సత్యాన్ని వదిలితే భగవంతుని వదిలినట్లే

ABN , First Publish Date - 2020-04-04T07:13:20+05:30 IST

అని ముండకోపనిషత్తు చెబుతోంది. సత్యమే జయిస్తుంది. అబద్ధం గెలవదు. ఋషులంతా ఆ సత్యమార్గం ద్వారానే పరమాత్మను చేరుకోగలిగారని దీని అర్థం. భారతంలో కూడా శకుంతల దుష్యంతునితో...

సత్యాన్ని వదిలితే భగవంతుని వదిలినట్లే

  • సత్యమేవ జయతే నానృతమ్‌
  • సత్యేన పంథా వితతో దేవయానః
  • యేనా క్రమంతి ఋషయో హి ఆప్తాకామా
  • యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్‌

..అని ముండకోపనిషత్తు చెబుతోంది. సత్యమే జయిస్తుంది. అబద్ధం గెలవదు. ఋషులంతా ఆ సత్యమార్గం ద్వారానే పరమాత్మను చేరుకోగలిగారని దీని అర్థం. భారతంలో కూడా శకుంతల దుష్యంతునితో.. మంచినీళ్లతో నిండిన నూరు బావుల కన్నా ఒక దిగుడుబావి మేలు.. అలాంటి నూరు బావుల కంటే ఒక యజ్ఞం మేలు.. అలాంటి నూరు యజ్ఞాల కంటే ఒక కొడుకు.. అలాంటి నూరుగురు కొడుకుల కంటే ఒక సత్యవాక్యం మేలు అని హితవు చెబుతుంది. భగవంతుడు సత్యస్వరూపుడు. సత్యాన్ని వదిలితే, భగవంతుని వదిలినట్లే! అందుకే శ్రీరామకృష్ణులు కాళీ మాత ముందు సర్వం అర్పిస్తూ.. ‘అమ్మా! ఇదిగో నీ జ్ఞానం, ఇది నీ అజ్ఞానం, నీ ఖ్యాతి - అపఖ్యాతి ఇదిగో’ అన్నాడే కానీ ‘ఇదిగో నీ సత్యం-ఇదిగో నీ అసత్యం’ అని అనలేదు. సత్యాన్ని వదిలితే భగవంతుని వదిలినట్లేనని గుర్తుచేశారు. ‘దైవాధీనంతు జగత్సర్వం.. సత్యాధీనంతు దైవం’ అని సూక్తి. ఈ జగత్తు సర్వం దైవాధీనమయితే, ఆ దైవం సత్యాధీనమై ఉంటాడని దీని అర్థం. దేవతలను సైతం భువికి దింపే శక్తి సత్య నిష్ఠకు ఉందనడంలో సందేహం లేదు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. యుగాలు, తరాలు మారినా సత్యవ్రతుల చరిత్ర సుస్థిరమైనది. సత్య హరిశ్చంద్రుడు సత్యానికి ప్రతిరూపం. తన సర్వస్వాన్నీ కోల్పోయినా హరిశ్చంద్రుడు సత్యాన్ని వీడలేదు. అతని సత్యవ్రతానికి దేవతలు సైతం జోహార్లు అర్పించారు. అలాగే.. బలిచక్రవర్తి కూడా సత్యానికి, ధర్మానికి నిలబడిన రాజు. కనుకనే తాను పాతాళానికి వెళ్లవలసి వస్తుందని తెలిసినా సత్యధర్మంతో వామనుడి మూడో అడుగును తన శిరస్సున ఉంచమన్నాడు. సత్యనిష్ఠుల గొప్పతనం అది. అందుకే వారు చరిత్రలో అమరులయ్యారు. 


కలియుగంలో సత్యపాలనే నిజమైన తపస్సు. సత్యాన్ని అంటిపెట్టుకొని మన విధులను నిర్వర్తించడమే మహా తపస్సవుతుంది. ఈ తపస్సును ఆచరించిన వాడే భగవంతుని చూడగలుగుతాడు. అలాంటివారు పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. భక్తతుకారాం, రామదాసు వంటివారు ఇందుకు ఉదాహరణలు. మనిషి జీవితంలో యవ్వనం, సౌందర్యం, డబ్బు, పేరు ప్రతిష్ఠల వంటివన్నీ అశాశ్వతాలే. శాశ్వతంగా నిలిచేది సత్యం మాత్రమే. ‘సత్యమేవ పదం’.. సత్యమే ఏకైక మార్గము. సత్యమే భగవంతుడు. సత్యమునందే ధర్మం సుప్రతిష్ఠమై ఉంటుంది. సర్వ వేదాల సారం సత్యస్వరూపము. సత్యం ద్వారానే పరమపదం ప్రాప్తిస్తుందని సర్వదా గ్రహించాలి. సత్యపదమే మానవ జీవిత లక్ష్యంగా ఎంచుకోవాలి. సత్యనిష్ఠను పాటించేవారి కష్టాలు అశాశ్వతాలు. అసత్యాలు చెప్పే వారి సుఖాలు శాశ్వతంగా నిలవవు. సత్యమే ఎప్పటికైనా జయిస్తుంది. అలాంటి సత్యనిష్ఠకు కట్టుబడి ఉండడానికి కావాల్సింది అభ్యాసం, పెద్దల ఆశీర్వాదం, పురాణ పఠనం, సత్సాంగత్యం. 

- పరాంకుశం శ్రీనివాసమూర్తి, 9493455256


Updated Date - 2020-04-04T07:13:20+05:30 IST