చేప పిల్లల పంపిణీ నిలిపివేత!

ABN , First Publish Date - 2020-08-12T09:00:16+05:30 IST

చేప పిల్లల పంపిణీ నిలిపివేత!

చేప పిల్లల పంపిణీ నిలిపివేత!

జిల్లాల్లో ఆగిన సరఫరా.. హైకోర్టు ఆదేశాలతో కాంట్రాక్టర్లతో ఒప్పందాలకు బ్రేక్‌

24 జిల్లాల్లో సాఫీగానే  పంపిణీ

‘చేప పిల్లల టెండర్లలో గోల్‌మాల్‌’ పేరిట 1న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం


హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసి ఆర్థికంగా అండగా నిలవాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పటికీ.. చేప పిల్లల పంపిణీకి టెండర్లు, సరఫరాలో జరుగుతున్న అక్రమాలు ఈ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయి. టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరగటం, ఏపీ- తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నేతలు కూటమికట్టి చెరువులు పంచుకోవటంతో.. వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లింది. కోర్టు జోక్యంతో వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో టెండర్ల ప్రక్రియను మత్స్యశాఖ నిలిపివేసింది. ఈ 8 జిల్లాలను మినహాయించి, మిగిలిన 24 జిల్లాల్లో చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల నీటి వనరుల్లో 81 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్యలు పోసేలా  మత్స్యశాఖ ప్రణాళిక తయారు చేసింది. రూ. 60 కోట్లు వెచ్చించి.. మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా, చేపపిల్లలు సరఫరా చేసేందుకుగాను జిల్లాల వారీగా ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో టెండర్లు పిలిచారు. తెలంగాణ, ఏపీకి చెందిన అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు రింగ్‌ అయ్యారు. 86 కోట్ల చేప పిల్లల్లో 45ు ఏపీ కాంట్రాక్టర్లు, 55ు తెలంగాణ కాంట్రాక్టర్లు సరఫరా చేయాలని అనధికారికంగా ఒప్పందం చేసుకున్నారు. జిల్లాస్థాయి కొనుగోలు కమిటీకి అదనపు కలెక్టర్‌ చైర్మన్‌గా, మత్స్యశాఖ అధికారి కన్వీనర్‌గా, జిల్లా పశుసంవర్థక అధికారి, ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో అనుభవమున్న ఒక జిల్లాస్థాయి అధికారిని సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో పనిచేస్తుంది. జిల్లా కొనుగోలు కమిటీలను డమ్మీ చేసి.. ఏ జిల్లాలో ఏ కాంట్రాక్టర్‌కు చెందిన బిడ్‌ తెరవాలో ముందస్తుగా నిర్ణయించడంతో.. అక్రమాలకు తెరలేసింది. ఇది వివాదాస్పదం కావటంతో పైన పేర్కొన్న 8 జిల్లాలకు చెందిన స్థానిక కాంట్రాక్టర్లు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్పందించి టెండర్లను పునఃపరిశీలించాలని ఆదేశించింది. ఇదేక్రమంలో ‘చేప పిల్లల టెండర్లలో గోల్‌మాల్‌’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ఈనెల ఒకటో తేదీన కథనాన్ని ప్రచురించింది.  రాష్ట్ర మత్స్యశాఖ అప్రమత్తమై.. 8 జిల్లాల్లో టెండర్ల ప్రక్రియ నిలిపివేసింది. మిగిలిన 24 జిల్లాల్లో టెండర్లను ఖరారు చేసి, ఆరో తేదీ నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టారు.


ఉత్పత్తి తక్కువ.. లీజులే ఎక్కువ

తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లు 46 కోట్ల చేప పిల్లలు సరఫరా చేస్తామని చెబుతున్నా.. వాస్తవానికి అంత ఉత్పత్తి ఇక్కడలేదు. కేవలం 25 కోట్ల చేప పిల్లల ఉత్పత్తే ఈ రాష్ట్రంలో ఉంది. అయితే ఇక్కడ టెండర్లు దక్కించుకున్న స్థానిక కాంట్రాక్టర్లు, ఏపీలో తమకు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నట్లు లీజు డాక్యుమెంట్లు తీసుకొని సమర్పించారు. ఏపీలో ఏదో ఒక ఉత్పత్తి కేంద్రం నుంచి చేప పిల్లలు కొనుక్కొచ్చి, టెండరు ధరకు చెరువులకు సరఫరాచేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  మరో 40 కోట్ల చేపపిల్లల సరఫరాకు చెందిన కాంట్రాక్టులను నేరుగా ఏపీకి చెందిన కాంట్రాక్టర్లకు అప్పగించారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే చేపపిల్లలు 25 కోట్లు, అక్రమ లీజుల ద్వారా 21 కోట్లు, ఏపీకి చెందిన కాంట్రాక్టర్ల ద్వారా 40 కోట్ల చేప పిల్లలు కలిపి 86 కోట్లు ప్రొక్యూర్‌మెంట్‌ చేసేలా నిర్ణయించారు. 8 జిల్లాల్లో టెండర్లకు బ్రేక్‌ పడగా, ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. మిగిలిన 24 జిల్లాల్లో ఏపీ, తెలంగాణ కాంట్రాక్టర్లు 45:55 నిష్పత్తిలో చేప పిల్లలు సరఫరా చేస్తున్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చెరువుల్లో నిర్ణీత సైజు చేప పిల్లలు పోసి, 95ు చెరువులకు తక్కువ సైజు, నాణ్యతలేని చేప పిల్లలు సరఫరా చేస్తున్నట్లు మత్స్యకారులు ఫిర్యాదులు చేస్తున్నారు.

Updated Date - 2020-08-12T09:00:16+05:30 IST