దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-04-19T06:21:57+05:30 IST

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను అందజేస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌

 అంగవైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదు  


మంత్రి సత్యవతి రాథోడ్‌


మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర గిరిజన స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో ఆదివారం ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ హయాంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ దివ్యాంగుల పెన్షన్‌ రూ.1500 నుంచి రూ. 3016కి పెంచి దివ్యాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. అంగవైకల్యం శరీరానికే కాని, మనస్సుకు కాదని... లక్ష్యంతో ముందుకు వెళ్తే ఏదైనా సాధించవచ్చని దివ్యాంగులు ధృడ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు కూడా ఈ ప్రాంతంలోనే తయారు చేసి ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. దివ్యాంగులెవరూ అధైర్యపడొద్దని, అన్ని వేళల్లో తెలంగాణ సర్కార్‌ వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.  కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ మాట్లాడుతూ గతంలో ట్రైసైకిళ్లను చేతితో తిప్పుతూ దివ్యాంగులు అవస్థలు పడేవారని, బ్యాటరీ సైకిళ్లతో ఆ కష్టాలు తొలిగిపోతాయన్నారు. ట్రైసైకిళ్లు అందించిన ఆలింకో సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.  నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ఆహర్నిశలు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. కరోనావ్యాప్తి నేపథ్యంలో దివ్యాంగులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, జిల్లా సంక్షేమ అధికారి సబిత, మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, ఆర్డీవో కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ ఎండి.ఫరీద్‌, కౌన్సిలర్లు మార్నేని వెంకన్న, హరిసింగ్‌నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాయిని రంజిత్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ సుధగాని మురళీ, ఐసీడీఎస్‌ సీడీపీవో డెబోరా, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు బూర్ల ఉపేందర్‌గౌడ్‌, ఖాజా పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T06:21:57+05:30 IST