తెల్ల ‘బంగారమే’!

ABN , First Publish Date - 2022-09-23T07:59:07+05:30 IST

తెల్ల ‘బంగారమే’!

తెల్ల ‘బంగారమే’!

క్వింటాలు పత్తి రూ.8 వేలు పలికే అవకాశం.. అంతర్జాతీయ విపణిలో క్యాండీ రూ.75 వేలు

అధిక వర్షాలతో దిగుబడులపై తీవ్ర ప్రభావం

భారీగా దిగుబడులు తగ్గొచ్చు: నిపుణులు

దసరా నుంచి మార్కెట్‌లకు పత్తి 


హైదరాబాద్‌, ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలు ముద్దుగా తెల్ల బంగారం అని పిలుచుకునే పత్తి నిజంగానే బంగారంగా మారనుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది కాస్తో కూస్తో దిగుబడులొచ్చి అన్నదాతకు సిరులు కురిపిస్తే.. ఈసారి మాత్రం అధిక వర్షాలు రైతాంగాన్ని నిండా ముంచాయి. ఫలితంగా దిగుబడుల్లో 45 శాతం తగ్గుదల నమోదయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వరంగల్‌, ఖమ్మం మార్కెట్లకు పత్తి రాక ప్రారంభంకాగా... క్వింటాలు పత్తికి సగటున రూ.9 వేలు ధర పలుకుతుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 6,380 ఉండగా...అంతకంటే రూ. 2,500 నుంచి రూ.2,600 ఎక్కువ పలుకుతుండటంతో పత్తి రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ తగ్గిన నేపథ్యంలో ఈసారి క్వింటాలు పత్తికి సగటున రూ.8 వేల వరకు ఽధర గిట్టుబాటయ్యే అవకాశం ఉంటుందని ట్రేడర్లు చెబుతున్నారు. మరోవైపు, ఈ ధర రూ.12 వేల వరకు కూడా చేరవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. వర్షాలు మొదలుకాకముందే మే,జూన్‌ నెలల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు హార్వెస్టింగ్‌ ప్రారంభించా రు. ప్రస్తుతం పత్తి స్వల్ఫ పరిమాణంలో మాత్రమే మార్కెట్‌కు వస్తోంది. సాధారణంగా సెప్టెంబరు 15నుంచే రైతు లు పత్తి తీయటం(హార్వెస్టింగ్‌) ప్రారంభమవుతుంది. దసరా నాటికి మార్కెట్‌ వేగంగా పుంజుకుంటుంది. 100 రోజుల్లో చేతికి రావాల్సిన పంట... ఈసారి కాస్త ఆలస్యం అవుతోంది. జూలైలో కురిసిన అధిక వర్షాలతో పంటలు అతలాకుతలమయ్యాయి. దీంతో రెండు నుంచి మూడు వారాలు ఆలస్యంగా పత్తి మార్కెట్‌ ప్రారంభం అవుతోంది. దసరా, దీపావళికి మార్కెట్‌ పుంజుకుంటుందని ట్రేడర్లు చెబుతున్నారు. అయితే ఈసారి సీజన్‌లో ఎమ్మెస్పీ కంటే ఎక్కువే ఉంటుందని, క్వింటాలుకు సగటున రూ. 8 వేల వరకు రైతులకు గిట్టుబాటయ్యే పరిస్థితి ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవని, హెచ్చుతగ్గులుంటాయని, కానీ రూ.8 వేల కంటే తక్కువకు పడిపోయే ప్రమాదం మాత్రం ఉండదని ట్రేడర్లు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం దూదికి డిమాండ్‌ తగ్గిపోయింది. దాంతో ఇండియన్‌ మార్కెట్లో క్యాండీ(356 కిలోల దూది) ధర రూ. 1.12 లక్షల నుంచి రూ. 75 వేలకు పడిపోయింది. పత్తి గింజల ధర కూడా తగ్గింది.


రైతులు అమ్మినపుడు తక్కువ ధర

పత్తి ధర నిరుడు అత్యధికంగా క్వింటాలుకు రూ. 14 వేలు కూడా పలికింది. కొన్ని రోజులు రూ. 12 వేలు పలికింది. రికార్డు ధర రూ. 12 వేల నుంచి రూ. 14 వేలు పలికినప్పటికీ... ఎక్కువ మంది రైతులకు రూ. 7 వేల నుంచి రూ. 8 వేల చొప్పునే ధర లభించింది. కొందరు రైతులకు రూ. 9 వేల వరకు ధర గిట్టుబాటయ్యింది. అయితే పత్తి మార్కెట్‌ను  ట్రేడర్లు, జిన్నింగ్‌ మిల్లర్లు, దళారులే శాసిస్తుంటారు. రైతులు మార్కెట్‌కు పత్తిని విరివిగా తెచ్చినపుడు, మార్కెట్లో పత్తి పోటెత్తినపుడు ధర తగ్గిస్తున్నారు. దళారులు, ట్రేడర్ల చేతికి పోయిన తర్వాత ధర పెరుగుతోంది. నిరుడు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) కూడా తెలంగాణ మార్కెట్లోకి రాలేదు. ఈసారి కూడా వస్తుందనే నమ్మకం లేదు. దీంతో ప్రైవేటు ట్రేడర్ల గుత్తాధిపత్యం నడుస్తోంది. ధర గణనీయంగా పెరిగినపుడు, అది రైతులకు లభిస్తే లాభసాటిగా ఉంటుంది. 


ఉమ్మడి ఆదిలాబాద్‌ నం.1

దక్షిణాది రాష్ట్రాల్లో పత్తి సాగులో కీలకంగా ఉన్న ఆంధ్రపదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పండించే పత్తిలో.. మొదటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పండించే పత్తి పంటే నాణ్యతాపరంగా టాప్‌లో ఉందని సీసీఐ చెబుతోంది. దీంతో మిగతా ప్రాంతాలతో పోల్చి చూస్తే ఇక్కడే అధిక ధర చెల్లిస్తున్నారు. 

Updated Date - 2022-09-23T07:59:07+05:30 IST