తప్పించుకునేందుకు యత్నిస్తున్నారా?

ABN , First Publish Date - 2021-10-19T08:16:05+05:30 IST

అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా తప్పించుకునేందుకు యత్నిస్తున్నారా? అంటూ శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిపై దిశ ఎన్‌కౌంటర్‌ విచారణ కమిషన్‌ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

తప్పించుకునేందుకు యత్నిస్తున్నారా?

  • నిందితుడి వాంగ్మూలాన్ని ఎలా బహిర్గతం చేస్తారు?
  • శంషాబాద్‌ డీసీపీకి దిశ కమిషన్‌ ప్రశ్నల పరం

హైదరాబాద్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా తప్పించుకునేందుకు యత్నిస్తున్నారా? అంటూ శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిపై దిశ ఎన్‌కౌంటర్‌ విచారణ కమిషన్‌ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దిశ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌ వాంగ్మూలం కోర్టులో పరిధిలోని అంశమని, దాన్ని ప్రెస్‌మీట్‌లో ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించింది. హైకోర్టు ప్రాంగణంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ తాజాగా జరిగింది. ఎన్‌కౌంటర్‌ కేసు దర్యాప్తు అధికారి, రాచకొండ ఎస్‌వోటీ డీసీపీ సురేందర్‌రెడ్డితో పాటు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వాంగ్మూలాలను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య విచారణ కమిషన్‌ నమోదు చేసింది. 


ఆరిఫ్‌ వాంగ్మూలంలోని వివరాలను ప్రెస్‌మీట్‌లో వెల్లడించలేదని, దర్యాప్తులో అతడు మౌఖికంగా చెప్పిన వివరాలనే మీడియా ప్రతినిధులకు అప్పటి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చెప్పారని అధికారులు కమిషన్‌కు వివరించారు. 2019 నవంబరు 29న సాయంత్రం 5 గంటలకు నిందితులను అరెస్టు చేస్తే.. కేవలం పావుగంటలోనే వారు నేరాన్ని అంగీకరించారా? అని కమిషన్‌ ప్రశ్నించగా.. అధికారులు అవునని సమాధానం ఇవ్వడం గమనార్హం. అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పడం లేదని, దర్యాప్తులో ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తారా? అంటూ ఎన్‌కౌంటర్‌ కేసు దర్యాప్తు అధికారి సురేందర్‌రెడ్డిపై విచారణ కమిషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.  

Updated Date - 2021-10-19T08:16:05+05:30 IST