మిల్లు తెరిచేందుకు ప్రయత్నించండి

ABN , First Publish Date - 2021-06-24T05:07:25+05:30 IST

ఇరువర్గాలు ఒక మెట్టుదిగి.. నెల్లిమర్ల జూట్‌ మిల్లును తెరిచేందుకు ప్రయత్నించాలని యాజమాన్యాన్ని, కార్మిక నాయకత్వాన్ని జేసీ వెంకటరావు కోరారు. జూట్‌మిల్లు లాకౌట్‌ సమస్యపై మంత్రుల ఆదేశం మేరకు కలెక్టరేట్‌లో మిల్లు యాజమాన్య ప్రతినిధులు, కార్మిక నాయకులతో బుధవారం జేసీ వెంకటరావు భేటీ అయ్యారు.

మిల్లు తెరిచేందుకు ప్రయత్నించండి
మాట్లాడుతున్న జేసీ వెంకటరావు

నెల్లిమర్ల జూట్‌ యాజమాన్యం, యూనియన్‌ నాయకులతో చర్చించిన జేసీ

కలెక్టరేట్‌, జూన్‌ 23: ఇరువర్గాలు ఒక మెట్టుదిగి.. నెల్లిమర్ల జూట్‌ మిల్లును తెరిచేందుకు ప్రయత్నించాలని యాజమాన్యాన్ని, కార్మిక నాయకత్వాన్ని జేసీ వెంకటరావు కోరారు. జూట్‌మిల్లు లాకౌట్‌ సమస్యపై మంత్రుల ఆదేశం మేరకు కలెక్టరేట్‌లో మిల్లు యాజమాన్య ప్రతినిధులు, కార్మిక నాయకులతో బుధవారం జేసీ వెంకటరావు భేటీ అయ్యారు. ముందుగా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సీహెచ్‌ పురుషోత్తం మాట్లాడుతూ ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే జూట్‌ మిల్లును యాజమాన్యం ఆపేసిందని చెప్పారు. నిబంధనల ప్రకారం 90 రోజులు ముందుగా నోటీసు ఇచ్చి సహేతుక కారణాలు చూపిన తరువాత అనుమతి తీసుకుని మాత్రమే మిల్లు మూయాలన్నారు. జూట్‌ మిల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ సీఈవో ఎంవీ రావు మాట్లాడుతూ ఆర్థిక నష్టాలతో మిల్లును మూసి వేయాల్సి వచ్చిందని... ఇలాంటి పరిస్థితిలో ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. కార్మికులు తరుచూ విధులకు గైర్హాజరు కావడం... ఉత్పత్తి పడిపోవడం.. ఖర్చు పెరిగిపోవడంతో మిల్లులో ఉత్పత్తిని ఆపేయాల్సి  వచ్చిందన్నారు. స్థానికంగా ముడి సరుకు దొరకకపోవడం వల్ల టన్నుకు అదనంగా రూ.3 వేలు చెల్లించి బెంగాల్‌ నుంచి తీసుకు వస్తున్నామని చెప్పారు. శ్రామిక సంఘం అధ్యక్షుడు పతివాడ అప్పారావు మాట్లాడుతూ యాజమాన్యం వాదనను వ్యతిరేకించారు. పాతకాలం నాటి మిషన్లు, నాసిరకం ముడిసరుకుల కారణంగానే ఉత్పత్తి తగ్గిపోయిందని, ఆ నెపాన్ని కార్మికులపై నెట్టడం సరికాదని అన్నారు. చివరిగా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటరావు మాట్లాడుతూ ఇరువర్గాలూ ఒక మెట్టు దిగినప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇరువర్గాలు చర్చించి మధ్యే మార్గంగా ఒక అంగీకారానికి రావాలని సూచించారు. వారం రోజుల్లో మరోసారి ఇరువర్గాలతో చర్చలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భేటీలో ఏసీఎల్‌ రమాదేవి, ఏఎల్‌వో అరుణకుమారి, మిల్లు యాజమాన్యం తరపున జనరల్‌ మేనేజర్‌ పీకే ఘాష్‌, కమర్షియల్‌ మేనేజర్‌ పంకజ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-24T05:07:25+05:30 IST