మరో 1896 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-08-12T09:17:15+05:30 IST

మరో 1896 మందికి కరోనా

మరో 1896 మందికి కరోనా

జిల్లాల్లోనే ఎక్కువ కేసులు

జీహెచ్‌ఎంసీ పరిధిలో 338

మరో 8 మంది మృత్యువాత


హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌/జగిత్యాల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదే స్థాయిలో కొనసాగుతోంది.   టెస్టులు జరుపుతున్న కొద్దీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. మంగళవారం కొత్తగా 1896 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,647కు చేరింది. మరో 8 మంది మృత్యువాత పడగా, మరణాలు 645కు చేరాయి. ఇక వ్యాధి నుంచి కోలుకుని 1788 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య  59,374కు చేరింది. ప్రస్తుతం 22,628 యాక్టివ్‌ కేసులుండగా, 15,554 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. అయితే తాజా పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 338 నమోదు కాగా, జిల్లాల్లోనే ఎక్కువ సంఖ్యలో కేసులు వచ్చినట్లు తెలిపింది. వీటిలో మేడ్చల్‌ జిల్లాలో 119, రంగారెడ్డిలో 147, కరీంనగర్‌లో 121, వరంగల్‌ అర్బన్‌లో 95, గద్వాలలో 85, కామారెడ్డిలో 71, ఖమ్మంలో 65, పెద్దపలిల్లో 66 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2629 మంది రోగులుండగా, 5807 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయని, ప్రైవేటులో 3336 రోగులుండగా, 2149 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయని బులెటిన్‌లో వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా, కరోనా మహమ్మారికి మరో పోలీసు కానిస్టేబుల్‌ బలయ్యాడు. జోగాళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 


ఆస్పత్రి మెట్లపైనుంచి పడి వృద్ధుడి మృతి

జగిత్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డు మెట్లపై నుంచిపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన వృద్ధుడు(70) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఆస్పత్రికి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో అతణ్ని ఐసోలేషన్‌ వార్డుకు తరలించగా.. కొద్దిసేపటికే మెట్లపై నుంచిజారి పడి మరణించాడు.  అయితే అతడు ఐసోలేషన్‌ వార్డు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి కింద పడ్డాడని కొందరు అనుమానం వ్యక్తం చేయగా, మృతుని కుటుంబ సభ్యులు మాత్రం షుగర్‌ వ్యాధి తీవ్రమై తల తిరిగి జారి పడ్డట్లు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-08-12T09:17:15+05:30 IST