స్కూళ్లకు వెళ్లివచ్చేదెలా!

ABN , First Publish Date - 2020-08-12T08:57:37+05:30 IST

స్కూళ్లకు వెళ్లివచ్చేదెలా!

స్కూళ్లకు వెళ్లివచ్చేదెలా!

ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కలవరం... 90ు టీచర్లవి నిత్య ప్రయాణాలే

హైదరాబాద్‌, జిల్లా కేంద్రాల్లో నివాసాలు 

గతంలో అందుబాటులో రైళ్లు, బస్సులు 

ఇప్పుడు రవాణా అంతంతమాత్రమే  

నిత్యం రాకపోకలు ఇక కత్తిమీద సామే 

నేడు మార్గదర్శకాలు ప్రకటించే అవకాశం


హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మణికొండలో ఉండే సంధ్యారాణి వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలు. ప్రతిరోజూ విధులకు హాజరయ్యేందుకు ఈమె మణికొండ నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు, అక్కడినుంచి రైలులో కాజీపేటకు, అక్కడినుంచి ఆటోలో హన్మకొండలోని బడికి వెళ్తుంటారు. గత మూడేళ్లుగా ఈమె ప్రతిరోజూ 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తూ.. పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. అంతదూరం కాకపోయినా.. సంధ్యారాణి లాగే హైదరాబాద్‌లో నివాసముంటూ వివిధ జిల్లాలకు నిత్యం వెళ్లి వచ్చే టీచర్ల సంఖ్య వేలల్లో ఉంటుంది. జిల్లా కేంద్రాల్లో ఉంటూ 75-100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా అధికమే కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లుగా బడులు మూతబడ్డాయి. తాజాగా పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడం, 17వ తేదీ నుంచి ఉపాధ్యాయులంతా స్కూళ్లకు హాజరు కావాలని ఆదేశించడంతో దూర ప్రయాణాలు చేసే టీచర్లలో కలవరం మొదలైంది. 


రవాణా సౌకర్యం అంతంతే.. 

రైలు, బస్సు సౌకర్యం అందుబాటులో ఉండటంతో ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు నిత్యం రాకపోకలు సాగించేవారు. కానీ, కరోనా నేపథ్యంలో పరిస్థితి మారింది. కొన్ని ప్రత్యేక రైళ్లు మినహా.. అన్ని రైళ్లూ రద్దయ్యాయి. నడుస్తున్న వాటిలోనూ ముందస్తు రిజర్వేషన్‌ ఉంటేనే అనుమతిస్తున్నారు. బస్సులు రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నా.. జనం రద్దీ లేకపోవడంతో నష్టాలు పెరుగుతున్నాయని అనేక బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. హైదరాబాద్‌ నగరంలోనూ 3వేల సిటీ బస్సుల సేవలు ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ పరిస్థితుల్లో  ఉపాధ్యాయులు గతంలో వెళ్లినట్టు నిత్యం రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. అందుబాటులో ఉన్న బస్సుల్లో ప్రయాణించినా.. కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్నందున ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉంటాయని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. తమతోపాటు తమ కుటుంబసభ్యులకూ ప్రమాదమేనని అంటున్నారు. 


అందరి దృష్టి ప్రభుత్వ మార్గదర్శకాలపైనే.. 

ఈ నెల 17 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరు కావాలని, ప్రతి బడిలో రోజూ కనీసం 50 శాతం టీచర్లు ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో వారందరి దృష్టీ ఇప్పుడు మార్గదర్శకాలపై పడింది. బడులకు రోజువిడిచి రోజు వెళ్లాల్సి ఉంటుందా? సగంమంది వారంలో మూడు రోజులు, మరో సగం మంది మరో మూడు రోజులు వెళ్లాల్సి ఉంటుందా? వారం విడిచి వారం అవకాశమిస్తారా.. అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.  స్కూళ్లకు గతంలోలా ఎలాగోలా వెళ్లడమా, లేక ఉపాధ్యాయులంతా కలిసి స్థానికంగానే ఉండేలా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసుకోవడమా అన్నది ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేయనుంది. అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని టీచర్లు భావిస్తున్నారు. మార్గదర్శకాలను నేడు ప్రకటించే అవకాశాలున్నాయి. 


పునఃప్రారంభంపై సంఘాల హర్షం 

పాఠశాలల పునఃప్రారంభం, దూరదర్శన్‌ ద్వారా పాఠాలపైౖ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. బడులు తెరవాలని, కనీసం ఉపాధ్యాయులనైనా అనుమతించాలని తాము ఎప్పటినుంచో కోరుతున్నామని, ఎట్టకేలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి, చావ రవి అన్నారు. ముందుగా ఉపాధ్యాయులు వెళ్తే కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సౌకర్యాలు, క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుస్తాయని, తర్వాత విద్యార్థులు వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా, స్కూళ్లకు వెళ్లేందుకు ఉపాధ్యాయులంతా సిద్ధంగానే ఉన్నారని ఎస్టీయూ అధ్యక్షుడు సదానందం గౌడ్‌ అన్నారు. అయితే రాష్ట్రంలో ఏడు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలున్నా.. ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులతో పాటు 3, 4, 5 తరగతుల ప్రాథమిక విద్యార్థులకూ దూరదర్శన్‌ పాఠాలు నిర్వహించాలని నిర్ణయించడం సరైనదని ఎస్టీటీ ఫోరం అధ్యక్షుడు ఎండీ ఖమరొద్దీన్‌ అన్నారు.  


హైదరాబాద్‌ నుంచి 12వేల మంది

రాష్ట్రంలో 1.3 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 90 శాతానికి పైగా నిత్యం బడులకు వెళ్లేందుకు 50-150 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నవారే. హైదరాబాద్‌ నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్లే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ. వరంగల్‌, జనగాం, యాదాద్రి, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు నిత్యం రైలు, బస్సుల్లో వెళ్లి వస్తుంటారు.  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఉదయం వివిధ మార్గాల్లో వెళ్లే రైళ్లన్నీ, సాయంత్రం ఇక్కడికి వచ్చే రైళ్లన్నీ ఉపాధ్యాయులతోనే కిటకిటలాడుతుంటాయి. ఇలా హైదరాబాద్‌ నుంచి ప్రతిరోజూ దాదాపు 12 వేల మంది ఉపాధ్యాయులు ప్రయాణాలు చేస్తుంటారు.  

Updated Date - 2020-08-12T08:57:37+05:30 IST