సత్యధర్మాలు

ABN , First Publish Date - 2020-12-05T09:56:16+05:30 IST

సత్యం.. ధర్మం అనేవి ఎల్లప్పుడూ కలిసి ఉండేవి. సత్యం మార్పులకు నోచుకోకుండా ఒకే విధంగా ఉంటుంది. ధర్మం మాత్రం దేశాన్ని, కాలాన్ని, వయస్సును, పుట్టిన వంశాన్ని, బ్రహ్మచర్య గృహస్థు మొదలైన ఆశ్రమాలను బట్టి మారుతుంది. మనసులో మాటల్లో చేష్టల్లో సత్యాన్నే పాటిస్తూ..

సత్యధర్మాలు

 త్యం.. ధర్మం అనేవి ఎల్లప్పుడూ కలిసి ఉండేవి. సత్యం మార్పులకు నోచుకోకుండా ఒకే విధంగా ఉంటుంది. ధర్మం మాత్రం దేశాన్ని, కాలాన్ని, వయస్సును, పుట్టిన వంశాన్ని, బ్రహ్మచర్య గృహస్థు మొదలైన ఆశ్రమాలను బట్టి మారుతుంది. మనసులో మాటల్లో చేష్టల్లో సత్యాన్నే పాటిస్తూ.. ధర్మబద్ధంగా జీవించడం అనేది మానవ జీవితానికి మూలసూత్రం. సత్యధర్మాలు ఒక నాణేనికి రెండు పార్శ్వాల వంటివి. సత్యం అందరికీ సమానమే. సత్యాచరణకు పేద-ధనిక తరతమ బేధాలు ఉండవు. అంతా సత్యాన్ని విధిగా అనుసరించాల్సిందే. ధర్మం అలా కాదు. ఒకే కకుటుంబంలోని తల్లి, తండ్రి, కూతురు, కుమారుడు, కోడలు మొదలైన వారికి సమాజంలోని బ్రహ్మచారులు.. గృహస్థులు.. సన్యాసులు.. స్త్రీలు.. పురుషులు.. బాలలు.. వృద్ధులకు ఆచరించదగ్గ ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి.


దశరథుడికి, కైకేయికి వివాహం జరిగినప్పుడు.. కైకేయి కుమారునికే రాజ్యాధికారాన్ని కల్పిస్తానని దశరథుడు ప్రతిజ్ఞ చేశాడు.  కానీ.. గుణవంతుడు, పెద్దవాడు అయిన శ్రీరామునికే రాజ్యపట్టాభిషేకం చేయాలని ప్రజలు, అధికారులు, అంతఃపురవాసులు.. అన్నివర్గాల వారు కోరుకున్నారు. ప్రజాభిప్రాయాన్ని అనుసరించడం రాజధర్మం. అందుకే దశరథుడు తాను ఇచ్చిన మాటను కాదని, శ్రీరాముడికే పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు. సత్యధర్మాలు దశరథునికి వేర్వేరు మార్గాలను చూపించాయి. అయితే.. దశరథుడు భరతుడి అనుమతి, కైకేయి అంగీకారాన్ని పొందాకే.. శ్రీరాముడికి రాజ్యాన్ని అప్పగించాలని భావించాడు. కానీ.. వారు ఒప్పుకోరేమోననే ఉద్దేశంతో రాజధర్మం వైపు మొగ్గుచూపాడు. అందుకే.. భరతుడు నగరంలో లేనప్పుడు.. కైకేయికి చెప్పకుండా.. మంత్రులు, పురోహితులు, సామంతులు, ప్రజలను ఆహ్వానించి.. శ్రీరామ పట్టాభిషేకాన్ని ప్రకటించాడు. అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రజామోదాన్ని ఆసరాగా చేసుకుని, దశరథుడు తన ప్రతిజ్ఞను పక్కన పెట్టాడు. అయినా.. మనసులో ఏదో ఒక కోశాన ధర్మాన్ని పాటించడంలేదనే శంక ఉండడంతో.. కైకేయి తండ్రి కేకయరాజుకు, సీతాదేవి తండ్రి జనక మహారాజుకు ఆహ్వానాన్ని పంపలేదు. సమయం లేదనే సాకు చెప్పవచ్చని ఆయన భావించాడు. కానీ, మంధర గుర్తుచేసిన రెండు వరాలను అడ్డుపెట్టుకుని కైక.. దశరథుణ్ని సత్యంతో బంధించింది.


భరతుడికి రాజ్యాన్ని అప్పగించాలని.. రాముడిని అరణ్యవాసానికి పంపాలని కోరింది. ఇరువురి ఆంక్షలూ నెరవేరలేదు. చివరకు శ్రీరామపాదుకలకు పట్టాభిషేకం జరిగింది. ధర్మవిరుద్ధమైన సత్యం.. సత్యవిరుద్ధమైన ధర్మం నిలబడవు అని మనకు స్పష్టం చేసే ఉదంతమిది.. కాబట్టి ఎవరైనా సత్యధర్మాలకు సముచిత స్థానాన్ని కల్పించేందుకు యథాశక్తిగా కృషిచేయాలి.

 సముద్రాల శఠగోపాచార్యులు, 9059997267

Updated Date - 2020-12-05T09:56:16+05:30 IST