ఢీ..ట్వంటీ!

ABN , First Publish Date - 2022-09-23T07:53:57+05:30 IST

ఢీ..ట్వంటీ!

ఢీ..ట్వంటీ!

భారత్‌-ఆసీస్‌ టీ20 మ్యాచ్‌ టికెట్ల కోసం వేలాదిగా రాక

సికింద్రాబాద్‌ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్తత

లాఠీచార్జి, ఏడుగురికి గాయాలు.. భారీగా ట్రాఫిక్‌జామ్‌

ఏర్పాట్లలో హెచ్‌సీఏ అలక్ష్యం.. క్రికెట్‌ సంఘంపై 3 కేసులు

ఇంత ఒత్తిడిలోనూ 200 టిక్కెట్ల కోసం క్రీడామంత్రి పట్టు

మొహాలీ, నాగపూర్‌లో సాఫీ.. హైదరాబాద్‌లో రగడ


హైదరాబాద్‌ సిటీ/బోయిన్‌పల్లి/అడ్డగుట్ట, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): క్రికెటర్లను ప్రత్యక్షంగా చూడాలని ఆశపడ్డ ఆ అభిమానులు.. లాఠీ దెబ్బలు రుచి చూశారు. హైదరాబాద్‌లో మూడేళ్ల తర్వాత క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండడం.. అదీ భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య, ఆదివారం కావడంతో టికెట్ల కోసం అభిమానులు వేలాదిగా జింఖానా గ్రౌండ్‌కు తరలివచ్చారు. కానీ, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్లక్ష్యం.. పోలీసుల వైఫల్యంతో టికెట్ల విక్రయం కాస్తా సమరాన్ని తలపించింది. అర్ధరాత్రి నుంచి లైనులో నిలబడినా.. టికెట్లు దక్కకపోవడం.. రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయకపోవడంతో అభిమానులు ఆగ్రహించారు. టికెట్ల కోసం పోటెత్తిన అభిమానులను పోలీసులు కానీ, హెచ్‌సీఏ కానీ అదుపు చేయలేకపోవడంతో భీతావహ పరిస్థితి నెలకొంది. గేట్లను తోసుకొని లోనికి వచ్చేందుకు ప్రయత్నించిన అభిమానులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దీంతో భయాందోళనకు గురైన వారు పరుగులందుకున్నారు. తొక్కిసలాట జరగడంతో పలువురు స్పృహ కోల్పోయారు. ఏడుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.


నిమిషాల్లోనే అమ్మేశారా..?

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్‌ జరగనుంది. స్టేడియం సీటింగ్‌ సామర్థ్యం 39 వేలు కాగా.. 9 వేల వరకు కాంప్లిమెంటరీ పాస్‌లు ఇస్తారు. మరో 30 వేల టికెట్లను ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌లో విక్రయించాలి. పేటీఎంలో ఆన్‌లైన్‌ టికెట్లను అమ్మకానికి ఉంచినట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. నిమిషాల వ్యవధిలోనే అన్ని టికెట్లు అమ్మేసినట్లు చూపారు. ఈ క్రమంలో టికెట్ల విక్రయం ఎప్పుడు ఉంటుందన్న దానిపైనా గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జింఖానా గ్రౌండ్‌లో ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయం ఉంటుందని హెచ్‌సీఏ బుధవారం ప్రకటించింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచి జింఖానా వద్ద అభిమానులు పడిగాపులు కాశారు. క్రికెట్‌ను అమితంగా ప్రేమించే కొందరు వయోధికులు, మహిళలూ గంటల తరబడి నిరీక్షించారు. జిల్లాలతోపాటు ఏపీ నుంచీ అభిమానులు హైదరాబాద్‌కు వచ్చారు. జింఖానా గ్రౌండ్‌ నుంచి రెండు వైపులా వేల మంది బారులు తీరారు. గురువారం ఉదయం 10.45 గంటల సమయంలో హెచ్‌సీఏ గేటు వద్ద అభిమానులను క్యూలో నిలబెట్టేందుకు పోలీసులు, సిబ్బంది ప్రయత్నించారు. పది మంది చొప్పున లోపలికి పంపిస్తున్నారు. ఈ క్రమంలో గేటు వద్దకు తోసుకొని వచ్చిన కొందరిని నియంత్రించలేక పోలీసులు చెతులెత్తేశారు. గేట్లు మూసివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. తీవ్ర తోపులాట జరగడంతో ఊపిరాడక కొందరు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో తొక్కిసలాట జరిగి కొందరు స్పృహ తప్పి పడిపోయారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు సీఆర్‌పీఎఫ్‌, అదనపు బలగాలను రప్పించారు. తోపులాట, లాఠీఛార్జి కారణంగా గాయపడ్డ రంజిత సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమె చనిపోయిందంటూ అక్కడున్నవారు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి లాఠీలకు పని చెప్పారు. తోపులాటలో ఓ కానిస్టేబుల్‌, మరో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. 


రెండు కౌంటర్లు మాత్రమే..

టికెట్ల విక్రయానికి హెచ్‌సీఏ రెండు కౌంటర్లను మాత్రమే ఏర్పాటు చేసింది. ఒక కౌంటర్‌లో టికెట్లు ఇవ్వడం.. మరో కౌంటర్‌లో నగదు, పేటీఎం, స్వైప్‌ మిషిన్‌లో డబ్బులు చెల్లించే ఏర్పాట్లు చేశారు. ఏటీఎం కార్డుతో లావాదేవీలకు 5 నిమిషాలు పట్టింది. దీంతో మొదటి గంటలో 100 టికెట్లు కూడా విక్రయించలేదు. బాగా ఆలస్యమవుతుండడంతో క్యూ లైన్‌లో ఉన్న వారు గొడవ చేశారు. రెండు వేల టికెట్లే ఇస్తున్నట్లు హెచ్‌సీఏ కమిటీ సభ్యులు ప్రకటించగా.. అన్ని కూడా ఇవ్వలేదని అభిమానులు ఆందోళనకు దిగారు. సాంకేతిక సమస్యలతో ఇంటర్నెట్‌ రావడం లేదని దాదాపు గంటపాటు టికెట్ల విక్రయం నిలిపివేశారు. ఆఫ్‌లైన్‌ టికెట్లకు ఇంటర్నెట్‌తో ఏం సంబంధం.. ఉద్దేశపూర్వకంగానే టికెట్లు ఇవ్వడం లేదని అభిమానులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అనంతరం ఇంటర్నెట్‌ పునరుద్ధరించడంతో అభిమానులు శాంతించారు. హెచ్‌సీఏ టికెట్‌ కౌంటర్‌ వద్ద పోలీసులు అధికార దర్పాన్ని ప్రదర్శించారు. వేలాది మంది బారులు తీరగా.. వాళ్లు మాత్రం కౌంటర్ల వద్ద నేరుగా వెళ్లి టికెట్లు తీసుకోవడం కనిపించింది. తోపులాటలు, కార్లు, ద్విచక్ర వాహనాల కారణంగా జింఖానా పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. తోపులాటలో బేగంపేట పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌, అగ్నిమాపక సిబ్బంది శ్రీనాథ్‌ యాదవ్‌ గాయపడగా, పోలీసుల లాఠీచార్జిలో కవాడిగూడకు చెందిన విద్యార్థి ఆదిత్య, స్వీపర్‌ రంజిత, ఇందిరానగర్‌కు చెందిన ఆలియ, కొంపల్లికి చెందిన సాయికిషోర్‌, కేపీహెచ్‌బీకి చెందిన సుజాత గాయపడ్డారు. వీరిని సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. అభిమానులపై లాఠీచార్జి చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. అవినీతిపరులతో కూడిన హెచ్‌సీఏ కమిటినీ వెంటనే రద్దు చేయాలని ట్విటర్లో డిమాండ్‌ చేశారు.


భర్తను సర్‌ప్రైజ్‌ చేసేందుకు.. 

ఆర్మీలో పనిచేసే తన భర్తను సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఓ మహిళ పెద్ద సాహసమే చేసింది. నెలల పసికందుతో జింఖానా గ్రౌండ్‌ వద్దకు వచ్చింది. తన పరిస్థితిని పోలీసులకు వివరించింది. 25నతన భర్త సెలవుపై వస్తున్నాడని, క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టపడే ఆయన కోసం టికెట్‌ కోసం వచ్చినట్టు చెప్పింది. దీంతో చిన్నారితో ఉన్న ఆమెను పోలీసులు లోనికి పంపించగా టికెట్‌ కొనుగోలు చేసింది. 

Updated Date - 2022-09-23T07:53:57+05:30 IST