‘ధరణి’తో తిప్పలు!

ABN , First Publish Date - 2020-09-28T10:29:44+05:30 IST

‘ధరణి’తో తిప్పలు!

‘ధరణి’తో తిప్పలు!

ప్రతీ గ్రామంలో 10 ు రికార్డుల తేడాలు

మల్లగుల్లాలుపడుతున్న అధికారులు


హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మాకంగా భావిస్తున్న ధరణి(భూరికార్డుల సమగ్ర యాజమాన్య విధానం) వెబ్‌సైట్‌ సాంకేతిక నిపుణులకు చుక్కలు చూపిస్తోంది. రిజిస్ట్రేషన్ల వెబ్‌సైట్‌ (కార్డు)ను అనుసంధానం చేసే ప్రక్రియకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఇంకంబరెన్స్‌ సర్టిఫికెట్‌(క్రయ విక్రయాల సమాచార ధ్రువీకరణ) జారీకి ధరణి వెబ్‌సైట్‌ సహకరించడం లేదని తేలింది. ఈనెల 7వ తేదీ నుంచి రాష్ట్రంలో కార్డు(రిజిస్ట్రేషన్ల వెబ్‌సైట్‌)లో కార్యకలాపాలను ప్రభు త్వం నిలిపివేసింది. 19వ తేదీన ఽతెలంగాణభూమి హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం-2020 అమల్లోకి తెచ్యారు. ఈలోగా ధరణిని కార్డును అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని భావించారు. అయితే, ధరణివెబ్‌సైట్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా లేదని గుర్తించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ధరణిని వ్యవసాయేతర భూములు, వ్యవసాయ భూములు అని రెండు భాగాలుగా చేస్తున్నామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. దీనికి అనుగుణంగా ధరణికి తుదిరూపు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అయితే ఇలా చేయడంలో తమకు ఎదురైన సాంకేతిక సమస్యల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ’తొందరేం లేదు. సమయం తీసుకొని లోపాల్లేకుండా పక్కాగా రూపొందించాలి’ అని ఆయన సూచనలు చేశారు. 


ప్రయోగాలను విశ్లేషించకుండానే...

ప్రస్తుతం ధరణి వెబ్‌సైట్‌ ఆధారంగా వికారాబాద్‌ జిల్లాలోని రెండు మండలాల్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్‌ జరుగుతోంది. రెండేళ్లకిందటే దీన్ని ప్రారంభించినా దీని ఫలితాలను యంత్రాంగం విశ్లేషించలేదని తెలుస్తోంది. 2018లోనే వెబ్‌ల్యాండ్‌లో, మాభూమి వెబ్‌సైట్‌లో ఉన్న భూముల రికార్డులన్నీ ధరణిలోకి మార్చే సమయంలో సమస్యలు ఎదురయ్యాయి. ధరణి యూజర్‌ ఫ్రెండ్లీగా లేదని ఫిర్యాదులు వ చ్చాయి. అయినా ధరణివైపే మొగ్గు చూపారు. కార్డు(రిజిస్ట్రేషన్లశాఖ వెబ్‌సైట్‌)ను ధరణితో అనుసంధానం చేయడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా ఈసీ(ఇంకంబరెన్స్‌ సర్టిఫికెట్‌)లో పరిశీలన వంటి వాటితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధరణి వెబ్‌సైట్‌లో అఆఇఈలు సర్వే నంబర్ల పక్కన ఉండగా... కార్డులో మాత్ర ం ఏ, బీ వంటి ఆంగ్ల అక్షరాలున్నాయి. దీన్ని సరిచేసే పనిలో యంత్రాంగం తలమునకలయింది. 


వారంలో కుదుటపడేనా...

ధరణిలో సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేశారు. వారం రోజుల్లో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కమిటీ చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితి కనిపించడంలేదని తెలుస్తోంది. ధరణిలో సాంకేతిక సమస్యలు తీరాకే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల యంత్రాంగం రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై ఐదురోజుల పాటు శిక్షణ ఇచ్చే అవకాశాలున్నాయి. వారం రోజుల్లో అంటే అక్టోబరు తొలివారంలోపు ధరణిలో సమస్యలు తీరితే... ఆ తర్వాత ఐదురోజుల పాటు శిక్షణ ఉండనుంది. అయితే ఈలోగా శిక్షణ ఇస్తారా...? ధరణిలో సమస్యలు తీరాకా ఇస్తారా అనేది తేలడం లేదు. 


తప్పులతోనే ముందుకు..

రికార్డుల నవీకరణ అనంతరం అధికారిక రికార్డుల ప్రకారం 8 లక్షల దాకా తప్పులు జరిగాయి. తహసీల్దార్ల లెక్కల ప్రకారం ప్రతీ మండలంలో సగటున 3 వేల తప్పులు జరిగాయని అంచనా. అయితే ఈ తప్పులన్నీ సరిచేసే ప్రక్రియను మధ్యలోనే వదిలేశారు. దాంతో అవి అలానే కొనసాగుతున్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామంలో 10 శాతానికి పైగా రికార్డులకు, విస్తీర్ణం మధ్య తేడాలున్నాయి. సర్వేనంబర్‌కు, రికార్డులకు మధ్య తేడాలుంటే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగే అవకాశాల్లేవు. దీనికి సాఫ్ట్‌వేర్‌ కూడా సహకరించదు. దీనికోసం కనీసం ఆర్నెల్లు ప్రత్యేకంగా డ్రైవ్‌ నిర్వహించి, విస్తీర్ణం, రికార్డులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరిచేస్తే సమస్యలు తీరుతాయని పలువురు సూచిస్తున్నారు. ధరణి యూజర్‌ ఫ్రెండ్లీ సాఫ్ట్‌వేర్‌ కాదని, ఽఇందులోని లోపాలే రికార్డుల నవీకరణకు శాపాలుగా మారాయని గతంలోనే విమర్శలు వచ్చాయి. ధరణి వెబ్‌సైట్‌లో ఉన్న ప్రతిబంధకాలను రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ ప్రత్యక్షంగా పరిశీలించారు. తాజాగా రికార్డు ఆఫ్‌ రైట్‌గా ధరణికి చట్టబద్ధత కల్పించడంతో దీన్ని సరిచే సుకొని ముందుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని తెలుస్తోంది. 

Updated Date - 2020-09-28T10:29:44+05:30 IST