మూసీ ప్రక్షాళనకు ఏం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2020-09-28T10:30:50+05:30 IST

మూసీ ప్రక్షాళనకు ఏం చేస్తున్నారు?

మూసీ ప్రక్షాళనకు ఏం చేస్తున్నారు?

అంచనా వ్యయం 20 రెట్లు ఎక్కువ.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఎన్జీటీ ఆగ్రహం
 రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘మూసీ నది ప్రక్షాళనకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది. మూసీ నది కాలుష్య కాసారంగా మారుతుంటే.. అసలేం చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలి సంతృప్తికరంగా లేదు’’ అని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మూసీ నది ప్రక్షాళనపై మహ్మద్‌ నహీం పాషా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ... కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మూసీ నది ప్రక్షాళన ప్రక్రియను పర్యవేక్షించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ విలాస్‌ అఫ్జల్‌ పుర్కర్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని నియమించింది. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ల ప్రతినిధులతోపాటు హైదరాబాద్‌ కలెక్టర్‌ ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. తీర్పు వెలువడన నెల రోజుల్లోపు కమిటీ సమావేశం కావాలని, నాలుగు నెలల్లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఏడాదిలోగా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేయాలని నిర్దేశించింది. రాష్ట్రం నిధులు కేటాయించకపోతే.. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ద్వారా సంస్థల సహకారం కోరాలని పేర్కొంది. గంగ, సట్లేజ్‌ నదుల ప్రక్షాళన మాదిరిగానే మూసీ నదికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. మూసీ నది ప్రక్షాళన కేసు విచారణ సందర్భంగా ఎన్జీటీ వ్యాఖ్యానించింది. ‘‘ఫైటోరెమిడియేషన్‌కు రూ.528 కోట్లు ఖర్చవుతాయని మాకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పొందుపరిచింది. ఒక్కో ఎంఎల్‌డీకి రూ.45 లక్షలు ఖర్చు చేస్తామని పేర్కొంది. కానీ, ఇది 20 రెట్లు అధికమని ఎన్‌ఎంసీజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మాకు చెప్పారు’’అని ఎన్జీటీ పేర్కొంది.  

Updated Date - 2020-09-28T10:30:50+05:30 IST