ఆ నలుగురి ఖాతాలపైనే ఈడీ గురి

ABN , First Publish Date - 2022-09-23T08:40:34+05:30 IST

ఆ నలుగురి ఖాతాలపైనే ఈడీ గురి

ఆ నలుగురి ఖాతాలపైనే ఈడీ గురి

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నగదు బదిలీలపై ఆరా

ఆధారాల సేకరణ దాదాపు పూర్తి

ఇక నుంచి సాక్ష్యాల సేకరణపై దృష్టి


హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో చేతులు మారిన కోట్ల రూపాయలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆధారాలు సేకరిస్తోంది. సీబీఐ మోపిన అభియోగాల ఆధారంగా... ప్రధానంగా నలుగురి ఖాతాలు, సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఢిల్లీకి చెందిన సమీర్‌ మహేంద్రుతోపాటు వ్యాపారి అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, మధ్యవర్తులు అరుణ్‌ పాండ్య, విజయ్‌ నాయర్‌ల బ్యాంకు ఖాతాలు, వారికి సంబంధించిన సంస్థల లావాదేవీలపైన ఈడీ ప్రత్యేక బృందాలు ఆరా తీస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా రిజిస్టర్‌ అయిన ఇండో స్పిరిట్‌ కంపెనీకి సమీర్‌ మహేంద్రు ఎండీగా వ్యవహరిస్తున్నారు. లిక్కర్‌ స్కాంలో హైదరాబాద్‌ కేంద్రంగా వ్యాపారి పిళ్లై కొన్ని కోట్ల రూపాయలను అరుణ్‌ పాండ్య, విజయ్‌ నాయర్‌ల మధ్యవర్తిత్వంతో ఢిల్లీకి చేర్చినట్లు సీబీఐ ఆరోపించింది. ఆ మొత్తం ఎక్కడి నుంచి సమకూర్చారు, ఆ సమయంలో ఏ బ్యాంకు ఖాతా, లాకర్‌ నుంచి డబ్బులు సర్దుబాటు చేశారనే లెక్కలు తేల్చే పనిలో ఈడీ ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. ప్రధానంగా డొల్ల కంపెనీల ద్వారానే ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు నగదు సర్దుబాటు చేసినట్లు ఈడీ ప్రాథమిక విచారణలోనే గుర్తించింది. అయితే అందుకు అవసరమైన మరిన్ని ఆధారాల్ని అధికారులు సేకరిస్తున్నారు. ఈ నలుగురితోపాటు మరికొంత మంది నగదు లావాదేవీలపైనా ఈడీ ఆధారాలు సేకరిస్తోంది. ప్రధానంగా అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై సంస్థల్లో భాగస్వాములైన ప్రేమ్‌సాగర్‌, అభిషేక్‌రావు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ బృందాలు ఇప్పుడు లెక్కలు తేల్చే పనిలో ఉన్నాయి. ఢిల్లీకి నగదు సర్దుబాటు చేయడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్‌కు చెందిన రియల్టర్‌ వెన్నమనేని శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాల వివరాల్ని కూడా ఈడీ బృందాలు పరిశీలిస్తున్నాయి. వీరితోపాటు హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీ యజమాని బ్యాంకు ఖాతాల్ని ఈడీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నగదు బదలాయింపులకు సంబంధించి ఏ చిన్న లొసుగు దొరికినా లిక్కర్‌ కేసు దర్యాప్తులో తదుపరి అడుగు వేసేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. గడచిన 15 రోజులుగా హైదరాబాద్‌లో నిర్వహించిన తనిఖీల్లో లభించిన సాఫ్ట్‌ కాపీలు, డిజిటల్‌ ఆధారాల్ని ఈడీ ప్రత్యేక బృందాలు విశ్లేషిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఆధారాల విశ్లేషణ పూర్తయితే... నగదు బదలాయింపులో ఏవైనా లొసుగులు ఉన్నాయా అనేది తేలనుంది. కాగా... లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకే హైదరాబాద్‌లో తదుపరి చర్యలు ఉండబోతున్నట్లు తెలిసింది. ఈ కేసులో కొందరికి నోటీసులు జారీచేసిన ఈడీ... ఢిల్లీలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాల్లో ఇప్పటికే చాలావరకు వెనుదిరిగి వెళ్లాయి.


సాక్ష్యాల సేకరణపై దృష్టి

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో తనిఖీలు, ఆధారాల సేకరణ, ప్రాథమిక విచారణ దాదాపుగా పూర్తి కావడంతో... పిళ్లై, శ్రీనివాసరావుతోపాటు మరికొందర్ని ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిచి విచారించారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా కేసు తదుపరి దర్యాప్తునకు, న్యాయస్థానంలో నేరం రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాల సేకరణపై ఈడీ ప్రత్యేక బృందాలు దృష్టి సారించాయి. కాల్‌ డేటా, సీసీ ఫుటేజీల సేకరణతోపాటు కొందరు ప్రత్యక్ష సాక్షుల్ని ఈడీ విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనుంది.

Updated Date - 2022-09-23T08:40:34+05:30 IST