.17వేల కోట్లు ఖర్చు చేసి కేసీఆర్‌ కమీషన్లు తిన్నారని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలకు దమ్ముంటే నీళ్ల కోసం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని సవాల్‌ విసిరారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 160వ రోజు గురువారం వికారాబాద్‌ జిల్లా పరిగి శివారులోని రుక్కుంపల్లి క్రాస్‌రోడ్‌ నుంచి గొట్టిముక్కుల, మద్గుల్‌ చిట్టంపల్లి, గుడుపల్లి, బూర్గుపల్లి, ఎన్నేపల్లి క్రాస్‌రోడ్ల మీదుగా వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌కు దళితులపై ప్రేమలేదని ఆరోపించారు. అప్పట్లో మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఇప్పుడు దళిత బంధు పేరిట మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా గిరిజన బంధు అంటున్నారని, రేపు బీసీ బంధు.. ఎల్లుండి అందరికీ బంధు అంటారని, ఆ తరువాత ఆకాశంలో ఉన్న చందమామను తెస్తానంటూ ప్రజలను నమ్మిస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను నిలదీయడంలో బీజేపీ, కాంగ్రె్‌సలు విఫలమయ్యాయని, అలాంటి పార్టీలకు ఎందుకు ఓట్లెయ్యాలని ప్రశ్నించారు. భూముల ఆక్రమణలో వికారాబాద్‌ ఎమ్మెల్యే దిట్ట అని, వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. త్యాగాలు ఎవరివి? భోగాలు ఎవరివి? అనేది ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు.  

Updated Date - 2022-09-23T08:37:47+05:30 IST