Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 01 Feb 2020 19:43:13 IST

ప్రగతి చక్రం, పదిల ప్రయాణం!

twitter-iconwatsapp-iconfb-icon
ప్రగతి చక్రం, పదిల ప్రయాణం!

ఏమిరేట్స్, ఖతర్ ఎయిర్‌వేస్ ఇత్యాది విదేశీ ఎయిర్‌లైన్స్‌తో దేశీయ విమానయాన సంస్థలు వినియోగించే విమాన ఇంధనంపై ఉన్న 16 శాతం వ్యాట్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క కలం పోటుతో ఒక శాతానికి కుదించింది. అశేష సామాన్య ప్రజల ప్రయాణ సాధనమైన ఆర్టీసీ వినియోగించే డీజిల్‌పై మాత్రం 27 శాతం పన్నును వసూలు చేస్తోంది!

 

దుబాయి నుంచి బొంబాయి (నేటి ముంబై)కి రావడం చాలా సులభమే కాదు, సురక్షిత ప్రయాణం కూడా. అయితే బొంబాయి నుంచి తమ స్వంత స్థలాలకు చేరుకోవడం అంత సులభం కాదు, సురక్షితం అంతకన్నా కాదు. గల్ఫ్ దేశాల నుంచి వస్తూ దొంగల హస్తలాఘవానికి సామాన్లను పోగొట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు పెద్ద సంఖ్యలోనే వున్నారు. ఏదైనా ఒక అరబ్ దేశం నుంచి బొంబాయిలో విమానం దిగిన తెలుగువారు వర్లీలోని బి.డి.డి చాళ్ళకు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు వీటిలో ఎక్కువగా వుండేవారు) వెళ్ళి బస చేసేవారు. ఆ తరువాత మన ఆర్టీసి బస్సులలో ధైర్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళేవారు.


1980 నాటి ఒక విశేషం చెబుతాను. ఆ సంవత్సరం కరీంనగర్ డిపో కామారెడ్డి మీదుగా బొంబాయికి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. అప్పుడు అదో పెద్ద సంచలనం. విమానయానం కంటే ప్రతిష్ఠాత్మకమైనది. ఆ తర్వాత కాలంలో తెలంగాణ జిల్లాల నుంచి నిత్యం 18 బస్సులను బొంబాయికి నడిపేవారు. అన్నీ కిక్కిరిసి పోతుండేవి. దివంగత ప్రధానమంత్రి పాములపర్తి వేంకట నరసింహారావు రాజకీయ ప్రస్థానం మంథని నియోజకవర్గం నుంచి ప్రారంభమైన విషయం విదితమే. ఆయన తన నియోజక వర్గానికి ఏమైనా గొప్ప సేవ చేశారంటే అది, ముఖ్యమంత్రిగా హైదరాబాద్ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సును హైదరాబాద్ నుంచి మంథనికి నడిపించడమే. 


దుబాయి నుండి వచ్చి వెళ్ళే ప్రవాసీ కావచ్చు లేదా రాష్ట్ర రాజధాని నుంచి మారుమూల ప్రాంతాలలోని సొంత గ్రామాలకు వెళ్ళే వారు కావచ్చు లేదా వైరా నుంచి మేడారం జాతరకు వచ్చే యాత్రికుడు కావచ్చు లేదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళే దారిలోని విద్యార్థులు కావచ్చు... అందరికీ ఆర్టీసీ బస్సు ఒక అభయ ప్రయాణ సాధనం. ప్రజారవాణా వ్యవస్థకు ప్రధాన ఆలంబనగా వున్న ఆర్టీసీ చరిత్ర విశిష్టమైనది. బ్రిటిష్ హయాంలో బ్రిటిష్ ఇండియా నుంచి విదేశాలకు విమానయానం అరుదైన విషయం. అయితే ఆ కాలంలోనే హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిర్వహించిన ఘన చరిత్ర గల రవాణా వ్యవస్థ హైదరాబాద్ రాజ్యానికి వుండేది. ఆ సమున్నత వారసత్వం నుంచి ఆవిర్భవించింది మన ప్రస్తుత రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిజాం హయాంలో విమానయాన సర్వీసులు, రైల్వేలు, రోడ్డు రవాణా వ్యవస్థ ఒకే విభాగం క్రింద విజయవంతంగా పని చేశాయి. 


బ్రిటిష్ వలస పాలకులు రైలు రవాణా వ్యవస్ధను తమ వజ్రాయుధంగా మార్చుకొని భారత్‌పై అధిపత్యం చలాయిస్తున్న తరుణంలో హైదరాబాద్ సంస్థానంలో నిజాం సర్కారు, ఆంగ్లేయులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సొంతంగా రైల్వే లైన్లు నిర్మించింది. నిర్మించడమే కాదు విజయవంతంగా రైళ్ళు నడిపి మంచి లాభాలూ ఆర్జించింది. రోడ్డు రవాణాను మెరుగుపర్చడంతో పాటు రైల్వేలకు అనుబంధంగా ప్రయాణికుల రాకపోకల సౌకర్యాలను మెరుగుపర్చడానికి పూనుకున్నది. ఈ మేరకు నిజాం స్టేట్ రైల్వే (ఎన్.ఎస్.ఆర్) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 1932లో రోడ్ మెకానికల్ ట్రాన్స్‌పోర్టు సర్వీసెస్ (ఆర్.ఎం. టి.యస్)ను నెలకొల్పింది. ఈ సేవలకు గాను ప్రస్తుత ఇమ్లిబన్ సెంట్రల్ బస్ స్టేషన్‌కు ఎదురుగా గౌలిగూడలోని పాత సెంట్రల్ బస్ స్టేషన్ ఆవరణలో అమెరికన్ నిపుణులు ఒక సువిశాలమైన హాంగర్‌ను నిర్మించారు. బ్రిటన్ నుండి దిగుమతి చేసున్న ప్రపంచంలోకెల్లా అత్యాధునికమైన 27 బస్సులతో 166 సిబ్బందితో రోడ్డు రవాణా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే సంకల్పంతో 1936లో ప్రత్యేకంగా రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ (ఆర్.టి.డి)ని నెలకొల్పారు. తదనంతర కాలంలో ఈ సంస్థను మరింత పటిష్ఠపరిచి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ (ఆర్టీఎస్)ను నెలకొల్పారు. చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి అమ్తుల్ జహేరా (ఎ.జెడ్) పేర ఈ బస్సులను రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ రిజిస్ట్రేషన్ విధానమే ఇప్పటికి ఆర్టీసీలో ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. 


హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన మూడేళ్ళ వరకు కూడా ఆర్టీఎస్ కొనసాగింది. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ శాఖగా 1958 వరకు నడిచి, ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.గా తుదిరూపం దిద్దుకొంది. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ ఆర్టీసీని నవభారతంలోని కొత్త రాష్ట్రాలన్నీ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మన ఆర్టీసి యావత్తు దేశానికి దిక్సూచిగా నిలవడమే కాకుండా అతి పెద్ద రోడ్డు రవాణా ప్రయాణికుల వ్యవస్థగా గిన్నిస్ బుక్ రికార్డులో నమోదయింది. సరే, వర్తమానానికి వస్తే అది ఆర్టీసీ కావచ్చు లేదా ఎయిర్ ఇండియా కావచ్చు లేదా బి.ఎస్.ఎన్.ఎల్. కావచ్చు లేదా ఇండియన్ ఆయిల్ కావచ్చు... ఇలా ఎన్నో ఘనచరిత్ర కల్గిన ప్రభుత్వ రంగ సంస్థల పట్ల ప్రభుత్వాలు అనుసరించే వైఖరి విస్మయం కలిగిస్తుంది. అన్ని రకాల సామర్థ్యం కలిగివుండి కూడా లాభాలను ఆర్జించే సత్తా కల్గిన ఈ కీలక సంస్థలను ప్రభుత్వాలే నిర్వీర్యం చేస్తున్నాయి. ఆ సంస్థల పట్ల పాలకులు వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే ఈ వాస్తవం అర్థమవుతుంది. 


ఏమిరేట్స్, ఖతర్ ఎయిర్ వేస్ ఇత్యాది విదేశీ ఎయిర్ లైన్సులతో పాటు, దేశీయ విమానయాన సంస్థలు వినియోగించే విమాన ఇంధనంపై ఉన్న 16శాతం వ్యాట్‌ను టీ.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వం ఒక్క కలం పోటుతో 1 శాతానికి కుదించింది. అయితే అశేష సామాన్య ప్రజల ప్రయాణ సాధనమైన ఆర్టీసీ వినియోగించే డీజిల్‌పై మాత్రం 27శాతం పన్నును వసూలు చేస్తోంది! ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం మొదలైన డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చరిత్రాత్మక కారణాల రీత్యా ఇతర రాష్ట్రాల ఆర్టీసీలకి, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి వ్యత్యాసం ఉన్నది. కారణాలు కార్మికులా లేక ప్రభుత్వమా అనే విషయాన్ని పక్కన పెడితే, ఘనమైన ఆర్టీసీకి నేడు తెలంగాణ రాష్ట్రంలో దాపురించిన దుస్థితి అమితంగా ఆవేదన కలిగిస్తోంది.Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.