కరోనా పరిస్థితులపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక సూచనలు

ABN , First Publish Date - 2020-08-13T23:52:51+05:30 IST

తెలంగాణలో కరోనా పరిస్థితులపై కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో విచారణ ముగిసింది.

కరోనా పరిస్థితులపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక సూచనలు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పరిస్థితులపై కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ విచారణలో భాగంగా ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక సూచనలు చేసింది. ఈ ఆదేశాలను రెండు వారాల్లో అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలని సూచించింది. ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు తీసుకోవాలని కోర్టు సూచించింది. సీఎస్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు తీసుకోవాలని చెప్పింది.


కీలక సూచనలు ఇవే..

విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తే  లైసెన్స్‌ రద్దు చేయాలి. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ రేట్లను డీస్‌ప్లే బోర్డుల ద్వారా తెలపాలి. ప్రైవేట్ ఆస్పత్రులు ఎంత మందికి ఉచితంగా చికిత్స అందించాయో తెలపాలి. ఢిల్లీ తరహా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లను ఏర్పాటు చేయాలి. ఎన్జీవోలు, సివిల్ సొసైటీతో కలిసి ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకునేందుకు రసూల్‌పూరాలోని హాకీ మైదానాన్ని పరీశీలించాలి. తదుపరి విచారణకు వైద్యశాఖ అధికారులు హాజరుకావాలిఅని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 4కు కోర్టు వాయిదా వేసింది.


సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం.. ప్రశ్నల వర్షం..!

ఇవాళ ఉదయం తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై న్యాయస్థానంలో జరిగిన విచారణకు సీఎస్‌ సోమేష్‌కుమార్‌ హాజరయ్యారు. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏ ఒక్కటి అమలు కాలేదేం..? అని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహించింది. కరోనాపై ఎందుకు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం..? అని ప్రశ్నించింది. ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎస్‌ను ఉద్దేశించి న్యాయస్థానం ప్రశ్నించింది. ఇప్పటివరకు 50 మందికి నోటిసులు ఇచ్చామని సోమేష్‌కుమార్‌ తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల లైసెన్స్‌ రద్దు చేశామని చెప్పారు. దీంతో మిగిలిన ఆస్పత్రుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇలా ఇవాళ ఉదయం ప్రారంభమైన వాదనలు సాయంత్రం వరకూ కొనసాగాయి. అనంతరం ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది.

Updated Date - 2020-08-13T23:52:51+05:30 IST