ఫలించని నియంత్రిత సేద్యం

ABN , First Publish Date - 2020-11-20T06:54:55+05:30 IST

నియంత్రిత వ్యవసాయ విధానం శాస్త్రీయంగా అమలు జరగాలంటే తొలుత భూసార పరీక్షలు నిర్వహించాలి. భూసారానికి అనుగుణంగా పంటలను నిర్ణయించాలి. రాష్ట్ర అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ ఉపకరణాలు....

ఫలించని నియంత్రిత సేద్యం

నియంత్రిత వ్యవసాయ విధానం శాస్త్రీయంగా అమలు జరగాలంటే తొలుత భూసార పరీక్షలు నిర్వహించాలి. భూసారానికి అనుగుణంగా పంటలను నిర్ణయించాలి. రాష్ట్ర అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ ఉపకరణాలు -విత్తనాలు, రుణాలు, ఎరువులు, వ్యవసాయ సలహాలు, మార్కెట్‌ సౌకర్యం- సమకూర్చాలి. ప్రస్తుత అనుభవపూర్వక లోపాలను అధిగమించే విధంగా నియంత్రిత సేద్య వ్యవసాయ విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.


నియంత్రిత వ్యవసాయ విధానం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వం నిర్దేశించినట్లే రైతులు పత్తి, వరి, సోయా, కంది పంటలను 115 లక్షల ఎకరాలలో సాగు చేశారు. వానాకాలం పంటల మొత్తం విస్తీర్ణం 130 లక్షల ఎకరాలు కాగా 90 శాతం సాగు భూములలో ప్రభుత్వం చెప్పిన పంటలనే వేశారు. గత 100 సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా భారీ వర్షాలు కురవడంతో పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం 4.11 లక్షల ఎకరాలలో వరి, 6.75 లక్షల ఎకరాలలో పత్తి, సోయాతో సహా ఇతర పంటలు 1.47 లక్షల ఎకరాలలో పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 12.33 లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది. రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించి చివరి రైతు వరకు సహాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఇంతవరకు గణాంకాల వివరాలు సేకరించడానికి సిబ్బందినే నియమించలేదు. గత నెలలో కేంద్ర బృందం వచ్చి వెళ్ళడమే తప్ప నష్టాన్ని అంచనా వేయలేదు. రైతు సంఘాల ప్రతినిధులను కాదు గదా, చివరకు ముఖ్యమంత్రిని సైతం కలవకుండానే కేంద్రబృందం వెళ్ళిపోయింది. తక్షణ సహాయంగా రూ.6000 కోట్లు, నష్టం జరిగిన పంటలకు రూ.600 కోట్లు కేంద్రం సహాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. రైతులకు, పట్టణాలకు, ప్రభుత్వానికి దాదాపుగా రూ.12,500 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. 


ప్రకృతి చేసిన నష్టం ఒకవైపు కాగా, మరో వైపున నకిలీ విత్తనాల వల్ల పంటలకు నష్టం వాటిల్లింది. నిర్మల్‌, సారంగాపూర్‌, కల్లూరు మండలాలలో 200 ఎకరాలలో పత్తి పంట దెబ్బతిన్నది. రాష్ట్రంలో 22 వేల క్వింటాళ్ళ నిషేధిత గ్లేపోసేట్‌ పత్తి విత్తనాలు పట్టుబడి 220 కేసులు పెట్టారు. కానీ, అక్రమాలకు అసలు బాధ్యులపై మాత్రం కేసులు పెట్టనే లేదు! సంచులు మోసిన వారు, విత్తనాలు నిలువపెట్టుకోవడానికి ఇండ్లు అద్దెకు ఇచ్చిన వారు... ఇలాంటి వారిపై కేసులు పెట్టారు!! నియంత్రిత సాగు విధానం ప్రకటించిన ప్రభుత్వం నాణ్యత కలిగిన విత్తనాలు రైతులకు సక్రమంగా సరఫరా చేయడంలో విఫలమైంది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వల్ల బ్యాంకులు రైతులకు వానాకాలం పంట రుణాలు ఇవ్వలేదు. ఈ రుణాల కింద బ్యాంకులు రూ.32 వేల కోట్లు బ్యాంకులు కేటాయించాయి. ఈ కేటాయింపులు సంప్రదాయంగా వస్తున్నాయే తప్ప రుణాలు మాత్రం ఇవ్వడం లేదు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకానికి తన వంతు ప్రీమియం ఇవ్వకుండా మొత్తంగా బీమా పథకాన్నే ఎత్తివేసింది. కొన్ని చోట్ల బీమా ప్రీమియం తీసుకున్నప్పటికీ, సగటుపై 30 శాతం పంట పండితేనే బీమా వర్తిస్తుందని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో 12.33 లక్షల ఎకరాలలో పంట నష్టం వాటిల్లితే ఆ నష్టాన్ని రూ.2481 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. వాస్తవ నష్టంలో ఈ అంచనా 25 శాతం లోపే ఉంటుంది. ఆ విధంగా ప్రాథమిక వనరులు కల్పించకుండా (విత్తనాలు, రుణాలు) నియంత్రిత వ్యవసాయ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసింది. తీరా పంటలు పండిన తరువాత కొనుగోలులో కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరల కన్న తక్కువకు మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నారు.


రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన మద్దతు ధరల విధానం సవ్యంగా లేదు. ఇప్పుడేమో కేంద్రంం పడనివ్వడం లేదని సాకులు చెబుతోంది. దానాదీనా రైతులకు చెప్పుకోదగిన లబ్ధి సమకూరడం లేదు. గతంలో ఒకసారి ‘పత్తి విస్తీర్ణాన్ని తగ్గించండి. కందుల విస్తీర్ణం పెంచండి’ అని ముఖ్యమంత్రి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఆయన మాటలు నమ్మి కంది సాగు విస్తీర్ణాన్ని 7 నుంచి 12 లక్షల ఎకరాలకు పెంచారు. తీరా పంట వచ్చాక మద్దతు ధరకు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమయింది. రైతులు నష్టపోయారు. ఒక వైపున మొక్కజొన్నలు బిహర్‌ నుంచి దిగుమతి చేసుకుంటూ మరో వైపున రాష్ట్రంలో మొక్కజొన్నలు వేయవద్దని ముఖ్యమంత్రే స్వయంగా ప్రచారం చేస్తున్నారు. నియంత్రిత సేద్య విధానం అంటే ముఖ్యమంత్రి నిర్దేశించిన విధంగా చేయడమేనా? శాస్త్రీయంగా భూసార పరీక్షలు జరిపి భూమికి తగిన పంటలు ఏవో రైతులకు చెప్పడంతో పాటు అందుకు కావాల్సిన వ్యవసాయ ఉపకరణాలు (విత్తనాలు, రుణాలు, ఎరువులు, వ్యవసాయ సలహాలు, మార్కెట్‌ సౌకర్యం) సమకూర్చాలి. అయితే రాష్ట్ర వ్యవసాయశాఖ ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతోంది. ప్రస్తుత అనుభవపూర్వక లోపాలను అధిగమించే విధంగా నియంత్రిత వ్యవసాయ విధానంలో మార్పులు చేయాలి. 


భారత దేశానికి ధాన్యాగారంగా తెలంగాణను మార్చామని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ ధాన్యాగార రాష్ట్రంలో నేటికీ వ్యవసాయ దిగుమతులపై ఎందుకు అధారపడుతున్నాం? నియంత్రిత వ్యవసాయ విధానం శాస్త్రీయంగా అమలు జరగాలంటే ముందు భూసార పరీక్షలు నిర్వహించాలి. భూసారానికి అనుగుణంగా పంటలను నిర్ణయించాలి. రాష్ట్ర అవసరాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. పప్పులు, నూనెలు, ఉల్లి, కూరగాయలు, పూలు, అల్లం, కొత్తిమీర,, వెల్లుల్లి మొదలైన వాటి విషయంలో రాష్ట్ర ఉత్పత్తి సామర్థ్యానికి, రాష్ట్ర అవసరాలకు పొంతన ఉండడం లేదు. ఎంతో లోటు కన్పిస్తోంది. ఏ ఒక్క వ్యవసాయ ఉత్పత్తి విషయంలోనూ మిగులు కన్పించడం లేదు. ఇది వ్యవసాయ విశ్వవిద్యాలయ సమాచారమనేది గమనార్హం. నియంత్రిత విధానంలో రాష్ట్రాలను బహుముఖంగా పంటలలో అభివృద్ధి చేయాలి. తెలంగాణలో సమశీతోష్ణ పరిస్థితుల కారణంగా ఇక్కడ అన్ని పంటలు పండడానికి అవకాశాలున్నాయి. కానీ అందుకు తగిన పరిశోధనలు జరగడంలేదు. రాష్ట్రంలో 27 వ్యవసాయ పరిశోధన కేంద్రాలున్నాయి.


మూడు వేల ఎకరాలలో ఇక్రిశాట్‌ పరిశోధన కేంద్రం ఉన్నప్పటికీ గత ఐదేళ్ళుగా అక్కడ పరిశోధనలు జరగడం లేదు. ఈ శోచనీయ పరిస్థితిని మనం శీఘ్రగతిన అధిగమించాలి. ధనిక దేశాలు మన దేశాన్ని, రాష్ట్రాన్ని తమ దిగుమతులకు కేంద్రంగా చేసుకోవడాన్ని గట్టిగా నిరోధించాలి. మనకు ఉన్న సాగుభూములలో ఉత్పత్తులను ఇతోధికం చేసుకునేందుకు పూనుకోవాలి. అప్పడే వ్యవసాయ రంగంలో గుర్తింపు పొందిన రాష్ట్రంగా తెలంగాణ వర్థిల్లగలుగుతుంది. కేవలం వరి, పత్తి పంటలతో వ్యవసాయ రంగం, తద్వారా రాష్ట్రాభివృద్ధి సుసాధ్యమవగలదని ఆశించడం సరికాదు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ వనరులను వినియోగించడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తులు సాధించి, రాష్ట్ర అవసరాలకు పోను ఎగుమతి అవకాశాలు కల్పించుకోవడానికి ప్రణాళికలు రూపొందించాలి. 


రాష్ట్రప్రభుత్వం ధరల నిర్ణయక సంఘాన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా పంటల ధరలు నిర్ణయించాలి. కూరగాయలు తదితర కొన్ని పంటలు పండిన ఉత్పత్తిలో 30 శాతం వినియోగానికి రాక నష్టపోతున్నాయి. ఫలితంగా రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వమూ ఎంతో ఆదాయాన్ని కోల్పోతోంది. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్‌, సివిల్‌ సప్లయిస్‌ శాఖలను సమన్వయ పరిచి ప్రణాళికలు రూపొందించాలి. వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాలలో ఎంపిక చేసిన రైతులకు గ్రూపుల వారీగా శిక్షణలు ఇవ్వాలి. ప్రతి మార్కెట్‌ కమిటీ వ్యవసాయ శిక్షణలు జరిపే సంస్థలుగా రూపొందాలి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలు జరపాలి. రైతులకు ఫలితాల కార్డులు ఇవ్వాలి. అధునిక యంత్రాల ద్వారా వ్యవసాయం చేయడానికి వీలుగా రైతులకు ఉపయోగపడే చిన్న యంత్రాలను పెద్దఎత్తున మార్కెట్‌లోకి తేవాలి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా విత్తనాలను రూపొందించాలి. విత్తనంతోనే వ్యవసాయరంగంలో విప్లవం వస్తోంది. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలైన పాడి, పౌల్ట్రి, చిన్న పశువుల పెంపకం, చేపల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చి వ్యవసాయ ఆదాయానికి తోడు మరింత ఆదాయాన్ని జతపరచాలి. అప్పడే పల్లేసీమలలో అనందం వెల్లివిరుస్తుంది. ఈ ప్రణాళిక అమలు చేయడం ద్వారా మాత్రమే రాష్ట్రప్రభుత్వం అమలుపరిచే నియంత్రిత విధానానికి ఒక రూపం, గుర్తింపు వస్తుంది. ఇందుకు నిధుల వ్యయం అంతగా ఉండదు. ప్రభుత్వం మధ్య దళారీల ఒత్తిడికి లొంగి విధానాలు మార్చుకోకుండా ఉన్నపుడే ఆ ప్రణాళిక ప్రయోజనకరంగా ఉంటుంది. 


మూడ్‌ శోభన్‌

రాష్ట్ర సహాయ కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం

Updated Date - 2020-11-20T06:54:55+05:30 IST