దోపిడీదారులు జైలుకే

ABN , First Publish Date - 2022-09-23T08:30:29+05:30 IST

దోపిడీదారులు జైలుకే

దోపిడీదారులు జైలుకే

కేంద్ర నిధులను రాష్ట్రం అడ్డుకుంటోంది.. కేసీఆర్‌ మోసగాడు.. ఆదివాసీల వ్యతిరేకి

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం.. కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి

కేసీఆర్‌.. దళితుడిని సీఎం చెయ్‌

ఒవైసీకి ఐఎస్‌ఐ తీవ్రవాదులే కనిపిస్తారు

ఇబ్రహీంపట్నంను వీరపట్నంగా మారుస్తాం

మునుగోడులో భారీగా ఎస్సీ, ఎస్టీ ఓట్లు

అందుకే సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

టీఆర్‌ఎస్‌ పీఠాలు కదులుతున్నాయి: లక్ష్మణ్‌

అంబేడ్కర్‌ పేరిట సీఎం డ్రామా: రఘునందన్‌

ముగిసిన 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర

పెద్ద అంబర్‌పేట సభకు భారీగా జనం


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/అబ్దుల్లాపూర్‌మెట్‌/వనస్థలిపురం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రజల సొమ్మును లూటీ చేసే వారు జైలుకు వెళ్ల్లాల్సిందేనని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి అన్నారు. కేంద్రం ఇస్తున్న పీఎంఏవై నిధులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుండడంతో రాష్ట్రంలోని పేదలకు పక్కా ఇళ్లు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించిన నిధులను సైతం లబ్ధిదారులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే వాడుకుంటోందని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను లూటీ చేస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పెద్ద మోసగాడని పేర్కొంటూ.. ఇలాంటి వారు అధికారంలో ఉండాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌.. ఇంకెంత దోచుకుంటావ్‌? ఇంకెంత తింటావ్‌? ప్రభుత్వం ఉన్నది నీ కుటుంబం బాగు కోసమా? ప్రజల బాగు కోసమా? అని నిలదీశారు. ప్రజా ధనాన్ని లూటీ చేసిన వారి ఇళ్లకు బుల్డోజర్లు పంపాల్సిన అవసరం ఉందని, అది బీజేపీకే సాధ్యమని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం పరిధిలోని పెద్దఅంబర్‌పేట్‌లో నిర్వహించిన బహిరంగ సభకు సాధ్వీ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలకు తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. టెర్రరిస్టులు, ఉగ్రవాదులకు ఇబ్బంది కలిగితే చాలు.. బాధపడే వ్యక్తి ఎవరో మీకు బాగా తెలుసు అంటూ ఒవైసీపై పరోక్ష విమర్శలు చేశారు. ఇక్కడ దేశాన్ని ముక్కలు చేసే నాయకుడు ఉన్నాడని, అతడు ఒవైసీకి సోదరుడు అవుతాడని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కేసీఆర్‌ అని ధ్వజమెత్తారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడితే కనీసం మద్దతు ఇవ్వలేదని గుర్తు చేశారు. విమోచన దినోత్సవం నిర్వహించే ధైర్యం కూడా లేకుండా పోయిందని విమర్శించారు. బీజేపీని మతతత్వ పార్టీ అంటున్న వారు.. మజ్లిస్‌ గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని సాధ్వీ అన్నారు. ఆయనకు ఇదే చివరి యాత్ర అని, తర్వాత వారు ఎలాగూ గెలిచేది ఉండదని ఎద్దేవా చేశారు. 


దళితులపై నిజమైన ప్రేమ ఉంటే..

కేసీఆర్‌కు దళితులపై నిజమైన ప్రేమ ఉంటే.. సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ప్రజాపయోగ పథకాలు కొనసాగిస్తామని, ఇబ్రహీంపట్నం పేరును వీరపట్నంగా మారుస్తామన్నారు. తన పాదయాత్రలో కార్యకర్తలు లేరంటూ ఒవైసీ విమర్శిస్తున్నారని పేర్కొంటూ.. ఆయనకు ఐఎ్‌సఐ తీవ్రవాదులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, బాంబు దాడులకు పాల్పడిన వాళ్లే కనబడతారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ కానుందన్న సంగతి కేసీఆర్‌ గుర్తుంచుకోవాలని సూచించారు. మునుగోడులో ఎస్సీ, ఎస్టీల ఓట్లు ఎక్కువగా ఉన్నందునే సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టారని, హడావుడిగా గిరిజన బంధు ప్రకటించారని విమర్శించారు. పార్లమెంట్‌కు అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. పార్లమెంట్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీకి మరో ‘ఆర్‌’ను పంపించి, మోదీ, షా, నడ్డాకు బహుమతి ఇద్దామన్నారు. అక్టోబరు 15 నుంచి ఐదోవిడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభవుతుందని సంజయ్‌ ప్రకటించారు.


ఎన్నిక వస్తే.. ఏదో ఒక బంధు

ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ నిర్మించిన 60 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ఎందుకు పంపిణీ చేయడం లేదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇళ్లు పంపిణీ చేయకపోతే వచ్చే జనవరి 1న ప్రజలతో కలిసి తామే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నిక వస్తేనే ఏదో ఒక బంధు వస్తుందని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని గౌరవించని కేసీఆర్‌.. ఇప్పుడు కొత్త సచివాలయానికి ఆయన పేరు పెడతామంటూ నాటకాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. ముందుగా పంజాగుట్టలో తొలగించిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠించి.. లెంపవేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ సంజయ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేని అధికార పార్టీ.. బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. మంత్రి కేటీఆర్‌ను ట్విటర్‌ పిట్టగా అభివర్ణించిన లక్ష్మణ్‌.. ప్రధాని మోదీ పట్ల కనీస గౌరవం లేకుండా తండ్రీ కొడుకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ ఒక నియంతలా వ్యవహారిస్తున్నారని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చింది కాదని, ప్రజల సంక్షేమం కోసం వచ్చిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ధర్మాని కాపాడి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రజలను కోరారు. ప్రజాసంగ్రామ యాత్రకు లభిస్తున్న ఆదరణను ఓర్వలేని రాష్ట్ర ప్రభుత్వం.. అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 


రాజాసింగ్‌ను విడుదల చేయాలి

రాజాసింగ్‌ను విడుదల చేయాలని కోరుతూ సభలో పలువురు కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో బండి సంజయ్‌ జోక్యం చేసుకుని.. ఏం చేయాలో తమకు తెలుసని, జరగాల్సింది.. జరిగి తీరుతుందని అన్నారు. తమకు జైలుకు పోవడం కొత్త కాదని, తానూ జైలుకు నమస్కారం పెట్టి వచ్చానని, ధర్మం కోసం జైలుకు పోవడం తప్పు కాదని పేర్కొన్నారు. దొంగ పనులు చేసే వారే జైలుకు పోవడానికి భయపడతారన్నారు.

Updated Date - 2022-09-23T08:30:29+05:30 IST