బస్తీల్లో సుస్తీకి ఇక స్వస్తి!

ABN , First Publish Date - 2020-09-28T10:23:38+05:30 IST

బస్తీల్లో సుస్తీకి ఇక స్వస్తి!

బస్తీల్లో సుస్తీకి ఇక స్వస్తి!

ఆల్‌రౌండర్లుగా బస్తీ దవాఖానాలు.. రోజూ రెండుపూటలా వైద్యసేవలు.. వారంలో మూడు రోజులు ప్రత్యేకం

వృద్ధులకు ప్రతి వారం కౌన్సెలింగ్‌.. మహిళలకు గైనిక్‌ సేవలు

పిల్లలకు ఇమ్యూనైజేషన్‌.. మొండి వ్యాధులకూ వైద్య చికిత్సలు


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బస్తీ దవాఖానా.. మహా అయితే డాక్టర్‌, ఆయన లేకుంటే కాంపౌండర్‌ పరీక్షిస్తాడు.. రెండు తెల్లగోలీలు, మూడు పచ్చగోలీలు.. ఇలా కొన్ని మందుగోలీలు ఇచ్చి పంపుతారు. పుండ్లు, గాయాలు ఉంటే.. మలాం రాస్తారు. అందుకే ‘నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అంటూ ఒకప్పుడు సినీకవులు పాటలు కట్టారు. ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 132 రెండు రకాల పరీక్షలు బస్తీ దవాఖానాల్లో అందుబాటులో ఉన్నాయి. 145 రకాల మందులు లభిస్తున్నాయి. సాదాసీదా, సీజనల్‌ వ్యాధులతో పాటు.. ప్రాణాంతక వ్యాధులకు కూడా ఇప్పుడు బస్తీ దవాఖానాల్లో చికిత్స అందుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానాల పనితీరుపై శనివారం వైద్య ఆరోగ్యశాఖ.. మీడియా పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సందర్బంగా అక్బర్‌పుర, గడ్డిఅన్నారంలోని బస్తీ దవాఖానాలలో అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులు వివరించారు.


చికిత్సల వారీగా.. మూడు రోజులు ప్రత్యేకం

జీహెచ్‌ఎంసీ పరిదిలో 197 బస్తీ దవాఖానాలున్నాయి. వీటిల్లో ప్రతి సోమవారం, శనివారం గైనిక్‌ సమస్యలకు, గర్బిణులకు ప్రత్యేక వైద్యం అందజేస్తారు. ప్రతి గురువారం వృద్ధులకు ఆరోగ్య సమస్యలపై కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ప్రతినెల రెండో శనివారం పిల్లలకు ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సాధారణ వైద్య చికిత్సలు అందజేస్తున్నారు. పెద్దల విషయంలో.. ఆరోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అక్బరాపుర బస్తీ దవాఖానాను మీడియా సందర్శించిన సమయంలో.. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న 243 మంది అక్కడ చికిత్సలు పొందుతున్నట్లు డాక్టర్‌ తస్లీమా వివరించారు. రక్తపోటు, మధుమేహం, శ్వాస సమస్యలు, దంత సంబంధిత రుగ్మతలు.. ఇలా పలు జబ్బులతో వారు బాధపడుతున్నారని చెప్పారు. వారి మొబైల్‌ నంబరుకు ప్రతివారం ఆరోగ్య పురోగతిని ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపుతామని వివరించారు. ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్లు గుర్తిస్తే.. అలాంటి రోగులను పెద్దాస్పత్రులకు పంపుతామని చెప్పారు.


టెలి మెడిసిన్‌ సేవలు కూడా

బస్తీ దవాఖానాల్లో టెలి మెడిసిన్‌ సేవలు కూడా అందిస్తున్నారు. రోగులు పెద్దాస్పత్రుల వరకు వెళ్లకుండానే.. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, ప్రసూతి ఆస్పత్రులు, ఈఎన్‌టీ, ఎంఎన్‌జే, చెస్ట్‌ ఆస్పత్రులకు చెందిన వైద్యనిపుణులతో ఫోన్‌లో మాట్లాడే సదుపాయం కల్పిస్తున్నారు. 197 బస్తీ దవాఖానాల్లో.. 30 ఆస్పత్రుల్లో టెలి మెడిసిన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేన్సర్‌, మూత్రపిండాల వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, గైనిక్‌, మానసిక సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఈ విధానం ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అందుకోసం స్పెషలిస్టు వైద్యుల అపాయింట్‌మెంట్లకు అనుగుణంగా.. రోగులను పిలిపిస్తామని చెప్పారు. రోగుల వివరాలను ఆన్‌లైన్‌ చేయడం వల్ల.. వారు ప్రిస్ర్కిప్షన్‌, ఎక్స్‌రే, స్కానింగ్‌, ఇతర టెస్టుల వివరాలు తీసుకురాకున్నా.. వైద్యులు ఆ వివరాలను యాక్సెస్‌ చేసే వెసులుబాటు ఉంది.


132 రకాల పరీక్షలు

ఆక్సిజన్‌ స్థాయి పరిశీలించడం, బీపీ, రక్త, మూత్ర, మధుమేహ పరీక్షలను కూడా బస్తీ దవాఖానాల్లో చేస్తున్నారు. 132 రకాల క్లినికల్‌ పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ పరీక్షలను నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. అవసరమైతే నమూనాలను తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాలకు పంపుతామని వివరించారు. బస్తీ దవాఖానాల్లో 145 రకాల మందులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎవరికైనా కరోనా అనుమానం ఉంటే.. వారిని యూపీహెచ్‌సీలకు పంపుతున్నట్లు 

వెల్లడించారు.

Updated Date - 2020-09-28T10:23:38+05:30 IST