లెక్క తక్కువే!

ABN , First Publish Date - 2020-08-12T09:11:13+05:30 IST

లెక్క తక్కువే!

లెక్క తక్కువే!

తెలంగాణలో చేసినవి 6.42 లక్షల పరీక్షలే.. టెస్టుల సంఖ్య పెంచాలని ప్రధాని సూచన

రోజుకు 40వేల టెస్టులకు కేబినెట్‌ తీర్మానం

అయినా 18-21 వేల మధ్యనే పరీక్షలు

ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 12.85 

10 లక్షల పరీక్షలు చేసిన రాష్ట్రాలు పన్నెండే

భారత్‌లో మిలియన్‌ జనాభాకు 18 వేల 

టెస్టులే.. అంతర్జాతీయ సగటు 62 వేలు


హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కొన్ని రాష్ట్రాల్లో కరోనా టెస్టుల సంఖ్య తక్కువగా.. పాజిటివ్‌ రేటు చాలా ఎక్కువగా ఉంటోందని, అందులో తెలంగాణలో కూడా ఉందని ప్రధాని మోదీ సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫెరెన్స్‌లో అన్నారు! కరోనా తీవ్రత అధికంగా ఉన్న పది రాష్ట్రాల్లో వైర్‌సను కట్టడి చేయగలిగితే వైర్‌సపై విజయం సాధించినట్లేనన్నారు. ముఖ్యంగా తెలంగాణ, బిహార్‌, గుజరాత్‌, యూపీ, పశ్చిమ బెంగాల్‌లలో కొవిడ్‌ టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని, పాజిటివ్‌ రేటు ఎక్కువగా ఉన్నట్లు ప్రధాని అభిప్రాయపడ్డారు. ఆ రాష్ట్రాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్యను మరింత పెంచాలని ఆయన సూచించారు. ప్రధాని వ్యాఖ్యలతో తెలంగాణలో పరీక్షల సంఖ్యపై మరోమారు చర్చ మొదలైంది. నిజంగానే.. దేశంలో చాలా రాష్ట్రాల్లో భారీగా టెస్టులు చేస్తుండగా తెలంగాణలో మాత్రం ఇప్పటి దాకా చేసిన పరీక్షలు చాలా తక్కువ. ప్రస్తుతం రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నా.. తొలి కేసు నమోదైనప్పటి నుంచి ఆగస్టు 10 వరకు చేసిన మొత్తం టెస్టుల సంఖ్య కేవలం 6,42,875. మనకంటే తమిళనాడు ఐదురెట్లు ఎక్కువగా పరీక్షలు చేసింది. వివిధ రాష్ట్రాలు ఇప్పటిదాకా చేసిన పరీక్షల సంఖ్య ప్రకారం చూస్తే.. అగ్రశ్రేణి ఐదు రాష్ట్రాల జాబితాలో వరుసగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌ నిలిచాయి. ఇప్పటివరకు మొత్తం 12 రాష్ట్రాలు పది లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేయగా, మనదగ్గర మాత్రం ఇంకా ఆరున్నర లక్షల లోపే ఉండడం గమనార్హం.


మొదట్లో ఎక్కువగా.. తర్వాత తగ్గి..

మార్చి 2న తొలి కేసు నమోదైన తర్వాత రాష్ట్రంలో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ (పాజిటివ్‌లను కలిసినవారిని గుర్తించే ప్రక్రియ) విస్తృతంగా చేపట్టి పరీక్షలు కూడా బాగా చేశారు. ఏప్రిల్‌  19 నాటికి రాష్ట్రంలో 14,962 పరీక్షలు చేశారు. పాజిటివ్‌ రేటు 5.73 శాతంగా నమోదైంది. కానీ, ఏప్రిల్‌ 20 తర్వాత కేవలం పాజిటివ్‌ వచ్చినవారి ప్రైమరీ కాంటాక్టులకే టెస్టులు చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. మే నెలలో పాజిటివ్‌ రేటు 14.31గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 12.85గా ఉంది. రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంచాలని హైకోర్టు గట్టిగా ఆదేశించడంతో ప్రభుత్వం మెల్లమెల్లగా టెస్టుల సంఖ్యను పెంచుతోంది. కోర్టు ఆదేశాల తర్వాత ఇటీవలికాలంలో రోజుకు సగటున 18-21 వేల మధ్య పరీక్షలు చేస్తున్నారు. ఆగస్టు 5న జరిగిన తెలంగాణ మంత్రి మండలి సమావేశంలో రాష్ట్రంలో  రోజూ 40 వేల పరీక్షలు చేయాలని తీర్మానించారు. అయినా ఇప్పటికీ రోజుకు 18-21 వేలకు మించి పరీక్షలు చేయట్లేదు.


ఇతరదేశాలతో పోలిస్తే ఇండియాలోనూ..

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్యను ఐసీఎంఆర్‌ విస్తృతంగా పెంచింది. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాల సంఖ్య 6.98 లక్షలు!! అయినా కూడా.. అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చిచూస్తే మనదేశంలో టెస్టింగ్‌ రేటు తక్కువేనని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గణాంకాల ప్రకారం చూస్తే.. యూకేలో ప్రతి 10 లక్షల మంది జనాభాకుగాను 2.7 లక్షల మందికి పరీక్షలు చేస్తుండగా మనదేశంలో మిలియన్‌ జనాభాకుగాను కేవలం 17,795 మందికి పరీక్ష చేస్తున్నారు. అమెరికా, రష్యాల్లో ప్రతి పదిలక్షల మందిలో సగటున 2 లక్షల మందికిపైగా ప్రజలకు పరీక్షలు చేస్తున్నారు. అంటే ఆ రెండు దేశాల్లో సగటున ప్రతి ఐదుగురిలో ఒకరికి పరీక్ష చేస్తున్నట్టు లెక్క! అదే మనదేశంలో సగటున ప్రతి 50 మందిలో ఒకరికి మాత్రమే పరీక్ష చేస్తున్నట్టు!! ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న టాప్‌-20 దేశాల్లో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మెక్సికో దేశాల్లో మాత్రమే అత్యల్పంగా పరీక్షలు చేస్తున్నారు. మొత్తం 20 దేశాల్లో చేస్తున్న పరీక్షల సగటును లెక్కిస్తే.. ప్రతి పదిలక్షల మందికిగాను 62 వేల మందికి పరీక్షలు చేస్తున్నారు. అంటే మనదేశం కన్నా మూడున్నర రెట్లు ఎక్కువ. ఇలా ఏ కోణంలో చూసుకున్నా మనదేశంలో పరీక్షల సంఖ్య తక్కువగానే ఉండడం గమనార్హం. ఇక, మనదేశంలో.. ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, అసోం, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, పంజాబ్‌లో జాతీయ సగటు కంటే ఎక్కువగా పరీక్షలు చేస్తుండగా.. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలు జాతీయ సగటుకన్నా తక్కువగా పరీక్షలు చేస్తున్నాయి.

Updated Date - 2020-08-12T09:11:13+05:30 IST