Volcano-Selfie: అగ్నిపర్వతంపై యువకుడి సెల్ఫీ.. చివరికి..

ABN , First Publish Date - 2022-07-14T02:29:59+05:30 IST

సెల్ఫీలు తీసుకోవడమంటే అందరికీ ఇష్టమే. కానీ..సెల్ఫీ పేరిట ప్రమాదాలను కొని తెచ్చుకోకూడదు. అదృష్టంకలిసి రాకపోతే జీవితమే అంతమైపోవచ్చు.

Volcano-Selfie: అగ్నిపర్వతంపై యువకుడి సెల్ఫీ.. చివరికి..

ఎన్నారై డెస్క్: సెల్ఫీలు తీసుకోవడమంటే అందరికీ ఇష్టమే. కానీ..సెల్ఫీ పేరిట ప్రమాదాలకు ఎదురెళ్లకూడదు. అదృష్టంకలిసి రాకపోతే జీవితమే అంతమైపోవచ్చు. సెల్ఫీపై పిచ్చితో ఓ అమెరికా యువకుడు ఏకంగా అగ్నిపర్వతంపైనే దుస్సాహసానికి పూనుకుని ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు. తన కుటుంబంతో  కలిసి అతడు ఇటీవల ఇటలీ పర్యటనకు వెళ్లాడు. అక్కడ మౌంట్ వెసూవియస్‌ అనే అగ్నిపర్వతంపైకి ఎక్కాడు.  అగ్నిపర్వతం ముఖద్వారం వద్ద నిలబడి అతడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. చేతిలోంచి మొబైల్ ఫోన్ జారి బిలంలో పడిపోయింది. దీంతో.. అతడూ బిలంలోకి దిగాడు. లోపలికి వెళుతుండగా కాలు జారడంతో అతడు కొన్ని మీటర్ల లోతుకు పడిపోయాడు. ఫలితంగా ఒళ్లంతా గీరుకుపోయి గాయాలయ్యాయి. 


సమీపంలోనే ఉన్న కొందరు గైడ్లు వెంటనే అప్రమత్తమై అతడు మరింత లోతుకు జారిపోకుండా కాపాడారు. ఈలోపు స్థానిక పోలీసులు ఆ యువకుడిని హెలికాఫ్టర్ సాయంతో అగ్నిపర్వతం బిలంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ యువకుడు చాలా అదృష్టవంతుడని స్థానిక పోలీసు ఒకరు వ్యాఖ్యానించారు. అతడు మరింత లోతుకు జారిపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేదని వ్యాఖ్యానించారు. కాగా.. అమెరికా యువకుడు నిషేధిత మార్గంలో అగ్నిపర్వతంపైకి వెళ్లాడని స్థానిక గైడ్ ఒకరు చెప్పారు. ఇక పోలీసులు ఆ యువకుడితో పాటూ అతడి కుటుంబసభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా..  ప్రపంచంలోని ప్రమాదకరమైన అగ్నిపర్వతాల్లో మౌంట్ విసూవియస్ కూడా ఒకటి. క్రీశ 79లో ఇది బద్దలవడంతో రోమన్ నగరమైన పాంపే పూర్తిగా ధ్వంసమైపోయింది. 



Updated Date - 2022-07-14T02:29:59+05:30 IST